
'కుక్కల్లా ఉంటామని.. నక్కల్లా మారారు'
కిర్లంపూడి: ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించేంతవరకు ఆమరణ దీక్ష విరమించేదిలేదంటున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు ఇప్పటికీ వైద్యపరీక్షలకు నిరాకరిస్తున్నారు. పోలీసులు, వైద్యుల తీరును గర్హిస్తూ శనివారం అర్ధరాత్రి తరువాత ఇంటి తలుపులు మూసేసిన ముద్రగడ.. ఆదివారం లోపలే ఉండి తన దీక్షను కనసాగిస్తున్నారు. ముద్రగడ దంపతులకు మద్దతుగా కిర్లంపూడికి చేరుకుంటున్న మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంటి బయటే బైఠాయించిన మహిళలు.. కాపు రిజర్వేషన్ల అంశంలో సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న తీరును నిరసించారు. ముఖ్యమంత్రి, టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'మా నాయకుడు, ఆయన భార్య మూడు రోజులుగా పచ్చిమంచినీళ్లు ముట్టుకోలేదు. వాళ్లకు మద్దతుగా మేం కూడా ఇల్లు, వాకిలి వదిలేసి ఇక్కడికొచ్చాం. ఇంకా ఎన్నిరోజులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలాడతాడు? మేమేం అడిగాం? ఆయన ఇచ్చిన హామీనే నెరవేర్చమంటున్నాం. ఎన్నికలప్పుడు ఎన్నెన్ని మాటలు చెప్పారు. కుక్కల్లా ప్రజలపట్ల విశ్వాసంగా ఉంటామన్నారు. ఇప్పుడేమో గుంటనక్కల్లా మారి జనాన్ని మోసం చేస్తున్నారు' అంటూ అధికార పక్షంపై ఆగ్రహాన్ని ప్రదర్శించిందోమహిళ. పోలీసులు, వైద్యుల వ్యవహారశైలి వల్లే తమ నాయకుడు ఇంటి తలుపులు మూసేయాల్సి వచ్చిందని, దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారిని పోలీసులు అడ్డుకోవడం సమంజసంకాదని ముద్రగడ అనుచరుడొకరు మీడియాతో అన్నారు.