ఆదర్శ రైతులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్యమిత్రలు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు.. వీళ్లంతా గత ఏడాదిన్నర కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు. తాజాగా ఈ జాబితాలోకి మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బంది కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 279 ఈ విషయాన్ని స్పష్టంచేస్తోంది. దీంతో పనులను ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తే తమ ఉద్యోగాలు ఉంటాయో.. పోతాయో అని కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు (అర్బన్): నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను పూర్తిగా ప్రైవేటీకరించనున్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు రోడ్డునపడతారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో 1,200 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా పారిశుధ్య పనుల కాంట్రాక్టును దక్కించుకున్న వ్యక్తి కార్మికులను ఆయా మునిసిపల్ అధికారులకు అప్పగిస్తారు. కార్మికుల చేత పనులు చేయించునే బాధ్యత అధికారులపైనే ఉంటుంది. వీళ్లకు కావాల్సిన పనిముట్లు, బ్లీచింగ్ పౌడర్, సున్నం, ఫినాయిల్, యునిఫామ్, చేతి తొడుగులు, బూట్లు లాంటివి అధికారులే అందచేస్తారు. రోజుకు 8 గంటల పాటు కార్మికులు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల కార్మికులకు నెల వేతనం రూ.8,300 నుంచి రూ.11 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న విధానం.
ప్రైవేటీకరణ పద్ధతి ఇలా..
పాత పద్ధతి కాకుండా పారిశుధ్య నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రైవేటీకరిస్తారు. ప్రతి మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో 200 నుంచి 300 కుటుంబాలకు ఇద్దరు పారిశుధ్య కార్మికుల్ని నియమిస్తారు. జన సాంద్రత ఎక్కువగా ప్రాంతాల్లో కాలువలను శుభ్రం చేయడానికి అవసరమయితే ముగ్గురు కార్మికుల్ని నియమిస్తారు. కార్మికులు, వాళ్లకు అవసరమైన పనిముట్ల సరఫరా కాంట్రాక్టర్ చూసుకుంటాడు. కార్మికులు పనిచేస్తున్నారా..? లేదా..? అని పరిశీలించడానికి మునిసిపల్ డీఈ, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్, శానిటరీ సూపర్‌వైజర్, మేనేజరు సభ్యులుగా ఉన్న బృందం పర్యవేక్షిస్తుంది. ఇలా ప్రతి నెలా ఈ బృందం కార్మికులు పనిచేస్తున్నారని సర్టిఫికెట్ ఇస్తేనే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తారు. కార్మికుల పనులు సంతృప్తికరంగా లేకుంటే వేతనాలు ఇవ్వరు. పైగా వాళ్లను విధుల నుంచి తొలగించి కొత్త వాళ్లను సరఫరా చేసే బాధ్యత కాంట్రాక్టర్‌దే.
పేరు మైక్రోప్యాకెట్
ఈ పనులు చేయడానికి ‘మైక్రోప్యాకెట్లు’ అనే పేరు పెట్టారు. ఒక్కో మైక్రో ప్యాకెట్‌లో పది మంది వరకు కాంట్రాక్టు కార్మికులు ఉంటారు. చెత్తను వీధుల్లోంచి తొలగించి డంపింగ్ యార్డుకు తరలించే వరకు అన్ని వీళ్లే చూసుకోవాలి. శాశ్వత కార్మికులు కేవలం ట్రాక్టర్లలో చెత్తను సేకరిస్తారు. ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంపై జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో సర్వే చేస్తున్నారు. ప్రతి వార్డు, డివిజన్‌లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, అపార్టుమెంట్లు, కుటుంబాలు, పోగయ్యే చెత్త వివరాలను సేకరిస్తున్నారు. మార్చి 7వ తేదీలోపు కార్మికుల ప్రైవేటీకరణ టెండర్లు పూర్తిచేసి ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఇదే జరిగితే ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఉన్న వాళ్లకు పనులు దొరక్కుండా ఇంటికి వెళ్లడం ఖాయం.
మేమే దొరికామా?
మా లాంటి వాళ్ల కడుపు కొట్టడానికి ఎలా మనసొస్తా ఉంది? ఉన్న ఉద్యోగాలు పర్మినెంట్ చేయమంటే తీసేస్తే ఎట్టా. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తా ఉండాం. సీఎం మా గోడు పట్టించుకుని జీవోను రద్దు సేయాలి. ప్రభుత్వం కన్ను మాపైనే పడిందా? తీసేయడానికి మేమే దొరికామా..!
- లోకనాధం, కాంట్రాక్టు కార్మికుడు, చిత్తూరు
అన్యాయం
ప్రభుత్వం జారీచేసిన జీవో అన్యాయం. ఇలాగయితే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఏ పని దొరక్కుండా ఈ పనికి వస్తే దీన్ని కూడా లాగేసుకుని వెళ్లగొడితే ఎక్కడకు పోవాలి? ఏం పనిచేసి బతకాలి?
- సుబ్బు, కాంట్రాక్టు కార్మికుడు, చిత్తూరు
ఉండేనా.. ఊడేనా?
Published Thu, Feb 11 2016 1:48 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement