సాక్షి ప్రతినిధి, కర్నూలు : రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ అక్రమాలకు తెరలేపింది. తమ పనులు చక్కబెట్టుకోవడానికి టీడీపీ నేతలు అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జిల్లాలో ఆదర్శ రైతులుగా, రేషన్ షాపుల డీలర్లుగా, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా తమ వారిని నియమించుకోవడానికి అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు.
తమ మాట వినకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని తమ్ముళ్లు బెదిరిస్తున్నారు. జిల్లాలో ప్రజలు అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. జిల్లాలో ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. ఆదర్శ రైతులు, రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీదారులను టార్గెట్ చేస్తున్నారు. ఎంతమంది ఆదర్శ రైతులు, రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్నం భోజనం ఏజెన్సీదారులు ఉన్నారోనని వివరాలు సేకరించారు.
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శ రైతుల వ్యవస్థను తీసుకొచ్చారు. వ్యవసాయంపై అనుభవం ఉన్న వారిని ఔట్‌సోర్సింగ్ ద్వారా ఆదర్శ రైతులుగా నియమించారు. వారి ద్వారా పల్లెల్లో వ్యవసాయ పద్ధతుల గురించి ఎప్పటికప్పుడు వివరించి రైతులకు మేలు జరిగేలా చేశారు. అందుకు వారికి నెలనెలా గౌరవ వేతనం కూడా ఇచ్చారు. అయితే వైఎస్ మరణం తరువాత ఆ వ్యవ స్థను నీరుగార్చారు.
ఆ తర్వాతి ముఖ్యమంత్రుల కాలంలో తమకు అనుకూలంగా ఉన్న వారిని, పార్టీ కోసం పనిచేసే వారిని ఆదర్శ రైతులుగా నియమించారు. అదే దారిలో ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా అడుగులేస్తున్నారు. మొదటి నుంచి అక్కసుతో ఉన్న చంద్రబాబు అధికారం చేపట్టగానే ఆదర్శ రైతులను టార్గెట్ చేశారు. ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో ప్రకటించినా.. ఆ డ్రామా అంతా తెలుగు తమ్ముళ్ల కోసమేనని ఆ పార్టీ శ్రేణులే అంగీకరిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1629 మంది ఆదర్శ రైతులు ఉన్నారు. వీరు 2006 నుంచి కొనసాగుతున్నా.. వీరిని తొలగించి వారి స్థానంలో తమ అనుచరులను నియమించేందుకు టీడీపీ నేతలు జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.
రేషన్ షాపులపై తమ్ముళ్ల గురి
ఇక జిల్లాలోని రేషన్ షాపులపైనా దేశం నేతలు కన్నేశారు. జిల్లాలో 2411 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో 187 దుకాణాలు ఇన్‌చార్జ్ డీలర్ల ద్వారా నడుస్తున్నాయి. వీటిని తెలుగు తమ్ముళ్లు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇన్‌చార్జ్ డీలర్ల స్థానంలో ఇప్పటికే టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు రంగం సిద్ధం చేశారు. మిగిలిన వాటినీ తమ వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రెగ్యులర్ డీలర్ ఉన్న షాపులపై టీడీపీ కార్యకర్తలు లేదా వారి అనుచరుల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయిస్తున్నారు. తనిఖీ నిర్వహించేలా ఒత్తిడి చేసి ఆ డీలర్‌ను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారు.
కోడుమూరు, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, బనగానపల్లె ప్రాంతాల పరిధిలో ఇలాంటి అరాచకాలకు తెరతీసినట్లు తెలిసింది. అంతేకాకుండా నెలనెలా తమకు మామూళ్ల రూపంలో బియ్యం, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను ఇంటికి పంపాలని డీలర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వినకపోతే ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు డోన్ నియోజకవర్గ పరిధిలోని ఓ డీలర్ ‘సాక్షి’ వద్ద కన్నీరుపెట్టారు. అదే విధంగా గోదాముల నిర్వాహకులను తమ్ముళ్లు వదలడం లేదు. నెలనెలా 200 బియ్యం బస్తాలు ఇంటికి పంపాలని టీడీపీ నాయకుడొకరు గోదాము నిర్వాహకుడిపై దౌర్జన్యం చేసినట్లు తెలిసింది.
భయపడిన ఆ నిర్వాహకుడు ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి పిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి టీడీపీ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి తమలాంటి వారికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాగా.. కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలిని తొలగించకున్నా.. టీడీపీకి చెందిన ఓ మహిళ ఏకంగా భోజనాన్ని వండి తెచ్చి, విద్యార్థులకు వడ్డించడానికి యత్నించడం వారి ఆగడాలకు పరాకాష్టగా భావించాల్సి వస్తుంది.
టార్గెట్.. 4040
Published Wed, Jul 16 2014 3:44 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement