indira park dharna chowk
-
25న ఇందిరాపార్క్ ధర్నాను విరమించుకోండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద తలపె ట్టిన ధర్నాను విరమించుకోవాలని, గత పదేళ్లలో మూసీ ప్రక్షాళనకు, మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధికి నయా పైసా కేటాయించని కేంద్రం ఎదుట ధర్నా చేయాలని మంత్రి సీతక్క హితవు పలికారు. యూపీఏ హయాంలో మూసీ ప్రక్షాళనకు రూ.335 కోట్లు మంజూరు చేస్తే, మోదీ పాలనలో పైసా మంజూరు కాకపోయినా కిషన్‌రెడ్డి ఎందుకు పెదవి విప్పలేదని మంగళవారం ఓ ప్రకటనలో నిలదీశారు. ఇతర నదుల ప్రక్షాళన కు నిధులిచ్చి మూసీ ప్రక్షాళనకు పైసా కేటాయించకపోవడం తెలంగాణపై కేంద్రం వివక్షతకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.సొంత నియోజకవర్గం మీదుగా మూసీ పారు తున్నా ఏనాడూ కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్‌రెడ్డి ఇప్పుడు ధర్నాకు పిలుపునివ్వడం ఏమిటో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్రమంత్రి ప్రాతిని ధ్యం వహిస్తున్నందున.. కేంద్రంతో చర్చించి హైదరాబాద్ జీవనరేఖగా భావించే మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సమర్థిస్తున్న బీజేపీ ఇక్కడ మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. -
పార్లమెంట్‌ను కాపాడలేని బీజేపీ దేశాన్ని రక్షిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌పై జరిగిన దాడితో ప్రపంచదేశాల్లో భారతదేశ విలువ ఎంతో దిగజారిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భారత పార్లమెంట్‌ను రక్షించలేని బీజేపీ పాలకులు ఈ దేశాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ‘ఇండియా’కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ధర్నాకు హాజరైన భట్టి విక్రమా ర్క మాట్లాడుతూ పార్లమెంట్‌పై దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. దేశ రక్షణను గాలికి వదిలేసిన ప్రధాని మోదీని ప్రశ్నించిన ఇండియాకూటమి ఎంపీలతోపాటు మొత్తంగా 146 మందిని సస్పెండ్ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంట్‌పై జరిగిన దాడిపై సభలో సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రశ్నించిన సభ్యులను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కా పాడాలనే ఆలోచన బీజేపీకి లేదని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాందీ, ప్రియాంకా గాంధీ సైతం రోడ్లపైకి వచ్చి ఈ దేశం కోసం తామున్నామని, ప్రజలకు బాసటగా నిలుస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. సమాధానం చెప్పకుండా సస్పెన్షనా? తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పార్లమెంట్ ఘటనపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం విపక్ష సభ్యులను బయటకు పంపించిందని విమర్శించారు. ముఖ్యమైన బిల్లులపై చర్చ జరుగుతుంటే, అందరినీ బయటకు పంపించి బలవంతంగా బిల్లులను ఆమోదింప చేసుకుంటున్నా రని దుయ్యబట్టారు. వెంటనే విపక్ష సభ్యులను సభలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పార్లమెంట్ మీద దాడి జరగడం అంటే అంబేడ్కర్ గుండెపైన దాడి జరిగినట్టేనని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్లో పొగ బాంబులు వేస్తే ఇంతవరకు సమాధానం చెప్పని ప్రధాని మోదీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని విమర్శించారు. మరో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పార్లమెంట్‌కు భద్ర త ఇవ్వలేని స్థితిలో ఉన్న ఎన్డీఏ దేశానికి భద్రత ఎలా కలి్పస్తుందని ఎద్దేవా చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కులమతాల పేరుతో బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, ఆమ్ ఆద్మీ పార్టీ కోఆర్డినేటర్ దిడ్డి సుధాకర్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, నాగరాజు, విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే అరెస్టులు.. దుర్మార్గమైన చర్య: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: దేశంలో నియంతృత్వ పోకడ పాలన నడుస్తోందని.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంట్ ప్రతిపక్ష పార్టీల ఎంపీల సస్పెన్షన్ పరిణామంతో కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి ‘ఇండియా’ దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇందులో భాగంగా.. శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద కార్యక్రమం నిర్వహించింది. ‘‘దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య. నియంతృత్వ పోకడలతో మోదీ పాలన నడుస్తోంది. దేశంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అంతా రోడ్డెక్కారు’’ అని అన్నారాయన. ఈ నిరసనలో షబ్బీర్ అలీతో పాటు పలువురు సీనియర్లు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘సమాధానం చెప్పే ధైర్యం లేక ఎంపీ లను సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్య స్పూర్తి కి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేస్తే.. కాంగ్రెస్ కోర్టుకు పోయి కొట్లాడింది. నియంతృత్వ పోకడలతో వెల్లినందుకే బీఆర్ఎస్ కు బుద్ది చెప్పారు. బీజేపీ కి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్ కే రక్షణ లేదు దేశానికి రక్షణ ఉంటుందా?. పార్లమెంట్ పై దాడి గురించి ప్రశ్నిస్తే..సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి?. ఎంపీ లకు ప్రశ్నించే హక్కు లేదా?. దేశ ప్రజలంతా ఇండియా కూటమి కి మద్దతు గా నిలవాలి’’. మరోవైపు.. మోదీ ప్రభుత్వ విధానాలపై ఇండియా కూటమి నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్ భద్రతా విఘాతంపై హోంశాఖ మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాల పట్టుబట్టాయి. దీంతో 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో కీలకమైన మూడు నేర చట్టాలకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించింది. అయితే.. ప్రతిపక్షం లేకుండా బిల్లుల ఆమోదాన్ని విపక్ష కూటమి తీవ్రంగా ఖండిస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ.. సస్పెండ్ అయిన ఇతర ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంట్ భద్రతను గాలికొదిలేశారని రాహుల్ ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగ కల్పన లేదు కాబట్టే సెల్ఫోన్లలో యువత గంటలు గంటలు గడుపుతోందని అభిప్రాయపడ్డారాయన. ఉద్యోగాలు లేక నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందని అన్నారాయన. ఇదీ చదవండి: సగానికిపైగా అప్పులు తీర్చాం -
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌లకు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరెడ్డి, మల్లురవి సహా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలను సోమవారం ఉదయం నుంచే హౌస్ అరెస్ట్‌లు చేపట్టారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాకు అనుమతులు లేవని, ఎవరైనా బయటకువచ్చి నిరసనలు చేస్తే అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పంచాయతీలకు నిధుల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని, సర్పంచులందరినీ ఏకం చేయాలని నేతలకు సూచించింది. అయితే, ఈ ధర్నాలకు పోలీసులు అనుమతులు లేవని తెలపడం, గృహనిర్బంధం చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని టీకాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధర్నాను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: మైనార్టీలపై కాంగ్రెస్ ‘నజర్’ -
‘సీఏఏ భారత పౌరులకు సంబంధించింది కాదు’
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు తట్టుకోలేక పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందడంతో.. పలు రాజకీయ పార్టీలకు వేరే అంశాలు లేకపోవడంతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు సీఏఏకు మతం రంగు పులిమి.. ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది భారత పౌరులకు సంబంధించిన చట్టం కాదని అన్నారు. నాడు జిన్నా మెప్పు కోసం కాంగ్రెస్ తలోగ్గిందని లక్ష్మణ్ విమర్శించారు. ఆ రోజు కాంగ్రెస్ అలా చేయకపోతే.. నేడు ఈ చట్టం చేసే అవసరమే వచ్చేది కాదని చెప్పారు. గతంలో పాకిస్తాన్లో 23 శాతం ఉన్న హిందువులు.. నేడు 1 శాతానికి పరిమితమయ్యారని గుర్తుచేశారు. మోదీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏపై విష బీజాలు నాటే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ భక్తులు ఈ బిల్లు సమర్థించండి : రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘నేడు దేశ భక్తులకు, దేశ ద్రోహులకు మధ్య సంఘర్షణ జరుగుతోంది. మేము ప్రధాని మోదీ ఏది చెబితే అది చేస్తాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. దేశ ద్రోహులను దేశం నుంచి వెళ్లగొడతాం. రెండోసారి ప్రధాని అయ్యాక మోదీ ఆర్టికల్ 370ని రద్దుచేసి కశ్మీర్, దేశాన్ని కాపాడారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయి. భారతదేశంలోని ముస్లింలు ఇక్కడే ఉంటారు. ఇతర దేశాల్లో నివసించే భారతీయులను మన దేశానికి తీసుకురావాలని మోదీ సంకల్పించారు. దేశ భక్తులు సీఏఏను సమర్థించాలి’ అని పిలుపునిచ్చారు. -
‘ఈ పోరాటం ఇక్కడితో ఆగదు’
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ ఇందిరాపార్క్‌లో చేపట్టిన దీక్ష నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి పరిపూర్ణానంద స్వామి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం కోసం ఆమె రెండురోజుల మహిళా సంకల్ప దీక్ష చేపట్టారు. శుక్రవారం దీక్ష ముగింపు సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పోరాటం ఇక్కడితో ఆగదన్నారు. ఈ పోరాటాన్ని ప్రతీ జిల్లాకు తీసుకెళ్తామని, బెల్ట్‌షాపులను మూసివేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో గుడి, బడి తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని ఆరోపించారు. తాగిన మైకంలోనే నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దిశ సంఘటన ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగించలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో 30 వేల మంది తాగి రోడ్లపై పడిపోతున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో మద్యం నిషేధం వైపు అడుగులు పడుతున్నాయని ప్రస్తావించారు. చిత్తశుద్ధి ఉంటే మద్య నిషేధం కష్టసాధ్యమైన పనేంకాదని ఆమె అన్నారు. -
అయ్యప్ప భక్తుల మహా ఉపవాస దీక్ష
-
ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా
హైదరాబాద్: రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీలు మహా ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలపై కేసీఆర్ కక్ష కట్టారు: జాజుల ఎన్నికల్లో ఆశీర్వదించిన బీసీలపైనే కేసీఆర్ కక్ష కట్టారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ చేశారని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల సమస్యపై 24 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లను రక్షించుకునేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారమా?: ఎల్ రమణ బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకునిపోయి బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవాలని సూచించారు.బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ప్రశ్నించిన కేసీఆర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. రిజర్వేషన్ల పోరాటంలో టీటీడీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా ఊరుకునేది లేదు:వీహెచ్ ప్రాణం పోయినా ఊరుకునేది లేదు..బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్లోని బీసీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లపై మాట్లాడాలని కోరారు. సకల జనుల సర్వేలో బీసీల లెక్కలు ఇప్పటికీ బయట పెట్టలేదని చెప్పారు. బీసీల ఓట్ల కోసం స్కీమ్‌లు పెట్టారు...ఎన్నికల్లో గెలిచాక బీసీల రిజర్వేషన్లు తగ్గించారు. బీసీల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు..బీసీలు అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమగ్ర కుటుంబసర్వేలో 54 శాతం బీసీలు ఉన్నారని ప్రకటించిన వాస్తవమా కాదా చెప్పాలన్నారు. బీసీలు చట్టసభల్లోకి వెళ్లకుండా గొర్లు,బర్లు కాసుకునే బతకాలా అని సూటిగా అడిగారు. కేసీఆర్ పిట్టల దొర : షబ్బీర్ కేసీఆర్ ఒక పిట్టల దొర అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. 34 శాతం కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీఎం నిర్ణయం హాస్యాస్పదం: పొన్నాల సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి చట్టబద్దం చేయలేదని వెల్లడించారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చెయ్యాలని సూచించారు. -
అరణ్యరోదన
2000 మార్చి 30వ తేదీ.. హైదరాబాద్ ఇందిరాపార్కు చౌరస్తా... జీతాలు పెంచాలన్న డిమాండ్‌తో తరలివచ్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ధర్నా చేస్తుంటే.. మహిళలు అనే విషయాన్ని కూడా మరిచి జవాన్లు గుర్రాలతో తొక్కించారు. లాఠీచార్జీ చేశారు. నీటి మోటార్లతో చెదరగొట్టారు. అంగన్వాడీలపై నాటి సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరిదీ. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అంగన్వాడీల పట్ల సానుభూతితో వ్యవహరించారు. ఐదేళ్ల పాలనలో రెండుసార్లు వేతనాలు పెంచారు. కేంద్రం ఇచ్చే వేతనాలతో సంబంధం లేకుండా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రత్యేక వేతనం, సౌకర్యాలు అందిస్తానని 2009లో హామీ ఇచ్చారు. కానీ ఆయున అకాల వురణంతో అంగన్వాడీల సంక్షేమానికి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పోరుబాట పట్టారు. అంగన్వాడీ టీచర్లకు ప్రస్తుత వేతనం రూ. 4,200.. ఆయాలకు రూ. 2,200. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటా టీచర్లకు రూ. 3,000, ఆయాలకు రూ. 1,500. కానీ, కనీస వేతనం రూ. 10 వేలు చేయాలని వారి డిమాండ్. అంగన్వాడీ టీచర్లకు కేంద్రం ఇచ్చే రూ. 3 వేలతో పాటు హర్యానా రూ. 4 వేలు, తమిళనాడు రూ. 6 వేలు అదనంగా తమ రాష్ట్ర అంగన్వాడీలకు ఇస్తున్నాయి. మహారాష్ట్ర రిటైరయ్యే అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష, ఆయాలకు రూ.75 వేలు గ్రాట్యుటీ కింద చెల్లిస్తోంది. కర్ణాటకలో రూ. 50వేలు, రూ. 30వేలుగా ఉంది. అంగన్వాడీ టీచర్లను బూత్ లెవల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. పనివేళలు పెంచింది. మరోవైపు... అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నెల 22న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలమ్ సాహ్నీ జారీ చేసిన మెమో నంబర్ 2346 ప్రకారం సమ్మె కాలాన్ని గైర్హాజరుగా పరిగణించి సర్వీస్ బ్రేక్ కింద లెక్కవేయాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా సీనియారిటీని సూపరింటెండెంట్ వంటి పోస్టులకు పరిగణ నలోకి తీసుకోరు. -
జేబు నింపుకొంటున్న సీఎం: బీవీ రాఘవులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు ఉపయోగపడే ఫైళ్లపై సంతకాలు చేయడం మానేసి తన జేబు లు నింపుకొనేందుకు సొంత సంతకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శిం చారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాఘవులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. గత 15 రోజులుగా సీఎం సొంత సంతకాలపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. సీఎం పదవిలో ఉంటారో లేదో తెలియని మీరు అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తే వారికి గుర్తుండిపోతారని కిరణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళల సమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంగన్వాడీల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. అంగన్వాడీల్లో ఐకేపీ జోక్యాన్ని నివారించాలని, పెండింగ్ బిల్లులు, పెంచిన అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక దీక్షలో సాయిబాబా (సీఐటీయూ), చంద్రశేఖర్ (ఐఎన్టీయూసీ), రాంబాబు (టీఎన్టీయూసీ), నరసింహ (ఏఐటీయూసీ), పోటు ప్రసాద్ (ఐఎఫ్టీయూ), ఆలిండియా బీమా ఉద్యోగుల సంఘం కర్ణాటక, ఏపీ జోనల్ కార్యదర్శి క్లెమెంట్ దాస్, మహిళా విభాగం కన్వీనర్ అరుణకుమారి, ఆశా వర్కర్స్ నేత హేమలత, లోక్‌సత్తా నేత భవానీ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోటిలింగం తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం పదివేలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ ఉపాధ్యాయులకు కనీస వేతనం పది వేల రూపాయలు చేయాలంటూ సీఐటీయూ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. సుధాభాస్కర్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా మాట్లాడుతూ, పని గంటలు పెంచిన ప్రభుత్వం వేతనాలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. పెన్షన్‌తో సహా పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీఎల్ఓ డ్యూటీ నుంచి మినహాయించాలని కోరారు. వారంరోజుల్లోగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీక్షకు ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, బొడ్డు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రైతు సంఘం కార్యదర్శి చంద్రారెడ్డి, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్వాడీలను క్రమబద్ధీకరించాలి: సీపీఎం అంగన్వాడీ కార్యకర్తల దీక్షకు మద్దతు తెలిపిన సీపీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న లక్షా 80 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీల కనీస వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచాలని కోరారు. -
ఆదర్శ రైతులను ఆదుకోవాలి: వైఎస్సార్ సీపీ
ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పార్టీల నేతల డిమాండ్ హైదరాబాద్, న్యూస్‌లైన్: వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎంతో కృషి చేస్తున్న ఆదర్శ రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వివిధ పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేశారు. తమకు కనీస వేతన చట్టం ప్రకారం రూ. 6,900 జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బీమా తదితర డిమాం డ్లతో ఆదర్శ రైతులు ఇక్కడి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగవాళం ధర్నా చేశారు. దీనికి పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు, ప్రభుత్వ అధికారులకు అనుసంధానం చేయడానికి వైఎస్ ఆదర్శ రైతుల వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేత కె. కేశవరావు మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అనుసరిస్తున్న విధానాలు బాగా ఉన్నాయని, ఆయన్ని రైతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచిం చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆదర్శ రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాలో ఎంపీ వివేక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయరామారావు, చిరుమర్తి లింగయ్య, సీపీఐ నేత రామకృష్ణ తదితరులు ప్రసంగించగా.. రైతు సంఘాల నేతలు పశ్య పద్మ, యాదవ్, కుమార స్వామి, ఎన్.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.