సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కంటి శస్త్ర చికిత్సను కారణంగా చూపుతూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు.
‘ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిలివ్వండి’
సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అందుకు ఆయనపై పెడుతున్న వరుస కేసులే నిదర్శనమని తెలిపారు. గత 52 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని వివరించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుట్రపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును సీఐడీ ప్రశ్నించడం పూర్తయిందని, అందువల్ల అతనిని జైలులో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్ధిష్ట ఆరోపణలేవీ లేవన్నారు. జైలులో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కుడి కన్నుకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని వైద్యులు సైతం ధ్రువీకరించారని పేర్కొన్నారు. నచ్చిన వైద్యునితో చికిత్స చేయించుకునే ప్రాథమిక హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
‘ఆరోగ్య సమస్యల్ని సాకుగా చూపుతున్నారు’
సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చేందుకు అరోగ్య సమస్యలను కారణంగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సుధాకర్‌రెడ్డి కోర్టును కోరగా.. గడువు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ముందు మధ్యంతర బెయిల్‌పై వాదనలు వినిపించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
చంద్రబాబు బరువు తగ్గారన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒకటిన్నర కేజీ బరువు పెరిగారని సుధాకర్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యుల నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. చంద్రబాబుకు జైల్లోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కంటి శస్త్రచికిత్స అత్యవసరం ఎంతమాత్రం కాదన్నారు. వైద్యులు సైతం ఇదే చెప్పారన్నారు.
చంద్రబాబుకున్న అనారోగ్య సమస్యలు వయోభారంతో బాధపడే వారికి ఉండేవేనన్నారు. అవేమీ అసాధారణ సమస్యలు కాదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆరోగ్య సమస్యలను కారణంగా మాత్రమే చూపుతున్నారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు మధ్యంతర బెయిల్‌పై మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment