లోక్‌సభలో తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయకపోతే సోమవారం నుంచి పార్లమెంటు ప్రాంగణంలో నిరాహార దీక్ష చేస్తామని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎంపీలు తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయకపోతే సోమవారం నుంచి పార్లమెంటు ప్రాంగణంలో నిరాహార దీక్ష చేస్తామని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎంపీలు తెలిపారు. తమ పార్టీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, సి.ఎం.రమేశ్‌లు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని.. సీమాంధ్రులను శాంతపరిచి బిల్లు పెడితే సహకరిస్తామని మోదుగుల పేర్కొన్నారు.
యథావిధిగా ‘తమ్ముళ్ల’ తలోమాట
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో గురువారం చోటుచేసుకున్న సంఘటనలపైనా టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలు యథావిధిగా ఎవరి డిమాండ్లు వారు వినిపించారు. టీడీఎల్పీలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ సమైక్య భారత్‌ను కోరుకునే బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించటం బాధకరమన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామన్న బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ ప్రకటనను తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పార్టీని పెట్టించటం ద్వారా సీమాంధ్రలో వచ్చే ఎన్నికల్లో లబ్ధికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపీలను బహిష్కరించిందన్నారు.
బల్లి దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ టీ డీపీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ రమేష్ రాథోడ్‌లపై అధినేతకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్‌టీఆర్ భవన్‌లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు లోక్‌సభలో దాడిచేసుకోవటం బాధాకరమన్నారు. టీడీఎల్పీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ దేశ ప్రతిష్టతను మంట కలిపిన ఎంపీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.