Indefinate Strike
-
చెంపదెబ్బకు నిరసనగా వైద్య సేవలు బంద్
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ (ఆర్డీఏ) గురువారం నిరవధిక నిరసనలకు పిలుపునిచ్చింది. తమ సహ విద్యార్థి (రెసిడెంట్ డాక్టర్)పై సీనియర్ డాక్టర్ చేయిచేసుకున్నారని ఆర్డీఏ ఆరోపించింది. ఆయన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని, దాడికి గురైన విద్యార్థికి లిఖితపూర్వక క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేసింది. ఆయన పరీక్షల నిర్వహణలో, పరిశోధనా పత్రాల మూల్యంకనంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఎయిమ్స్ పరిపాలనా విభాగాన్ని ఆర్డీఏ కోరింది. ఆర్డీఏ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాకు రాసిన లేఖలో.. సదరు సీనియర్ వైద్యుడు రెసిడెంట్ డాక్టర్‌ను అవమానించారు. తన సహోద్యోగులు, ఇతర నర్సింగ్ సిబ్బంది ఎదుటే చెంపదెబ్బ కొట్టాడని పేర్కొంది. ఆయన ప్రవర్తనతో ఎంతోకాలంగా తాము ఇబ్బందులకు గురౌతున్నామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తాడేమోనన్న భయంతో ఇన్నిరోజులు ఆయనపై ఫిర్యాదు చేయలేదని తెలిపింది. అత్యవసర సేవలు కొనసాగుతాయి.. ఆర్డీఏ నిరవధిక సమ్మెతో రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని ఎయిమ్స్ పరిపాలనా వర్గాలు తెలిపాయి. డాక్టర్లు సరిపడా అందుబాటులో ఉండని కారణంగా సాధారణ శస్త్రచికిత్సల్ని నిలిపి వేశామని వెల్లడించింది. అత్యవసర, ఐసీయూ సేవలు, పరిమిత సంఖ్యలో ఔట్‌పేషెంట్ క్లినిక్‌లు అందుబాటులోఉంటాయని పేర్కొంది. విద్యా సంబంధిత కార్యకలాపాలను, పరీక్షలను తాత్కాలికంగా నిలుపుదల చేశామని తెలిపింది. అన్ని స్పెషలిస్టు డాక్టర్ల సేవలు కొనసాగేలా చర్యలు తీసుకున్నామని ఎయిమ్స్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. డాక్టర్ల అందుబాటుని బట్టి ఇన్‌పేషెంట్ సేవలు కొనసాగుతాయని పేర్కొంది. విద్యార్థిపై దాడి ఘటన బుధవారం చోటుచేసుకుందని, దాడికి పాల్పడిన సీనియర్ డాక్టర్ సదరు విద్యార్థికి క్షమాపణలు చెప్పారని తన ప్రకటలో వెల్లడించింది. -
'కుక్కల్లా ఉంటామని.. నక్కల్లా మారారు'
కిర్లంపూడి: ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించేంతవరకు ఆమరణ దీక్ష విరమించేదిలేదంటున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు ఇప్పటికీ వైద్యపరీక్షలకు నిరాకరిస్తున్నారు. పోలీసులు, వైద్యుల తీరును గర్హిస్తూ శనివారం అర్ధరాత్రి తరువాత ఇంటి తలుపులు మూసేసిన ముద్రగడ.. ఆదివారం లోపలే ఉండి తన దీక్షను కనసాగిస్తున్నారు. ముద్రగడ దంపతులకు మద్దతుగా కిర్లంపూడికి చేరుకుంటున్న మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంటి బయటే బైఠాయించిన మహిళలు.. కాపు రిజర్వేషన్ల అంశంలో సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న తీరును నిరసించారు. ముఖ్యమంత్రి, టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'మా నాయకుడు, ఆయన భార్య మూడు రోజులుగా పచ్చిమంచినీళ్లు ముట్టుకోలేదు. వాళ్లకు మద్దతుగా మేం కూడా ఇల్లు, వాకిలి వదిలేసి ఇక్కడికొచ్చాం. ఇంకా ఎన్నిరోజులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలాడతాడు? మేమేం అడిగాం? ఆయన ఇచ్చిన హామీనే నెరవేర్చమంటున్నాం. ఎన్నికలప్పుడు ఎన్నెన్ని మాటలు చెప్పారు. కుక్కల్లా ప్రజలపట్ల విశ్వాసంగా ఉంటామన్నారు. ఇప్పుడేమో గుంటనక్కల్లా మారి జనాన్ని మోసం చేస్తున్నారు' అంటూ అధికార పక్షంపై ఆగ్రహాన్ని ప్రదర్శించిందోమహిళ. పోలీసులు, వైద్యుల వ్యవహారశైలి వల్లే తమ నాయకుడు ఇంటి తలుపులు మూసేయాల్సి వచ్చిందని, దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారిని పోలీసులు అడ్డుకోవడం సమంజసంకాదని ముద్రగడ అనుచరుడొకరు మీడియాతో అన్నారు. -
‘శాంతింపజేస్తే బిల్లుకు సహకరిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయకపోతే సోమవారం నుంచి పార్లమెంటు ప్రాంగణంలో నిరాహార దీక్ష చేస్తామని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎంపీలు తెలిపారు. తమ పార్టీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, సి.ఎం.రమేశ్‌లు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని.. సీమాంధ్రులను శాంతపరిచి బిల్లు పెడితే సహకరిస్తామని మోదుగుల పేర్కొన్నారు. యథావిధిగా ‘తమ్ముళ్ల’ తలోమాట సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో గురువారం చోటుచేసుకున్న సంఘటనలపైనా టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలు యథావిధిగా ఎవరి డిమాండ్లు వారు వినిపించారు. టీడీఎల్పీలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ సమైక్య భారత్‌ను కోరుకునే బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించటం బాధకరమన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామన్న బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ ప్రకటనను తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పార్టీని పెట్టించటం ద్వారా సీమాంధ్రలో వచ్చే ఎన్నికల్లో లబ్ధికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపీలను బహిష్కరించిందన్నారు. బల్లి దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ టీ డీపీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ రమేష్ రాథోడ్‌లపై అధినేతకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్టీఆర్ భవన్లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు లోక్‌సభలో దాడిచేసుకోవటం బాధాకరమన్నారు. టీడీఎల్పీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రతిష్టతను మంట కలిపిన ఎంపీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కనీస వేతనం పదివేలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ ఉపాధ్యాయులకు కనీస వేతనం పది వేల రూపాయలు చేయాలంటూ సీఐటీయూ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. సుధాభాస్కర్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా మాట్లాడుతూ, పని గంటలు పెంచిన ప్రభుత్వం వేతనాలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. పెన్షన్‌తో సహా పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీఎల్ఓ డ్యూటీ నుంచి మినహాయించాలని కోరారు. వారంరోజుల్లోగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీక్షకు ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, బొడ్డు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రైతు సంఘం కార్యదర్శి చంద్రారెడ్డి, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్వాడీలను క్రమబద్ధీకరించాలి: సీపీఎం అంగన్వాడీ కార్యకర్తల దీక్షకు మద్దతు తెలిపిన సీపీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న లక్షా 80 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీల కనీస వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచాలని కోరారు. -
చంద్రబాబుకు.. రోజురోజుకూ పెరిగిన చక్కెర స్థాయి!
విస్తుగొలిపిన బాబు ఆరోగ్యం సాక్షి, న్యూఢిల్లీ: నాలుగురోజులు నిరవధిక దీక్ష చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య వివరాలను అటు వైద్యులు కానీ, ఇటు పార్టీవారు కానీ పూర్తిగా బయటకు చెప్పకపోవడడం అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని, ఆసుపత్రికి తరలించాలంటూ జేడీ (హాస్పిటల్స్), డీసీపీ (న్యూఢిల్లీ), రెసిడెంట్ కమిషనర్ (ఏపీభవన్), డీజీహెచ్ఎస్ (న్యూఢిల్లీ)కు గురువారం రాం మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆస్పత్రి డెరైక్టర్ నుంచి లేఖలు వెళ్లాయి. బాబు ఆరోగ్యం క్షీణించిందనే విషయం తప్ప, ఇతరత్రా వివరాలేవీ లేఖలో లేవు. అయితే శుక్రవారం బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆర్ఎంఎల్ నుంచి కేంద్రానికి వెళ్లిన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘నిరవధిక దీక్షలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు శుక్రవారం ఉదయం 10.19 గంటలకు ఆర్ఎంఎల్ ఆసుపత్రి వైద్యులు దీక్ష శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన ప్రాథమిక ఆరోగ్య నివేదిక (ఓపీడీ రిజిస్ట్రేషన్ నంబరు 20130711950) ప్రకారం.. చంద్రబాబు ఏడవ తేదీ నుంచి దీక్షలో ఉన్నారు. ఆయనకు వికారం, వాంతులు, తలనొప్పి, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు బైర్లు కమ్మడం, చెమట పట్టడం, ఆందోళనగా ఉండడం వంటి సమస్యలేవీ లేవు. పల్స్ రేటు నిమిషానికి 82గా ఉంది. ఇది సాధారణం, మంచి పరిమాణం (గుడ్ వాల్యూమ్). రెస్పిరేటరీ రేటు సాధారణంగా ఉంది. రక్తపోటు 140/80. గ్లూకో మీటర్‌తో పరీక్షించగా బ్లడ్‌షుగర్ 83 ఎంజీగా ఉంది..’ ఇదీ ఆ నివేదిక సారాంశం. వాస్తవానికి చంద్రబాబు దీక్ష ప్రారంభించిన తర్వాత మూడోరోజైన బుధవారం నాడు సుగర్ లెవల్స్ 75 ఎంజీగా ఉన్నట్లు టీడీపీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. గురువారం సాయంత్రానికి చక్కెర స్థాయి 79 ఎంజీగా నమోదైందని చెప్పారు. తాజాగా శుక్రవారం ఆర్ఎంఎల్ వైద్యులు పరీక్షలు జరపగా చక్కెర స్థాయి 83 ఎంజీగా నమోదు అయ్యింది. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు మొత్తం నాలుగురోజులు దీక్ష చేశారు. సుగర్ లెవల్స్ నానాటికీ తగ్గుతూ శుక్రవారానికి బాగా పడిపోవాల్సి ఉండగా రోజురోజుకూ పెరగడం వెనుక రహస్యం ఏమిటని ఢిల్లీలోని దేశం నాయకుడొకరు విస్మయం వ్యక్తం చేశారు. -
మధుమేహం ఉంటే నిరాహార దీక్ష సాధ్యమా?
diabetes, fasting, chandra babu naidu, మధుమేహం, నిరాహారదీక్ష, చంద్రబాబు నాయుడు 48 గంటల వరకూ తగిన శక్తి ఉంటుంది 50 గంటలు దాటితే శరీరం సహకరించదంటున్న వైద్యులు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం 60 లేదా 70 గంటలు దాటి సాధ్యం కాదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: మధుమేహ బాధితుడికి సాధారణంగా ఒక్క గంట భోజనం ఆలస్యమైతేనే కళ్లు తిరుగుతాయి. నోరు పిడచకట్టుకు పోతుంది. తల తిరుగుతుంది...ఏం చేయాలో దిక్కుతోచదు. అలాంటిది రెండురోజులు దాటి నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుంది? మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ద్రవాహారమూ, ఘనాహారమూ తీసుకోకుండా 48 గంటల వరకూ దీక్ష చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గే కొద్దీ తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. సాధారణ వ్యక్తికైనా, మధుమేహం ఉన్న వ్యక్తికైనా నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు 48 గంటల తర్వాత కొవ్వులు కరిగిపోవడం ప్రారంభమవుతుంది. ముందుగా రక్తంలో ఉన్న గ్లూకోజు నిల్వలు కరిగిపోతాయి, ఆ తర్వాత కాలేయం చుట్టూ ఉన్న కొవ్వులు, అనంతరం కండరాల నుంచి కరిగి చివరగా సాధారణ కొవ్వులు (పొట్ట చుట్టూ లేదా ఇతర అవయవాల చుట్టూ ఉన్న కొవ్వులు) కరిగిపోతాయి. ఈ కొవ్వులు కరిగి శక్తిగా మారుతున్నప్పుడు కీటోన్స్ (గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వులు శక్తిరూపంలో వినియోగమవుతున్నప్పుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) వస్తాయి. ఇవి సాధారణంగా శరీరంలో జీరోగా ఉండాలి. 5కు మించితే వెంటనే మూత్రపిండాలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యక్తి తాను తీసుకుంటున్న మాత్రలు కానీ, ఇన్సులిన్ ఇంజెక్షన్లుగానీ ఆపేస్తే సుగర్ లెవెల్స్ 50 నుంచి 55 గంటల కంటే మించి నియంత్రణలో ఉండవు. మంచినీళ్లు తాగుతూ దీక్ష చేసినా, రక్తంలో సోడియం నిల్వలు తగ్గిపోయి నీరసంతో పాటు మైకం కమ్ముకుంటుంది. మాట్లాడ్డానికి నోరు సహకరించదు. అంతేకాదు పొటాషియం నిల్వలు తగ్గిపోయి కాళ్లు, చేతులు నడవడానికి సహకరించవు. మెదడుకు గ్లూకోజ్ నిల్వలు అందకపోతే కోమాలోకి వెళ్లే అవకాశముంటుంది. ఇక 60 లేదా 70 గంటలు దాటి ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష సాధ్యం కాదని కేర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గ్లూకోజ్‌కు కాలేయం స్టోర్ హౌస్ లాంటిదని, అలాంటి హౌస్ నుంచి మధుమేహ వ్యాధిగ్రస్తుడికి గ్లూకోజ్ అందకపోతే ఆహారం తీసుకోకుండా ఉండలేరని ఆయన అభిప్రాయపడ్డారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు 50 గంటల వరకూ దీక్ష చేయడం కూడా సాధ్యం కాదని నిమ్స్‌కు చెందిన మరో న్యూరో సర్జన్ డాక్టర్ ఎ.ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. 48 గంటల లోపే ఈ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడే అవకాశముంటుందని తెలిపారు. -
నేటితో ఐదో రోజుకు జగన్ దీక్ష
-
నేటితో ఐదో రోజుకు జగన్ దీక్ష
* జగన్ దీక్షకు అపూర్వ ఆదరణ... అభిమానుల వెల్లువ * దీక్ష విరమించాలన్న వైద్యులు, పోలీసులు... జగన్ ససేమిరా * లక్ష్యం నెరవేరేదాకా దీక్ష విరమించేది లేదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: అదే ఉత్సాహం.. అదే కోలాహలం.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఆమరణ‘సమైక్య దీక్ష’కు మంగళవారం నాలుగో రోజు కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షకు సంఘీభావం తెలిపారు. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండటంతో మంగళవారం జగన్ బాగా నీరసంగా కనిపించారు. అయినప్పటికీ తనను కలిసేందుకు వచ్చిన వారిని అదే చిరునవ్వుతో పలుకరిస్తూ అభివాదం చేశారు. వృద్ధులు, మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, పిల్లలతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన వారందరితో నిలబడి ఎంతో ఓపిగ్గా మాట్లాడారు. శరీరంలో నీటి శాతం తగ్గడమే గాక తీవ్రమైన వెన్నుపోటుతో బాధపడుతున్నప్పటికీ తనను కలిసేందుకు వచ్చిన వారందరితోనూ కరచాలనం చేశారు. వారికి నమస్కరించారు. కలిసేందుకు వచ్చిన పలువురు వికలాంగులు, చిన్న పిల్లలకు అభివాదం చేసేందుకు వేదిక నుంచి వంగి ప్రత్యేకంగా పలకరించారు. కొందరు రైతులు అభిమానంతో జగన్‌కు నాగలి బహూకరించారు. జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన రైతులు జగన్‌తో కరచాలనం చేయడానికి ఉత్సాహ పడ్డారు. ముస్లింలు కూడా మంగళవారం భారీగా వచ్చి ఆయనను కలుసుకున్నారు. జగన్ భుజాలపై రుమాళ్లు కప్పుతూ ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం జగన్ ముందుకొచ్చి దీక్ష చేయడం అభినందనీయమన్నారు. దీక్షకు సంఘీభావంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రం తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ప్రతిఘటిస్తున్న నేతగా జగన్‌ను అందరూ తమ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. పారిశ్రామికవేత్తల సంఘీభావం చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పారిశ్రామికవేత్తలు వచ్చి జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. జగన్‌కు వినతిపత్రమిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పారిశ్రామికరంగానికి అండగా నిలిచి అనేక ప్రోత్సాహాకాలిచ్చారని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుత విద్యుత్ సమస్యల కారణంగా తమ పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ పుచ్చలపల్లి మిత్ర, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీ నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బి.గుర్నాథరెడ్డి, కాటసాని రామిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైఎస్సార్సీపీ నేతలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మద్దాల రాజేశ్, పేర్ని నాని, భూమా నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, జంగా కృష్ణమూర్తి, ఎస్వీ మోహన్‌రెడ్డి, అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, రంగనాథరాజు, ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, పెండ్యాల వెంకట కృష్ణబాబు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లా ఆర్య ైవైశ్య సంఘం అధ్యక్షుడు ఎం.ద్వారకనాథ్, డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ ిసీహెచ్ బాలచెన్నయ్య, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పి.గౌతంరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి తదితరులు మంగళవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌కు సంఘీభావం తెలిపారు. వంగపండు ఉష బృందం నేతృత్వంలోని పాటలు అలరించాయి. -
దీక్షలోనూ ‘ఫిక్సింగే’
నిరాహార దీక్ష పేరిట హస్తినలో టీడీపీ అధ్యక్షుని హైడ్రామా ‘కాంగ్రెస్‌తో కుమ్మక్కు’కు అడుగడుగునా అద్దం పట్టిన ప్రహసనం సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ అధికార కేంద్రమైన ఏపీ భవన్... పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల రసవత్తర మ్యాచ్‌ఫిక్సింగ్‌కు ప్రత్యక్ష వేదికగా మారింది. అధికారపక్షం అండదండలు సంపూర్ణంగా లభించడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన ‘విభజన’ దీక్షను ఏపీభవన్ ప్రాంగణంలోనే దర్జాగా చేపట్టారు! ఆ క్రమంలో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారు. ఏపీ భవన్‌ను కాస్తా బహిరంగ ప్రదేశంగా మార్చేశారు. అసలు దీక్షకు అనుమతి కూడా తీసుకోకపోయినా, కాంగ్రెస్ అధిష్టానం నుంచి హైదరాబాద్‌లోని పాలకులకు, అక్కడినుంచి ఏపీభవన్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలుండటంతో ఎవరూ దీక్షను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ‘చేయొద్దు, చేయొద్ద’ని పైకి తూతూ మంత్రంగా గొణుగుతూనే... దీక్షా స్థలి ముస్తాబుతో పాటు సకల ఏర్పాట్లకూ భవన్ ఉన్నతాధికారులే సంపూర్ణ సహకారం అందించి తరించారు! అలా ముందుకెళ్లారు: ‘సంప్రదింపులు జరిపి, రాష్ట్రాన్ని సజావుగా విభజించండి’ అనే డిమాండ్‌తో బాబు మొదలు పెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు జంతర్‌మంతర్, లేదా ఏపీభవన్ వద్ద అనుమతి కోరుతూ టీడీపీ ఎంపీలు ముందుగా ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేశారు. జంతర్‌మంతర్ వద్ద సోమవారం నుంచి 2 రోజుల దీక్షకు వారు షరతులతో అనుమతిచ్చారు. దాంతో అక్కడ దీక్షా వేదిక కోసం టీడీపీ నేతలు కొన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆదివారం రాత్రి బాబు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాటిని అర్ధంతరంగా ఆపేశారు. హైదరాబాద్‌లో ముందే తయారైన స్క్రిప్టు ప్రకారం బాబు సోమవారం మధ్యాహ్నం ఏపీభవన్ ఆవరణలో గోదావరి బ్లాకు పక్కనే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన వేదిక వద్దకు చేరుకుని, తన ఆదేశానుసారం పరిచిన తివాచీలపై 3 గంటలకు దీక్షకు ఉపక్రమించారు. బాబు మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుండగానే సకల ‘దీక్షా’ ఏర్పాట్లూ యుద్ధ ప్రాతిపదికన సాగిపోయాయి! దీక్ష సరంజామా అంతా ఓ లారీలో రావడం, ‘అనుమతి లేకుండా ఏర్పాట్లు వద్దు’ అంటూ భవన్ అధికారులు సుతిమెత్తగా అభ్యంతరపెట్టడం, ‘మాకు అనుమతి ఉంది, అడ్డు చెప్పడానికి మీరెవరు?’ అంటూ టీడీపీ ఎంపీలు దగ్గరుండి సామాను దింపించడం, వాటితో దీక్షా స్థలి ముస్తాబవడం చకచకా పూర్తయ్యాయి! ఏపీ భవన్ ఆవరణలో ఇలాంటి ఆందోళనలను అనుమతించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. తెలంగాణవాదులు, సమైక్యాంధ్రవాదులు ఎవరైనా సరే.. ఏపీ భవన్ ఎదుట లేదా ఆవరణలో నినాదాలు, ఆందోళనలకు దిగినా వెంటనే అధికారులు పోలీసులను రంగంలోకి దించి వారిని అదుపులోకి తీసుకునేలా చేసేవారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని కాసేపు భవన్లో ఉంచేందుకు కూడా వారు ససేమిరా అన్నారు. ఉత్తరాఖండ్ జలప్రళయంలో అన్నివిధాలా దెబ్బ తిని ఏపీభవన్ చేరుకున్న తెలుగువారిని ఆదుకునే విషయంలో కూడా నానా నిబంధనలను అధికారులు ప్రయోగించారు. అంతా అందులో భాగమే: ఏపీ భవన్లో బాబు దీక్ష చేయడం కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌లో అంతర్భాగమేనని తెలుస్తోంది. దీక్ష మొదలైన కాసేపటికే భవన్ ముఖ్య అధికారి ఒకరితో పాటు ఢిల్లీ పోలీసు విభాగం ముఖ్య అధికారులు ఆయన దగ్గరికెళ్లి ‘మీకు గురజాడ హాలులో విలేకరుల సమావేశానికే అనుమతిచ్చాం తప్ప దీక్షకు కాదు. ఇది నిబంధనలకు విరుద్ధం’ అని చెప్పగా బాబు తనదైన శైలిలో తలాడిస్తూ, ‘మీరు చెప్పారు. నేను విన్నాను. అన్నీ తెలుసు. మీరు వెళ్లొచ్చు’’ అని బదులిచ్చారు. కాసేపటికే, ‘నిరసన చేయడానికి నాకున్న ప్రాథమిక హక్కును నిరాకరిస్తున్నారు. ఒక తెలుగు వ్యక్తిని ఏపీ భవన్ నుంచి ఖాళీ చేయించడానికి ఇటాలియన్ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రధాని కార్యాలయం మేల్కోవాలి’’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో శివాలెత్తారు!. కాగా, ఏపీభవన్ ఆవరణలో బాబు దీక్షకు తామెలాంటి అనుమతీ ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. మరి దీక్షపై చర్యలు చేపడతారా అని ప్రశ్నించగా.. భవన్ రెసిడెంట్ కమిషనర్ ఫిర్యాదు చేస్తే చర్యలకు దిగగలమన్నారు. -
నేటి అర్ధరాత్రి నుంచి సీమాంధ్ర బంద్
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనలకు ‘నిరవధిక సమ్మె’ తోడుకానుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ మొదలుకొని రెవెన్యూ వరకు అన్ని సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ఏపీఎన్జీవోల నేతృత్వంలో దాదాపు 70 సంఘాలు సమ్మెకు సమాయత్తమయ్యాయి. రెవెన్యూ, ఎక్సైజ్, ట్రెజరీ, సహకార, వాణిజ్య పన్నులు, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్, మెడికల్, విద్యుత్ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే సీమాంధ్ర, తెలంగాణ మధ్య రాకపోకలు అంతంత మాత్రంగా ఉండగా.. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో స్తంభించనుంది. గ్రామ సహాయకుల నుంచి తహశీల్దారు వరకు.. రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో దీని ప్రభావం గ్రామ స్థాయిలోనూ కనిపించనుంది. టీచర్లు సైతం సమ్మెకు సై అనడంతో పాఠశాలలు మూతపడనున్నాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది కూడా సమ్మెలో పాలుపంచుకోనున్నారు. మొత్తమ్మీద దాదాపు 3.50 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మె దెబ్బకు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. సమ్మె నుంచి అత్యవసర సేవలను మినహాయించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధానిలో వివిధ శాఖల డెరైక్టరేట్, కమిషనరేట్లలో పని చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. అయితే హైదరాబాద్‌లో సమ్మె ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మెకు వెళ్లే అంశంపై సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. రవాణ బంద్.. ఆర్టీసీలోని రెండు ప్రధాన సంఘాలు.. ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) సీమాంధ్రలో సమ్మెకు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం ఆందోళనలతో సీమాంధ్రలోని పలు డిపోల్లో బస్సులు గడప దాటడం లేదు. అక్కడక్కడ కొన్ని ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా.. ప్రయాణికులు పెద్దగా ఉండడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీకి రోజూ రూ.9 కోట్ల మేర నష్టపోతోంది. ప్రధాన కార్మిక సంఘాల పిలుపుతో సీమాంధ్రలో దాదాపు 75 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. సీమాంధ్రలో 123 డిపోల్లో దాదాపు 13 వేల బస్సులు ఉన్నాయి. సీమాంధ్ర, హైదరాబాద్ మధ్య దాదాపు 2 వేల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. కార్మికుల సమ్మె వల్ల ఈ బస్సులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. రెండు ప్రాంతాల మధ్య బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ఇరు ప్రాంతాల సరిహద్దు డిపోల మధ్య కూడా రాకపోకలు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఫలితంగా ఆర్టీసీకి రోజూ రూ.14-15 కోట్ల నష్టం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతి, తిరుమల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా నిలిపివేయనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె వల్ల శ్రీవారి భక్తులకూ ఇబ్బందులు తప్పకపోవచ్చు. మున్సిపాలిటీల్లో 30 వేల మంది.. మున్సిపాలిటీల్లో కూడా సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మంచినీళ్లు, వీధి దీపాల సేవలు మినహా అన్ని రకాల సేవలను నిలిపివేయాలని మున్సిపాలిటీల్లోని అన్ని సంఘాలు తీర్మానం చేశాయి. రాష్ట్రంలో మొత్తం 165 మున్సిపాలిటీలు, 19 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా.. అందులో 12 కార్పొరేషన్లు. 102 మున్సిపాలిటీలు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో దాదాపు 30 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాలుపంచుకుంటారని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలను కూడా బహిష్కరిస్తామని ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ ఎస్.కృష్ణమోహన్ ఆదివారం తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే మంచినీటి సరఫరా, వీధి దీపాలకు సంబంధించి సేవలను మాత్రం మినహాయిస్తున్నట్లు వివరించారు. మినిస్టీరియల్, సబార్డినేట్స్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, తదితర విభాగాల ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటారన్నారు. ఆస్తిపన్ను వసూళ్లు, డిమాండ్ నోటీసుల జారీ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, రహదారుల నిర్మాణం, రాష్ట్ర, కేంద్ర నిధులతో చేపట్టిన పథకాలన్నీ నిలిచిపోక తప్పదని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తాం ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ, న్యూస్‌లైన్: ప్రాణాలు అర్పించైనా సరే సమైక్యాంధ్రను కాపాడుకుంటామని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు రవికుమార్ చెప్పారు. ఆదిఆరమిక్కడ ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. రవికుమార్ మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెలో పాల్గొనాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు తెలిపారు. 13 జిల్లాలకు చెందిన సబ్‌ట్రెజరీ కార్యాలయాలకు తాళాలు వేసి కార్యకలాపాలు స్తంభింపజేస్తామన్నారు. సమ్మెలో పంచాయతీరాజ్ డిప్లొమో ఇంజనీర్స్.. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న డిప్లొమో ఇంజినీర్స్ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. 13 జిల్లాల ప్రతినిధులు ఆదివారం విజయవాడలో సమావేశమైన జేఏసీని ఏర్పాటుచేశారు. పంచాయతీరాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమ్మెలో పాల్గొనే నిర్ణయాన్ని ఈ నెల 14న వెల్లడించనుంది. ఐసీడీఎస్ ఉద్యోగుల సమ్మె సాక్షి, రాజమండ్రి: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ఉద్యోగులు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నారని, సీమాంధ్ర లోని 13 జిల్లాలకు చెందిన లక్షా మూడు వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ఐసీడీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌రాజు ప్రకటించారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగానే.. - ఆర్టీసీ ఈయూ సమైక్య ఉద్యమ కమిటీ చైర్మన్ సీహెచ్ వెల్లడి కడప, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెను చేపడుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సమైక్య ఉద్యమ కమిటీ చైర్మన్ సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మెలో 13 జిల్లాల్లోని 123 డిపోలు, 12 వేల బస్సులు, 70 వేల మంది కార్మికులు పాల్గొననున్నట్లు తెలిపారు.