sunithalaxmi reddy
-
గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత మంత్రి సునీతారెడ్డి
శివ్వంపేట, న్యూస్‌లైన్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శివ్వంపేట, సికింద్లాపూర్, పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాల్లో ఆమె పర్యటించారు. సికింద్లాపూర్, లింగోజిగూడలో సీసీ రోడ్లు, లింగోజిగూడ తండాలో పాఠశాల భవనం, పిల్లుట్లలో ఆరోగ్య ఉపకేంద్రం, శివ్వంపేట శ్రీరాంనగర్ కాలనీలో పాఠశాల భవనం, తూప్రాన్ - నర్సాపూర్ ప్రధాన రహదారి వద్ద రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అంతర్గత రోడ్లు, ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు కృషిచేయడంతో ప్రతి కుటుంబానికి సంక్షేమపథకాలు అందిస్తున్నామన్నారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు గాను సోలార్ వీధిలైట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి పంచాయతీ పరిధిలో సోలార్ లైట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకధికారి బాల్‌రెడ్డి, తహశీల్దార్ కిష్టారెడ్డి, ఎంపీడీఓ పూజ, సర్పంచ్‌లు చంద్రాగౌడ్, సులోచన నర్సింహారెడ్డి, స్రవంతి నవీన్‌కుమార్, పన్సారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంతారావు, గోలి వెంకటేశం గుప్తా, చింతల మహేందర్‌రెడ్డి, యాదాగౌడ్, నాయకులు రాజలింగం, బాసన్పల్లి రాములుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, నాగభూషణం, మహిపాల్‌రెడ్డి, చింతస్వామి, తదితరులు పాల్గొన్నారు. 15 ఏళ్ల తర్వాత బస్కెక్కా మంత్రి సునీతారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె పిల్లుట్ల నుంచి నర్సాపూర్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. అనంతరం మంత్రి బస్సులో పిల్లుట్ల నుంచి లింగోజిగూడ వరకు టిక్కెట్టు తీసుకొని ప్రయాణం చేశారు. 15ఏళ్ల తర్వాత తాను బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సులోచన నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి సునీతారెడ్డి
కొల్చారం, న్యూస్‌లైన్: సంగాయిపేటలో జరిగిన విషాద సంఘటన తెలుసుకున్న మంత్రి సునీతారెడ్డి మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుల తల్లిదండ్రుల రోదనలతో చలించిన ఆమె కన్నీరు పెట్టారు. అనంతరం మాట్లాడుతూ, గ్రామంలో ఒకేసారి ఐదుగురు విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. కుటుంబంలోని వ్యక్తి చనిపోతే బాధ ఎలా ఉంటుందో చెప్పడం ఎవరి తరం కాదన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిల్లలు లేనిలోటు ఎవరు పూడ్చలేనిదన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలోని ప్రభుత్వ అసైన్డ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తహశీల్దార్ లావణ్యను ఆదేశించారు. జిల్లా విద్యాధికారితో చర్చించి అత్యవసర నిధులు వచ్చేలా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయ నిధి కింద రూ.20 వేలు అందజేశారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి రూ.10వేలు అందజేశారు. రోదనలు మిన్నంటాయి..ఆక్రందనలు అందరినీ కలచివేశాయి...ఎవరినీ కదిలించినా కన్నీళ్లే సమాధానమిచ్చాయి.. తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయిన పిల్లలను తలచుకుంటూ వారి తల్లిదండ్రులు గుండెలుబాదుకున్న తీరు చూసి అక్కుడున్న వారూ కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం బతుకమ్మ పూలకోసం వెళ్లి కుంటలోపడి మృతి చెందిన ఐదుగురు విద్యార్థుల అంత్యక్రియలు మంగళవారం జరగ్గా..సంగాయిపేట శోకసంద్రమైంది. భారీగా తరలివచ్చిన సమీప ప్రాంతాల ప్రజలు, సంగాయిపేట వాసులు చిన్నారుల అంతిమయాత్రలో పాల్గొని అంజలి ఘటించారు. కొనసాగిన కన్నీటి యాత్ర మృతులు ఆకుల మధు, ఆకుల సుధాకర్, బద్రి రాజు, బద్రి ప్రవీన్, బద్రి నరేష్‌లను ఖననం చేసేందుకు ఒకే ట్రాక్టర్‌పై తరలించగా సంగాయిపేట మొత్తం తరలివచ్చింది. మృతుల బంధువులు, స్నేహితులు, వివిధ పాఠశాలల విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, పెద్ద ఎత్తున తరలిరావడంతో అంతిమయాత్ర జరిగిన కిలోమీటర్ మేర జనం నిండిపోయారు. మృతుల కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రోదించారు. విద్యార్థుల అంతిమయాత్రలో కొల్చారం తహశీల్దార్ లావణ్య, ఎంపీడీఓ ఎల్లయ్య, మెదక్ సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జిల్లా ఆప్కో డెరైక్టర్ అరిగే రమేష్, ఆర్యవైశ్య సంఘం జిల్లా సభ్యులు ప్రభాకర్‌గుప్త, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నేతలు మదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం.. సోమవారం రాత్రికే విద్యార్థుల మృతదేహాలన్నీ కుంటలో నుంచి బయటకు తీయగా, మెదక్ డీఎస్పీ గోద్రూ, మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ, కొల్చారం ఎస్ఐ ప్రభాకర్‌లు మృతదేహాలను అదే రోజు రాత్రి సంగాయిపేటలోని మున్నూరు కాపు సంఘం భవనానికి చేర్చారు. మంగళవారం ఉదయం మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఒకేసారి మృతి చెందడంతో సంగాయిపేటలో పూర్తిగా విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల వారు ప్రజలు, ఆయా పార్టీల నాయకులు సంగాయిపేటకు చేరుకొని బాధిత కుటుంబాలను ఓదార్చారు. మృతుల్లో నలుగురు విద్యార్థులు రంగంపేట పాఠశాలకు చెందిన వారు కావడంతో ఈ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంజలి ఘటించారు. -
డిసెంబర్‌లోపే తెలంగాణ
పాపన్నపేట, న్యూస్‌లైన్: డిసెంబర్‌లోపేప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏడుపాయల దుర్గా భవానీ శరన్నవరాత్రోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సకలజనుల ఉద్యమం, యువకుల పోరాటం, తెలంగాణ ప్రక్రియకు తోడ్పడ్డాయన్నారు. 2009 డిసెంబర్ 9న ఇచ్చిన హామీ మేరకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నోట్ తయారు చేసి కేంద్ర కేబినెట్ చేత ఆమోదింపజేసిందన్నారు. ఇక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతమవుతుందన్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ డిసెంబర్‌లోగా ఏర్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన యూపీఏ చైర్పర్సన్ సోనియా, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చూపిన చొరవ మరువలేనిదన్నారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించేందుకు మంత్రుల బృందం కృషి చేస్తోందని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేస్తున్న పోరాటాన్ని గుర్తించి సీమాంధ్రులు కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అన్నదమ్ముల్లా వీడిపోయి,అత్మీయులుగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, ఏడుపాయల దేవాలయ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింలుగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లప్ప, కాంగ్రెస్ నాయకులు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
రావిపహాడ్ (నేరేడుచర్ల), న్యూస్‌లైన్ : మహిళలు ఆర్థిక స్వావలంబనసాధించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి సూ చించారు. శుక్రవారం మండలంలోని రావిపహాడ్‌లో రూ. 3.30 కోట్లతో నిర్మించిన మహంకాళిగూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. 382 సమభావన సంఘాల ద్వారా మహిళలకు రూ. 9.65 కోట్ల రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. 3027 సమభావన సంఘాలకు రూ. 1.28 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం మహిళలకు అభయస్తం పథకం ద్వారా పింఛన్లు, స్కాలర్షిప్లు మంజూరు చేసిందన్నారు. ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాలలో ఆడపిల్లలు పుట్టిన వారు సమభావన సంఘాల ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో కొత్తగా 43 వేల పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. హుజూర్నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి అభినందనీయుడన్నారు. అనంతరం మహిళలకు సమభావన సంఘ చెక్కులను పంపిణీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే 2014 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ర్టం లోనే జరుగుతాయని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో సీడబ్యూసీ.. తెలంగాణ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం కచ్చితంగా అమలవుతుందన్నారు. దశాబ్దాలుగా ప్రక్కనే కృష్ణానది ఉన్నా సాగుకు నోచని బీడుభూముల మహర్దశ కోసం మహంకాళిగూడెం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 560 ఎకరాల బీడుభూములు సాగులోకి రావడంతోపాటు 220 మంది రైతులు లబ్ధిపొందుతారన్నారు. మండలంలోని శూన్యపహాడ్‌లో నాబార్డ్ పథకం కింద రూ. 8 కోట్లతో నూతనంగా ఎత్తిపోతల పథకం మంజూరైనట్లు వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామంలో 1000 ఎకరాలు సాగులోకి రావడంతో పాటు పూర్తిగా గిరిజన రైతులు లబ్ధిపొందుతారన్నారు. నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలుగా రూ. 300 కోట్ల రూపాయలతో కృష్ణానదిపై ఎత్తిపోతల పథకాలను నిర్మించి 35వేల ఎకరాలకు సాగులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టామన్నారు. హుజుర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. నేరేడుచర్ల మండలంలో రూ. 25 కోట్లతో కృష్ణానది మంచినీటి పథకం ద్వారా అన్ని గ్రామాలకు, ఆవాసప్రాంతాలకు తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చివారే నిజమైన నాయకులు : భట్టి విక్రమార్క ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినవారే నిజమైన నాయకులని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గతంలో పాలకులు పట్టించుకోకపోవడం వల్ల వెనుకబడిన ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. కోట్ల రూపాయల నిధులను తీసుకవచ్చి హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. మారుమూల ప్రాంతాలలో సాగుకు నోచుకోని భూములను ఎత్తిపోతల పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత ఉత్తమ్ దేనన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మహంకాళిగూడెం ఎత్తిపోతల చైర్మన్ పిడమర్తి రాజు, ఐడీసీ సభ్యుడు సాముల శివారెడ్డి, చైర్మన్ గంట మురళి,ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ ఎల్. అలివేలు తదితరులు పాల్గొన్నారు.