హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం అటకెక్కనుంది. వ్యవసాయానికి వాడే ప్రతి యూనిట్‌ను ఖచ్చితంగా లెక్కగట్టడం, వ్యవసాయానికిచ్చే విద్యుత్‌ను క్రమంగా తగ్గిస్తూ పోవడం, సబ్సిడీకి కోత వేయడం వంటి చర్యలతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే దిశగా ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 3,293 మిలియన్ యూనిట్ల మేర వ్యవసాయ విద్యుత్‌ను పొదుపు చేస్తామని కేంద్రానికి సమర్పించిన 'అందరికీ విద్యుత్' పత్రంలో రాష్ట్ర సర్కారు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఇంధన తనిఖీ (ఎనర్జీ ఆడిట్) పేరుతో.. క్రమంగా ఉచిత విద్యుత్‌కు, తద్వారా రైతన్నల సంక్షేమానికి మంగళం పాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగమవుతున్న విద్యుత్‌ను లెక్కించి ఇందులో కనీసం 25 శాతం వాడకాన్ని ఈ ఏడాది చివరికల్లా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. వచ్చే మూడేళ్లలో ఈ తగ్గింపును 50 శాతానికి తీసుకెళ్లనున్నారు. విద్యుత్‌ను లెక్కించేందుకు క్షేత్రస్థాయిలో అత్యాధునిక మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు మీటర్ బిగించాలని తొలుత యోచించారు. దీనిపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దీంతో ఈ ఆలోచనను విరమించుకున్నారు. తాజాగా ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో మీటర్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరుకే 30 వేల ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగిస్తామని డిస్కంల సీఎండీలు తెలిపారు.
సబ్సిడీకి సిద్ధంగా లేని సర్కారు
రాష్ట్రంలో 13.5 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. మొత్తం విద్యుత్ వాడకంలో ఈ రంగ వినియోగం 27 శాతం. అంటే ఏటా 11,700 మిలియన్ యూనిట్లు (సగటున రోజుకు 32 మి.యూ) వ్యవసాయానికి ఖర్చవుతున్నాయి. ఈ మొత్తానికి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో పంపిణీ సంస్థలకు నిధులు సమకూరుస్తోంది. అయితే ఇంతమొత్తం భరించడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా లేదు. విద్యుత్ సంస్థలకు రూ.7,716 కోట్ల ఆర్థిక లోటు ఉంటే, కేవలం రూ.4 వేల కోట్ల సబ్సిడీకి మాత్రమే పరిమితం అవుతోంది. ఇందులోనే గృహ వినియోగదారుల సబ్సిడీ కూడా ఉండటం గమనార్హం. అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లపైనా ఏప్రిల్ 1 నుంచి చార్జీల భారం మోపేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. ఎనర్జీ ఆడిట్ పేరుతో వ్యవసాయానికిచ్చే ఉచిత విద్యుత్‌ను, సబ్సిడీని క్రమంగా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తోంది.
ఫీడర్ల వారీగా విభజన పూర్తి
వ్యవసాయ, గృహ, వాణిజ్య, పారిశ్రామిక ఫీడర్ల విభజన కార్యక్రమం దాదాపు పూర్తయింది. రాష్ట్రంలో 6 లక్షల 6 వేల ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటే, అందులో 70 శాతం వ్యవసాయ రంగానికి చెందినవే ఉన్నాయి. అంటే సుమారు 4 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లకు కొత్తగా మీటర్లు బిగించబోతున్నారు. తొలి దశలో ఈ మార్చి చివరి నాటికి 30 వేల ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో మీటర్‌కు రూ. 6 వేలు, మోడెంకు రూ. 3.5 వేలు వెచ్చిస్తున్నారు. ఇన్సులేషన్‌తో కలుపుకుంటే ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు రూ. 8 నుంచి రూ.12 వేలు ఖర్చవుతాయి.
మోడెం, సిమ్‌కార్డు ద్వారా విద్యుత్ వినియోగాన్ని ఆన్‌లైన్ చేయనున్నారు. 5 హెచ్‌పీ మోటార్‌కు కనుక ఉచిత విద్యుత్ కనెక్షన్‌కు అనుమతి ఉన్నట్టయితే అంతే మొత్తం వాడాలి. ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చినా, దాన్ని ఉచితం నుంచి మినహాయించే దిశగా అధికారులు మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో అనధికారికంగా కనెక్షన్లు ఉంటే, దాన్ని అనుమతి ఉన్న వినియోగదారుడి ఖాతాలో కట్టే అవకాశం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఫలితంగా నిజమైన రైతు ఉచిత విద్యుత్ అందకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు.
కచ్చితమైన లెక్క కోసమే: అజయ్ జైన్
వ్యవసాయానికి ఎంత విద్యుత్ వినియోగం అవుతోందనే కచ్చితమైన లెక్కకోసమే ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో ఎనర్జీ ఆడిట్ నిర్వహిస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. దీనివల్ల వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయడానికి వీలవుతుందన్నారు.
ఉచితానికి ఉరి
Published Fri, Mar 6 2015 2:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement