ఎమర్జెన్సీని తలపిస్త్తున్న ప్రభుత్వ తీరు
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపేయడం దుర్మార్గం
- రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు,
- ప్రజా సంఘాలు, వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
- వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్
సాక్షి, నెట్‌వర్క్: సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను తలపిస్తోందంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు, వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా వీడియోగ్రాఫర్ల అసోసియేషన్, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్, చిన్నపత్రికల సంఘం నాయకులు సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడాన్ని ఖండిస్తూ శనివారం అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
ఆయా జిల్లాలో కలెక్టర్లకు, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తూ.. ఎన్నికలనాటి హామీల వైఫల్యంపై ప్రజల పక్షాన సాక్షి నిలదీస్తోంది. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తుని ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలంటూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు సంబంధించిన సమగ్ర వార్తలను ప్రసారం చేస్తుండటంతో కక్ష కట్టిన ప్రభుత్వం సాక్షి చానల్‌ను రెండు రోజులగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ముద్రగడ దీక్ష విరమిస్తేనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించడం గమనార్హం. ఇది అప్రజాస్వామికమంటూ శనివారం అన్ని జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. మీడియాను అణచివేయాలని చూస్తే ప్రభుత్వ పతనం తప్పదనే విషయం గుర్తించాలని హెచ్చరించారు. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
సాక్షి చానల్ ప్రసారాలు నిలుపుదల సరికాదు
ఎంఎస్‌ఓలపై ఒత్తిడి తెచ్చి సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడం సరికాదని న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(నై)- ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ఎస్ శశి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడం వల్ల కొన్ని వందల మంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని, ఇది మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు.
ప్రజాస్వామ్యంలో మీడియా హక్కులను కాలరాయడం ఎవరి తరమూ కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను గ్రహించి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో జమ్మూకశ్మీర్ తరువాత న్యూస్ చానళ్లపై ఆంక్షలు విధించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుకే దక్కిందని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్ కృష్ణంరాజు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసి ప్రభుత్వమే భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగించిందని, దీనిపై తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని లోక్‌సత్తా పార్టీ డిమాండ్ చేసింది.