కనీస వేతనం పదివేలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు కనీస వేతనం పది వేల రూపాయలు చేయాలంటూ సీఐటీయూ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. సుధాభాస్కర్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా మాట్లాడుతూ, పని గంటలు పెంచిన ప్రభుత్వం వేతనాలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.
పెన్షన్‌తో సహా పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీఎల్‌ఓ డ్యూటీ నుంచి మినహాయించాలని కోరారు. వారంరోజుల్లోగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీక్షకు ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, బొడ్డు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రైతు సంఘం కార్యదర్శి చంద్రారెడ్డి, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీలను క్రమబద్ధీకరించాలి: సీపీఎం
అంగన్‌వాడీ కార్యకర్తల దీక్షకు మద్దతు తెలిపిన సీపీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న లక్షా 80 వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీల కనీస వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచాలని కోరారు.