పక్కా పన్నాగంతోనే స్కిల్‌ స్కామ్‌.. బాబు కనుసన్నల్లోనే కుంభకోణం | Chandrababu New Corruption in Andhra pradesh | Sakshi
Sakshi News home page

పక్కా పన్నాగంతోనే స్కిల్‌ స్కామ్‌.. బాబు కనుసన్నల్లోనే కుంభకోణం

Published Thu, Oct 17 2024 3:53 AM | Last Updated on Thu, Oct 17 2024 5:40 AM

Chandrababu New Corruption in Andhra pradesh

బోగస్‌ ఇన్వాయిస్‌లు.. విదేశాలకు నిధుల తరలింపు 

షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి బాబు బంగ్లాకే చేరిన అక్రమ నిధులు 

ఇవన్నీ ఆధారాలతో సహా రుజువైనట్టు ఈడీ వెల్లడి

సాక్షి, అమరావతి:  ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రాజెక్ట్‌ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ కుట్రపూరితంగా షేల్‌ కంపెనీలు సృష్టించి ఫేక్‌ ఇన్వాయిస్‌లు అవినీతికి పాల్పడ్డారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట రూ.3,300కోట్ల ప్రాజెక్టును కేవలం కాగితాలపై సృష్టించడం... ప్రాజెక్టు చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371కోట్లు విడుదల చేయడం... షెల్‌ కంపెనీల ద్వారా తరలించడం...ఇలా కుట్ర అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది.

ప్రజాధనం కొల్లగొట్టాలనే పక్కా పన్నాగంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ సృష్టికర్త... ఆ కుంభకోణంతో అక్రమంగా నిధులు పొందిన లబ్ధిదారూ రెండూ చంద్రబాబే’అని సీఐడీ సిట్‌ దర్యాప్తులో ఆధారాలతోసహా వెల్లడైంది. కుంభకోణం కుట్రదారు...అంతిమలబ్ధిదారుడు చంద్రబాబేనని నిగ్గు తేలి్చంది. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూపొందించారు. టీడీపీ నేత ఇల్లెందుల రమేశ్‌ ద్వారా డిజైన్‌టెక్, ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ సంస్థలు ఆయన్ని సంప్రదించాయి. దాంతో రాష్ట్ర కేబినేట్‌ ఆమోదం లేకుండానే ఏపీఎస్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేశారు.

ఆ సంస్థకు డైరెక్టర్‌గా తన సన్నిహితుడు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎంటర్‌ ప్రైజస్, ఇన్నోవేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి సర్వే లేకుండానే కేవలం డిజైన్‌టెక్‌ కంపెనీ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఆధారంగా ఆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో డిజైన్‌టెక్‌ భాగస్వామిగా ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్‌ను ఆమోదించి... అందులో సీమెన్స్‌–డిజైన్‌టెక్‌ కంపెనీలు 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందంలో పేర్కొన్నారు.

చంద్రబాబు అవినీతి నెట్‌వర్క్‌ ఇదీ...
టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెల్లించింది.. రూ 371  కోట్లు
డిజైన్‌ టెక్‌ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్‌పీ అనే షెల్‌ కంపెనీకి  రూ. 238.29 కోట్లు, 
ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు.

అంతా బాబు ముఠానే..
ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు.  ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే. లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా  సుబ్బారావుకు ఏకంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ – ఇన్నోవేటివ్‌ కార్పొరేషన్‌ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులను కట్టబెట్టారు.

తద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికు ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించేలా పథకం రచించారు. అనంతరం సీమెన్స్‌ కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ జీవీఎస్‌ భాస్కర్‌ సతీమణి, యూపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అపర్ణను ఏపీఎస్‌ఎస్‌డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి విరుద్ధమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.  

మావాళ్లే.. అడ్డగోలుగా నిధులు ఇచ్చేయండి 
ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్‌ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్‌ఎస్‌డీసీ వాటా 10శాతం కింద జీఎస్టీ కలిపి డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, ఆరి్థక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక  కార్యదర్శి సునీత నోట్‌ఫైళ్లపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సీమెన్స్‌ కంపెనీకి రూ.371కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆరి్థక శాఖ అధికారులు ఆ నోట్‌ఫైళ్లలో స్పష్టం చేస్తూ ఆ నిధులు విడుదల చేశారు.  

నిధులు కొల్లగొట్టేందుకు గ్రీన్‌ చానల్‌  
ఇక ఆ ప్రాజెక్ట్‌ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా గ్రీన్‌ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విద్యా శాఖతో నిమిత్తం లేకుండా ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి నేరుగా ఇంటర్‌ప్రైజస్‌– ఇన్నోవేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లు పంపాలని ఆదేశించారు. ఆ మేరకు డిజైన్‌ టెక్‌ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లను వివిధ షెల్‌ కంపెనీల ద్వారా తరలించారు.  

పీవీఎస్‌పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్‌ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది...
ఏసీఐ:    రూ.56 కోట్లు 
నాలెడ్జ్‌ పోడియమ్‌:    రూ.45.28 కోట్లు 
ఈటా:     రూ.14.1 కోట్లు 
పాట్రిక్స్‌:     రూ.3.13 కోట్లు 
ఐటీ స్మిత్‌:     రూ.3.13 కోట్లు 
భారతీయ గ్లోబల్‌:     రూ.3.13 కోట్లు
ఇన్‌వెబ్‌:     రూ.1.56 కోట్లు 
పోలారీస్‌:     రూ.2.2 కోట్లు 
కాడెన్స్‌ పార్టనర్స్‌:     రూ.12 కోట్లు

మొత్తం రూ. 140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్‌ గుప్తా డ్రా చేసి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి అందించారు. మనోజ్‌ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.  

ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్‌పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్‌ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.  

ఏపీఎస్‌ఎస్‌డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్‌వర్క్‌ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement