అరణ్యరోదన
2000 మార్చి 30వ తేదీ.. హైదరాబాద్ ఇందిరాపార్కు చౌరస్తా... జీతాలు పెంచాలన్న డిమాండ్‌తో తరలివచ్చిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ధర్నా చేస్తుంటే.. మహిళలు అనే విషయాన్ని కూడా మరిచి జవాన్లు గుర్రాలతో తొక్కించారు. లాఠీచార్జీ చేశారు. నీటి మోటార్లతో చెదరగొట్టారు.
అంగన్‌వాడీలపై నాటి సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరిదీ. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అంగన్‌వాడీల పట్ల సానుభూతితో వ్యవహరించారు. ఐదేళ్ల పాలనలో రెండుసార్లు వేతనాలు పెంచారు. కేంద్రం ఇచ్చే వేతనాలతో సంబంధం లేకుండా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ప్రత్యేక వేతనం, సౌకర్యాలు అందిస్తానని 2009లో హామీ ఇచ్చారు. కానీ ఆయున అకాల వురణంతో అంగన్‌వాడీల సంక్షేమానికి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పోరుబాట పట్టారు.
అంగన్‌వాడీ టీచర్లకు ప్రస్తుత వేతనం రూ. 4,200.. ఆయాలకు రూ. 2,200. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటా టీచర్లకు రూ. 3,000, ఆయాలకు రూ. 1,500. కానీ, కనీస వేతనం రూ. 10 వేలు చేయాలని వారి డిమాండ్.
అంగన్‌వాడీ టీచర్లకు కేంద్రం ఇచ్చే రూ. 3 వేలతో పాటు హర్యానా రూ. 4 వేలు, తమిళనాడు రూ. 6 వేలు అదనంగా తమ రాష్ట్ర అంగన్‌వాడీలకు ఇస్తున్నాయి. మహారాష్ట్ర రిటైరయ్యే అంగన్‌వాడీ టీచర్లకు రూ. లక్ష, ఆయాలకు రూ.75 వేలు గ్రాట్యుటీ కింద చెల్లిస్తోంది. కర్ణాటకలో రూ. 50వేలు, రూ. 30వేలుగా ఉంది. అంగన్‌వాడీ టీచర్లను బూత్ లెవల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. పనివేళలు పెంచింది. మరోవైపు... అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నెల 22న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలమ్ సాహ్నీ జారీ చేసిన మెమో నంబర్ 2346 ప్రకారం సమ్మె కాలాన్ని గైర్హాజరుగా పరిగణించి సర్వీస్ బ్రేక్ కింద లెక్కవేయాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా సీనియారిటీని సూపరింటెండెంట్ వంటి పోస్టులకు పరిగణ నలోకి తీసుకోరు.