ప్రభుత్వ బదిలీలలు
నెల్లూరు(విద్య): ఉపాధ్యాయుల ప్రభుత్వ(రాజకీయ) బదిలీలు జిల్లా విద్యాశాఖలో గందరగోళం సృష్టిస్తున్నాయి. అటు ఉపాధ్యాయలోకాన్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో ప్రభుత్వ బదిలీలు పొందిన ఉపాధ్యాయులు ఆర్డర్స్ తీసుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజకీయ నాయకులకు, విద్యాశాఖ డెరైక్టరేట్‌లో రూ.లక్షలు చెల్లించి తీసుకున్న ఆర్డర్లు చేతికి అందకపోయే సరికి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేని చోట్ల నియమించారని జిల్లా విద్యాశాఖ వాదనను వారు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం బదిలీ చేసిన ప్రాంతానికి పంపేందుకు జిల్లా విద్యాశాఖకు ఉన్న అభ్యంతరం ఏమిటని అధికారులను నిలదీస్తున్నారు. పనిలోపనిగా అధికార పార్టీ నాయకులకు ఫోన్‌లు చేస్తున్నారు.
సాంకేతికపరమైన లోపాలు చూపుతూ పిల్లల నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వ జీఓలకు డీఈఓ అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. డీఈఓకు ముడుపులు చెల్లించేందుకే ఈ అంశాన్ని ఆయన లేవనెత్తుతున్నారని వారి వాదన. వారి హడావుడి పుణ్యమా అని రాజకీయ నాయకులకు, డెరైక్టరేట్‌లో చెల్లించిన ముడుపులు కాకుండా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సైతం ముడుపులు చెల్లించాలనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.
అంతా తప్పులతడక..
అడ్డదారిలో ప్రభుత్వ బదిలీలు పొందిన ఉపాధ్యాయులు పోస్టింగ్ ఆర్డర్ల కోసం డీఈఓ కార్యాలయం వద్ద మంగళవారం పడిగాపులు కాశారు. ఎవరిపాటికి వారు పైరవీలు నడిపి లక్షలు గుమ్మరించి తెచ్చుకున్న ప్రభుత్వ ఆర్డర్లు జిల్లా కలెక్టర్ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ క్రమంలో బదిలీల్లో చోటుచేసుకున్న పలు ఆసక్తికరమైన సంఘటనలు ఉపాధ్యాయుల అవస్థలను వెక్కిరిస్తున్నాయి. మొత్తం 22 ప్రభుత్వ బదిలీ ఉత్తర్వుల్లో వెంకటాచలం హెచ్‌ఎం పోస్టుకు ఒకే పేరుతో రెండు ఆర్డర్లు వచ్చాయి. వెంకటాచలంలో గతంలో పనిచేస్తున్న హెచ్‌ఎంను సస్పెండ్ చేసిన విషయం తెలిసింది.
అయితే హెచ్‌ఎంపై విచారణ పూర్తికాక ముందే మరొక వ్యక్తిని నియమించడం నిబంధనలకు విరుద్ధమని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ పోస్టుకు ఒకే వ్యక్తికి ఇంటిపేరు మార్చి రెండు ఆర్డర్లు రావడం హాస్యాస్పదమని, డెరైక్టరేట్ నుంచి వచ్చే జీఓల లీలలు ఇలా ఉంటాయని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి ఎస్‌జీటీలుగా బదిలీ పత్రాలు వచ్చాయి. మరికొన్ని కేవలం మండలం మాత్రం సూచించి స్కూళ్లను సూచించకపోవడంతో వారు ఎక్కడ జాయిన్ కావాలో తెలియని పరిస్థితి నెలకొంది.
లోపభూయిష్టంగా, తప్పుల తడకగా ఉన్న బదిలీ ఉత్తర్వులను అభ్యర్థులకు అందజేసేందుకు డీఈఓ కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి, లక్షలు ఖర్చుచేసి తెచ్చుకున్న జీఓలు అందకపోవడంతో మళ్లీ రాజకీయ నాయకులతో ఫోన్లు, పైరవీలు జిల్లాస్థాయిలో నడిపేందుకు అభ్యర్థులు మళ్లీ పావులు కదుపుతున్నారు. కలెక్టర్ ఆమోదం పొందితేనే ఉత్తర్వులు అందజేస్తామని డీఈఓ తేల్చిచెప్పారు. కార్యాలయం వద్దకు బుధవారం సాయంత్రం వరకు రావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మొత్తం 22 ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులు జిల్లా కార్యాలయానికి అందాయి. అందులో 10 మాత్రమే ఖాళీగా ఉన్న ప్రాంతాలకు పోస్టింగ్‌లు వేయవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో సిబ్బంది కొరత, ఖాళీలు లేకపోవడం కొసమెరుపు.