దీక్షలోనూ ‘ఫిక్సింగే’
నిరాహార దీక్ష పేరిట హస్తినలో టీడీపీ అధ్యక్షుని హైడ్రామా
‘కాంగ్రెస్‌తో కుమ్మక్కు’కు అడుగడుగునా అద్దం పట్టిన ప్రహసనం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ అధికార కేంద్రమైన ఏపీ భవన్... పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల రసవత్తర మ్యాచ్‌ఫిక్సింగ్‌కు ప్రత్యక్ష వేదికగా మారింది. అధికారపక్షం అండదండలు సంపూర్ణంగా లభించడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన ‘విభజన’ దీక్షను ఏపీభవన్ ప్రాంగణంలోనే దర్జాగా చేపట్టారు! ఆ క్రమంలో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారు. ఏపీ భవన్‌ను కాస్తా బహిరంగ ప్రదేశంగా మార్చేశారు. అసలు దీక్షకు అనుమతి కూడా తీసుకోకపోయినా, కాంగ్రెస్ అధిష్టానం నుంచి హైదరాబాద్‌లోని పాలకులకు, అక్కడినుంచి ఏపీభవన్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలుండటంతో ఎవరూ దీక్షను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ‘చేయొద్దు, చేయొద్ద’ని పైకి తూతూ మంత్రంగా గొణుగుతూనే... దీక్షా స్థలి ముస్తాబుతో పాటు సకల ఏర్పాట్లకూ భవన్ ఉన్నతాధికారులే సంపూర్ణ సహకారం అందించి తరించారు!
అలా ముందుకెళ్లారు: ‘సంప్రదింపులు జరిపి, రాష్ట్రాన్ని సజావుగా విభజించండి’ అనే డిమాండ్‌తో బాబు మొదలు పెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు జంతర్‌మంతర్, లేదా ఏపీభవన్ వద్ద అనుమతి కోరుతూ టీడీపీ ఎంపీలు ముందుగా ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేశారు. జంతర్‌మంతర్ వద్ద సోమవారం నుంచి 2 రోజుల దీక్షకు వారు షరతులతో అనుమతిచ్చారు. దాంతో అక్కడ దీక్షా వేదిక కోసం టీడీపీ నేతలు కొన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆదివారం రాత్రి బాబు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాటిని అర్ధంతరంగా ఆపేశారు. హైదరాబాద్‌లో ముందే తయారైన స్క్రిప్టు ప్రకారం బాబు సోమవారం మధ్యాహ్నం ఏపీభవన్ ఆవరణలో గోదావరి బ్లాకు పక్కనే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన వేదిక వద్దకు చేరుకుని, తన ఆదేశానుసారం పరిచిన తివాచీలపై 3 గంటలకు దీక్షకు ఉపక్రమించారు.
బాబు మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుండగానే సకల ‘దీక్షా’ ఏర్పాట్లూ యుద్ధ ప్రాతిపదికన సాగిపోయాయి! దీక్ష సరంజామా అంతా ఓ లారీలో రావడం, ‘అనుమతి లేకుండా ఏర్పాట్లు వద్దు’ అంటూ భవన్ అధికారులు సుతిమెత్తగా అభ్యంతరపెట్టడం, ‘మాకు అనుమతి ఉంది, అడ్డు చెప్పడానికి మీరెవరు?’ అంటూ టీడీపీ ఎంపీలు దగ్గరుండి సామాను దింపించడం, వాటితో దీక్షా స్థలి ముస్తాబవడం చకచకా పూర్తయ్యాయి! ఏపీ భవన్ ఆవరణలో ఇలాంటి ఆందోళనలను అనుమతించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. తెలంగాణవాదులు, సమైక్యాంధ్రవాదులు ఎవరైనా సరే.. ఏపీ భవన్ ఎదుట లేదా ఆవరణలో నినాదాలు, ఆందోళనలకు దిగినా వెంటనే అధికారులు పోలీసులను రంగంలోకి దించి వారిని అదుపులోకి తీసుకునేలా చేసేవారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని కాసేపు భవన్‌లో ఉంచేందుకు కూడా వారు ససేమిరా అన్నారు. ఉత్తరాఖండ్ జలప్రళయంలో అన్నివిధాలా దెబ్బ తిని ఏపీభవన్ చేరుకున్న తెలుగువారిని ఆదుకునే విషయంలో కూడా నానా నిబంధనలను అధికారులు ప్రయోగించారు.
అంతా అందులో భాగమే: ఏపీ భవన్‌లో బాబు దీక్ష చేయడం కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌లో అంతర్భాగమేనని తెలుస్తోంది. దీక్ష మొదలైన కాసేపటికే భవన్ ముఖ్య అధికారి ఒకరితో పాటు ఢిల్లీ పోలీసు విభాగం ముఖ్య అధికారులు ఆయన దగ్గరికెళ్లి ‘మీకు గురజాడ హాలులో విలేకరుల సమావేశానికే అనుమతిచ్చాం తప్ప దీక్షకు కాదు. ఇది నిబంధనలకు విరుద్ధం’ అని చెప్పగా బాబు తనదైన శైలిలో తలాడిస్తూ, ‘మీరు చెప్పారు. నేను విన్నాను. అన్నీ తెలుసు. మీరు వెళ్లొచ్చు’’ అని బదులిచ్చారు. కాసేపటికే, ‘నిరసన చేయడానికి నాకున్న ప్రాథమిక హక్కును నిరాకరిస్తున్నారు. ఒక తెలుగు వ్యక్తిని ఏపీ భవన్ నుంచి ఖాళీ చేయించడానికి ఇటాలియన్ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రధాని కార్యాలయం మేల్కోవాలి’’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో శివాలెత్తారు!. కాగా, ఏపీభవన్ ఆవరణలో బాబు దీక్షకు తామెలాంటి అనుమతీ ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. మరి దీక్షపై చర్యలు చేపడతారా అని ప్రశ్నించగా.. భవన్ రెసిడెంట్ కమిషనర్ ఫిర్యాదు చేస్తే చర్యలకు దిగగలమన్నారు.