కొల్చారం, న్యూస్‌లైన్: సంగాయిపేటలో జరిగిన విషాద సంఘటన తెలుసుకున్న మంత్రి సునీతారెడ్డి మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుల తల్లిదండ్రుల రోదనలతో చలించిన ఆమె కన్నీరు పెట్టారు. అనంతరం మాట్లాడుతూ, గ్రామంలో ఒకేసారి ఐదుగురు విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. కుటుంబంలోని వ్యక్తి చనిపోతే బాధ ఎలా ఉంటుందో చెప్పడం ఎవరి తరం కాదన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిల్లలు లేనిలోటు ఎవరు పూడ్చలేనిదన్నారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలోని ప్రభుత్వ అసైన్‌డ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తహశీల్దార్ లావణ్యను ఆదేశించారు. జిల్లా విద్యాధికారితో చర్చించి అత్యవసర నిధులు వచ్చేలా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయ నిధి కింద రూ.20 వేలు అందజేశారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి రూ.10వేలు అందజేశారు.
రోదనలు మిన్నంటాయి..ఆక్రందనలు అందరినీ కలచివేశాయి...ఎవరినీ కదిలించినా కన్నీళ్లే సమాధానమిచ్చాయి.. తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయిన పిల్లలను తలచుకుంటూ వారి తల్లిదండ్రులు గుండెలుబాదుకున్న తీరు చూసి అక్కుడున్న వారూ కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం బతుకమ్మ పూలకోసం వెళ్లి కుంటలోపడి మృతి చెందిన ఐదుగురు విద్యార్థుల అంత్యక్రియలు మంగళవారం జరగ్గా..సంగాయిపేట శోకసంద్రమైంది. భారీగా తరలివచ్చిన సమీప ప్రాంతాల ప్రజలు, సంగాయిపేట వాసులు చిన్నారుల అంతిమయాత్రలో పాల్గొని అంజలి ఘటించారు.
కొనసాగిన కన్నీటి యాత్ర
మృతులు ఆకుల మధు, ఆకుల సుధాకర్, బద్రి రాజు, బద్రి ప్రవీన్, బద్రి నరేష్‌లను ఖననం చేసేందుకు ఒకే ట్రాక్టర్‌పై తరలించగా సంగాయిపేట మొత్తం తరలివచ్చింది. మృతుల బంధువులు, స్నేహితులు, వివిధ పాఠశాలల విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, పెద్ద ఎత్తున తరలిరావడంతో అంతిమయాత్ర జరిగిన కిలోమీటర్ మేర జనం నిండిపోయారు. మృతుల కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రోదించారు. విద్యార్థుల అంతిమయాత్రలో కొల్చారం తహశీల్దార్ లావణ్య, ఎంపీడీఓ ఎల్లయ్య, మెదక్ సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జిల్లా ఆప్కో డెరైక్టర్ అరిగే రమేష్, ఆర్యవైశ్య సంఘం జిల్లా సభ్యులు ప్రభాకర్‌గుప్త, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ నేతలు మదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం.. సోమవారం రాత్రికే విద్యార్థుల మృతదేహాలన్నీ కుంటలో నుంచి బయటకు తీయగా, మెదక్ డీఎస్పీ గోద్రూ, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, కొల్చారం ఎస్‌ఐ ప్రభాకర్‌లు మృతదేహాలను అదే రోజు రాత్రి సంగాయిపేటలోని మున్నూరు కాపు సంఘం భవనానికి చేర్చారు. మంగళవారం ఉదయం మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఒకేసారి మృతి చెందడంతో సంగాయిపేటలో పూర్తిగా విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల వారు ప్రజలు, ఆయా పార్టీల నాయకులు సంగాయిపేటకు చేరుకొని బాధిత కుటుంబాలను ఓదార్చారు. మృతుల్లో నలుగురు విద్యార్థులు రంగంపేట పాఠశాలకు చెందిన వారు కావడంతో ఈ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంజలి ఘటించారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి సునీతారెడ్డి
Published Wed, Oct 9 2013 3:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement