దోచేద్దాం!
కంప్యూటర్ బిల్లులకు మంగళం
పెలైట్ ప్రాజెక్టు పేరిట కాలక్షేపం
మద్యం వ్యాపారులకు ప్రభుత్వం వత్తాసు
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు.. అమలు చేస్తున్న విధానాలకు పొంతనలేకుండా పోతోంది. ‘పచ్చ’బాబులకు ఇబ్బంది కలిగితే చాలు చట్టాలనే మార్చేయడం అలవాటైపోయింది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం మద్యం వ్యాపారమే. మొదట్లో మద్యం విక్రయాలకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు ఆ విధానానికి మంగళంపాడేందుకు సిద్ధమైంది. పెలైట్ ప్రాజెక్టుపేరుతో కాలయాపన చేస్తూ మందుబాబులను గుల్లచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.
చిత్తూరు (అర్బన్): జిల్లాలో 410 ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణకు మేలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్ల పాటు పాలసీకి ప్రతీ దుకాణంలో తప్పనిసరిగా మద్యం బాటిళ్లు విక్రయించేప్పుడు కంప్యూటర్ బిల్లులు ఇవ్వాలని గెజిట్‌లో పేర్కొంది. షరతులకు అంగీకరించే జిల్లాలో 341 మద్యం దుకాణాలను వ్యాపారులు దక్కించుకున్నారు.
కల్తీని నివారించాలని..
కర్ణాటక నుంచి అక్రమ మద్యం నివారించడం, కల్తీ మద్యాన్ని పసిగట్టడం సులభతరమవుతుంది. ప్రతి మద్యం బాటిల్‌పై కంప్యూటరైజ్డ్ హోలోగ్రామ్ స్టిక్కర్లు వేసి, దానికి బార్ కోడింగ్ నెంబరు సైతం కేటాయిస్తారు. వీటిని దుకాణాల్లో డీకోడింగ్ చేసి ఆ మద్యం ఎక్కడ తయారయ్యింది..? ఎప్పుడు దుకాణంలోకి వచ్చింది..? ఎప్పుడు అమ్ముతున్నారు..? ఎంతకు విక్రయిస్తున్నారే వివరాలను రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో లింకుచేస్తారు. అక్కడి సర్వర్ ఆధారంగా జిల్లాలోని మద్యం బాటిళ్ల పంపిణీ గోడౌన్లకు, దుకాణాలకు, డెప్యూటీ కమిషనర్ కార్యాలయాల కు ఆన్‌లైన్‌ను అనుసంధానం చేస్తారు. ప్రతి దుకాణం లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ‘కార్వే’ అనే సం స్థతో ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రతి నెలా దుకాణం నుంచి రూ.5 వేల అద్దె తీసుకోవడం.. లేనిపక్షంలో ఒకే సారి రూ.90 వేలు చెల్లించి కంప్యూటర్ పరికరాలు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించా రు. ఈ విధానం జూలై 15 నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు.
ఇలా కాలక్షేపం
జిల్లాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిలో 90 శాతం వ్యాపారులు టీడీపీ నాయకులే. రాష్ట్రంలో సైతం మద్యం దుకాణాలు చేజిక్కించుకున్న తమ సానుభూతి పరులను కాపాడడానికి ఉత్తర్వులను తీసుకొచ్చారు. జిల్లాలో 341 దుకాణాలకు గానూ పెలైట్ ప్రాజెక్టు కింద కేవలం చిత్తూరులో 2, తిరుపతిలో 1 చోట కంప్యూటర్ బిల్లులను ఏర్పాటు చేయడానికి రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయిలో ఈ మూడు చోట్లా కంప్యూటర్ బిల్లులు విజయవంతంగా నడిస్తే జిల్లా మొత్తం అమలు చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు.
రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఆన్‌లైన్ ఏర్పాటు చేయకపోవడం, జిల్లాలో సైతం మద్యం బాటిళ్ల పంపిణీ గోదాముల్లో ఈ విధానం అమల్లోకి రాలేదు. ఈ మూడు దుకాణాల్లో కూడా వచ్చే ఏడాది నుంచి కంప్యూటరైజ్డ్ విధానం అమలుకానుంది. నకిలీ మద్యం, కర్ణాటక మద్యం దిగుమతి చేసుకుని ఇష్టానుసారం వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వమే పచ్చజెండా ఊపినట్లయ్యింది. ఇదే అదునుగా మద్యం వ్యాపారులు మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.