diabetes, fasting, chandra babu naidu, మధుమేహం, నిరాహారదీక్ష, చంద్రబాబు నాయుడు
48 గంటల వరకూ తగిన శక్తి ఉంటుంది
50 గంటలు దాటితే శరీరం సహకరించదంటున్న వైద్యులు
అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
60 లేదా 70 గంటలు దాటి సాధ్యం కాదని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: మధుమేహ బాధితుడికి సాధారణంగా ఒక్క గంట భోజనం ఆలస్యమైతేనే కళ్లు తిరుగుతాయి. నోరు పిడచకట్టుకు పోతుంది. తల తిరుగుతుంది...ఏం చేయాలో దిక్కుతోచదు. అలాంటిది రెండురోజులు దాటి నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుంది? మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ద్రవాహారమూ, ఘనాహారమూ తీసుకోకుండా 48 గంటల వరకూ దీక్ష చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గే కొద్దీ తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. సాధారణ వ్యక్తికైనా, మధుమేహం ఉన్న వ్యక్తికైనా నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు 48 గంటల తర్వాత కొవ్వులు కరిగిపోవడం ప్రారంభమవుతుంది. ముందుగా రక్తంలో ఉన్న గ్లూకోజు నిల్వలు కరిగిపోతాయి, ఆ తర్వాత కాలేయం చుట్టూ ఉన్న కొవ్వులు, అనంతరం కండరాల నుంచి కరిగి చివరగా సాధారణ కొవ్వులు (పొట్ట చుట్టూ లేదా ఇతర అవయవాల చుట్టూ ఉన్న కొవ్వులు) కరిగిపోతాయి. ఈ కొవ్వులు కరిగి శక్తిగా మారుతున్నప్పుడు కీటోన్స్ (గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వులు శక్తిరూపంలో వినియోగమవుతున్నప్పుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) వస్తాయి. ఇవి సాధారణంగా శరీరంలో జీరోగా ఉండాలి. 5కు మించితే వెంటనే మూత్రపిండాలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యక్తి తాను తీసుకుంటున్న మాత్రలు కానీ, ఇన్సులిన్ ఇంజెక్షన్‌లుగానీ ఆపేస్తే సుగర్ లెవెల్స్ 50 నుంచి 55 గంటల కంటే మించి నియంత్రణలో ఉండవు. మంచినీళ్లు తాగుతూ దీక్ష చేసినా, రక్తంలో సోడియం నిల్వలు తగ్గిపోయి నీరసంతో పాటు మైకం కమ్ముకుంటుంది. మాట్లాడ్డానికి నోరు సహకరించదు. అంతేకాదు పొటాషియం నిల్వలు తగ్గిపోయి కాళ్లు, చేతులు నడవడానికి సహకరించవు. మెదడుకు గ్లూకోజ్ నిల్వలు అందకపోతే కోమాలోకి వెళ్లే అవకాశముంటుంది. ఇక 60 లేదా 70 గంటలు దాటి ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష సాధ్యం కాదని కేర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గ్లూకోజ్‌కు కాలేయం స్టోర్ హౌస్ లాంటిదని, అలాంటి హౌస్ నుంచి మధుమేహ వ్యాధిగ్రస్తుడికి గ్లూకోజ్ అందకపోతే ఆహారం తీసుకోకుండా ఉండలేరని ఆయన అభిప్రాయపడ్డారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు 50 గంటల వరకూ దీక్ష చేయడం కూడా సాధ్యం కాదని నిమ్స్‌కు చెందిన మరో న్యూరో సర్జన్ డాక్టర్ ఎ.ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. 48 గంటల లోపే ఈ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడే అవకాశముంటుందని తెలిపారు.