నేటితో ఐదో రోజుకు జగన్ దీక్ష | YS Jagan's indefinite fast enters 5th day | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 9 2013 7:20 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

అదే ఉత్సాహం.. అదే కోలాహలం.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ‘సమైక్య దీక్ష’కు మంగళవారం నాలుగో రోజు కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షకు సంఘీభావం తెలిపారు. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండటంతో మంగళవారం జగన్ బాగా నీరసంగా కనిపించారు. అయినప్పటికీ తనను కలిసేందుకు వచ్చిన వారిని అదే చిరునవ్వుతో పలుకరిస్తూ అభివాదం చేశారు. వృద్ధులు, మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, పిల్లలతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన వారందరితో నిలబడి ఎంతో ఓపిగ్గా మాట్లాడారు. శరీరంలో నీటి శాతం తగ్గడమే గాక తీవ్రమైన వెన్నుపోటుతో బాధపడుతున్నప్పటికీ తనను కలిసేందుకు వచ్చిన వారందరితోనూ కరచాలనం చేశారు. వారికి నమస్కరించారు. కలిసేందుకు వచ్చిన పలువురు వికలాంగులు, చిన్న పిల్లలకు అభివాదం చేసేందుకు వేదిక నుంచి వంగి ప్రత్యేకంగా పలకరించారు. కొందరు రైతులు అభిమానంతో జగన్‌కు నాగలి బహూకరించారు. జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన రైతులు జగన్‌తో కరచాలనం చేయడానికి ఉత్సాహ పడ్డారు. ముస్లింలు కూడా మంగళవారం భారీగా వచ్చి ఆయనను కలుసుకున్నారు. జగన్ భుజాలపై రుమాళ్లు కప్పుతూ ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం జగన్ ముందుకొచ్చి దీక్ష చేయడం అభినందనీయమన్నారు. దీక్షకు సంఘీభావంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రం తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ప్రతిఘటిస్తున్న నేతగా జగన్‌ను అందరూ తమ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. పారిశ్రామికవేత్తల సంఘీభావం చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పారిశ్రామికవేత్తలు వచ్చి జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. జగన్‌కు వినతిపత్రమిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పారిశ్రామికరంగానికి అండగా నిలిచి అనేక ప్రోత్సాహాకాలిచ్చారని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుత విద్యుత్ సమస్యల కారణంగా తమ పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ పుచ్చలపల్లి మిత్ర, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీ నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బి.గుర్నాథరెడ్డి, కాటసాని రామిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైఎస్సార్‌సీపీ నేతలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మద్దాల రాజేశ్, పేర్ని నాని, భూమా నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, జంగా కృష్ణమూర్తి, ఎస్వీ మోహన్‌రెడ్డి, అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, రంగనాథరాజు, ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, పెండ్యాల వెంకట కృష్ణబాబు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లా ఆర్య ైవైశ్య సంఘం అధ్యక్షుడు ఎం.ద్వారకనాథ్, డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ ిసీహెచ్ బాలచెన్నయ్య, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పి.గౌతంరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి తదితరులు మంగళవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌కు సంఘీభావం తెలిపారు. వంగపండు ఉష బృందం నేతృత్వంలోని పాటలు అలరించాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement