రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనలకు ‘నిరవధిక సమ్మె’ తోడుకానుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ మొదలుకొని రెవెన్యూ వరకు అన్ని సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ఏపీఎన్జీవోల నేతృత్వంలో దాదాపు 70 సంఘాలు సమ్మెకు సమాయత్తమయ్యాయి. రెవెన్యూ, ఎక్సైజ్, ట్రెజరీ, సహకార, వాణిజ్య పన్నులు, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్, మెడికల్, విద్యుత్ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే సీమాంధ్ర, తెలంగాణ మధ్య రాకపోకలు అంతంత మాత్రంగా ఉండగా.. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో స్తంభించనుంది. గ్రామ సహాయకుల నుంచి తహశీల్దారు వరకు.. రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో దీని ప్రభావం గ్రామ స్థాయిలోనూ కనిపించనుంది. టీచర్లు సైతం సమ్మెకు సై అనడంతో పాఠశాలలు మూతపడనున్నాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది కూడా సమ్మెలో పాలుపంచుకోనున్నారు. మొత్తమ్మీద దాదాపు 3.50 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మె దెబ్బకు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. సమ్మె నుంచి అత్యవసర సేవలను మినహాయించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధానిలో వివిధ శాఖల డెరైక్టరేట్, కమిషనరేట్‌లలో పని చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. అయితే హైదరాబాద్‌లో సమ్మె ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మెకు వెళ్లే అంశంపై సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు.
రవాణ బంద్..
ఆర్టీసీలోని రెండు ప్రధాన సంఘాలు.. ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) సీమాంధ్రలో సమ్మెకు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం ఆందోళనలతో సీమాంధ్రలోని పలు డిపోల్లో బస్సులు గడప దాటడం లేదు. అక్కడక్కడ కొన్ని ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా.. ప్రయాణికులు పెద్దగా ఉండడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీకి రోజూ రూ.9 కోట్ల మేర నష్టపోతోంది. ప్రధాన కార్మిక సంఘాల పిలుపుతో సీమాంధ్రలో దాదాపు 75 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. సీమాంధ్రలో 123 డిపోల్లో దాదాపు 13 వేల బస్సులు ఉన్నాయి. సీమాంధ్ర, హైదరాబాద్ మధ్య దాదాపు 2 వేల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. కార్మికుల సమ్మె వల్ల ఈ బస్సులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి. రెండు ప్రాంతాల మధ్య బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ఇరు ప్రాంతాల సరిహద్దు డిపోల మధ్య కూడా రాకపోకలు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఫలితంగా ఆర్టీసీకి రోజూ రూ.14-15 కోట్ల నష్టం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతి, తిరుమల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా నిలిపివేయనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె వల్ల శ్రీవారి భక్తులకూ ఇబ్బందులు తప్పకపోవచ్చు.
మున్సిపాలిటీల్లో 30 వేల మంది..
మున్సిపాలిటీల్లో కూడా సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మంచినీళ్లు, వీధి దీపాల సేవలు మినహా అన్ని రకాల సేవలను నిలిపివేయాలని మున్సిపాలిటీల్లోని అన్ని సంఘాలు తీర్మానం చేశాయి. రాష్ట్రంలో మొత్తం 165 మున్సిపాలిటీలు, 19 మున్సిపల్ కార్పొరేషన్‌లు ఉండగా.. అందులో 12 కార్పొరేషన్లు. 102 మున్సిపాలిటీలు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో దాదాపు 30 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాలుపంచుకుంటారని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలను కూడా బహిష్కరిస్తామని ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ ఎస్.కృష్ణమోహన్ ఆదివారం తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే మంచినీటి సరఫరా, వీధి దీపాలకు సంబంధించి సేవలను మాత్రం మినహాయిస్తున్నట్లు వివరించారు. మినిస్టీరియల్, సబార్డినేట్స్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, తదితర విభాగాల ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటారన్నారు. ఆస్తిపన్ను వసూళ్లు, డిమాండ్ నోటీసుల జారీ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, రహదారుల నిర్మాణం, రాష్ట్ర, కేంద్ర నిధులతో చేపట్టిన పథకాలన్నీ నిలిచిపోక తప్పదని హెచ్చరించారు.
సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు
విజయవాడ, న్యూస్‌లైన్: ప్రాణాలు అర్పించైనా సరే సమైక్యాంధ్రను కాపాడుకుంటామని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు రవికుమార్ చెప్పారు. ఆదిఆరమిక్కడ ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. రవికుమార్ మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెలో పాల్గొనాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు తెలిపారు. 13 జిల్లాలకు చెందిన సబ్‌ట్రెజరీ కార్యాలయాలకు తాళాలు వేసి కార్యకలాపాలు స్తంభింపజేస్తామన్నారు.
సమ్మెలో పంచాయతీరాజ్ డిప్లొమో ఇంజనీర్స్..
పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న డిప్లొమో ఇంజినీర్స్ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. 13 జిల్లాల ప్రతినిధులు ఆదివారం విజయవాడలో సమావేశమైన జేఏసీని ఏర్పాటుచేశారు. పంచాయతీరాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ సమ్మెలో పాల్గొనే నిర్ణయాన్ని ఈ నెల 14న వెల్లడించనుంది.
ఐసీడీఎస్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, రాజమండ్రి: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ఉద్యోగులు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నారని, సీమాంధ్ర లోని 13 జిల్లాలకు చెందిన లక్షా మూడు వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ఐసీడీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌రాజు ప్రకటించారు.
సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగానే..
- ఆర్టీసీ ఈయూ సమైక్య ఉద్యమ కమిటీ చైర్మన్ సీహెచ్ వెల్లడి
కడప, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెను చేపడుతున్నట్లు ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సమైక్య ఉద్యమ కమిటీ చైర్మన్ సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మెలో 13 జిల్లాల్లోని 123 డిపోలు, 12 వేల బస్సులు, 70 వేల మంది కార్మికులు పాల్గొననున్నట్లు తెలిపారు.