హైదరాబాద్: రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీలు మహా ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
బీసీలపై కేసీఆర్ కక్ష కట్టారు: జాజుల
ఎన్నికల్లో ఆశీర్వదించిన బీసీలపైనే కేసీఆర్ కక్ష కట్టారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ చేశారని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల సమస్యపై 24 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లను రక్షించుకునేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారమా?: ఎల్ రమణ
బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకునిపోయి బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవాలని సూచించారు.బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ప్రశ్నించిన కేసీఆర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. రిజర్వేషన్ల పోరాటంలో టీటీడీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రాణం పోయినా ఊరుకునేది లేదు:వీహెచ్
ప్రాణం పోయినా ఊరుకునేది లేదు..బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లోని బీసీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లపై మాట్లాడాలని కోరారు. సకల జనుల సర్వేలో బీసీల లెక్కలు ఇప్పటికీ బయట పెట్టలేదని చెప్పారు. బీసీల ఓట్ల కోసం స్కీమ్‌లు పెట్టారు...ఎన్నికల్లో గెలిచాక బీసీల రిజర్వేషన్లు తగ్గించారు. బీసీల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు..బీసీలు అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమగ్ర కుటుంబసర్వేలో 54 శాతం బీసీలు ఉన్నారని ప్రకటించిన వాస్తవమా కాదా చెప్పాలన్నారు. బీసీలు చట్టసభల్లోకి వెళ్లకుండా గొర్లు,బర్లు కాసుకునే బతకాలా అని సూటిగా అడిగారు.
కేసీఆర్ పిట్టల దొర : షబ్బీర్
కేసీఆర్ ఒక పిట్టల దొర అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. 34 శాతం కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
సీఎం నిర్ణయం హాస్యాస్పదం: పొన్నాల
సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి చట్టబద్దం చేయలేదని వెల్లడించారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చెయ్యాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment