రావిపహాడ్ (నేరేడుచర్ల), న్యూస్‌లైన్ : మహిళలు ఆర్థిక స్వావలంబనసాధించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి సూ చించారు. శుక్రవారం మండలంలోని రావిపహాడ్‌లో రూ. 3.30 కోట్లతో నిర్మించిన మహంకాళిగూడెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. 382 సమభావన సంఘాల ద్వారా మహిళలకు రూ. 9.65 కోట్ల రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. 3027 సమభావన సంఘాలకు రూ. 1.28 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం మహిళలకు అభయస్తం పథకం ద్వారా పింఛన్లు, స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసిందన్నారు. ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాలలో ఆడపిల్లలు పుట్టిన వారు సమభావన సంఘాల ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో కొత్తగా 43 వేల పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి అభినందనీయుడన్నారు. అనంతరం మహిళలకు సమభావన సంఘ చెక్కులను పంపిణీ చేశారు.
2014 అసెంబ్లీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలోనే
2014 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ర్టం లోనే జరుగుతాయని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో సీడబ్యూసీ.. తెలంగాణ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం కచ్చితంగా అమలవుతుందన్నారు. దశాబ్దాలుగా ప్రక్కనే కృష్ణానది ఉన్నా సాగుకు నోచని బీడుభూముల మహర్దశ కోసం మహంకాళిగూడెం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 560 ఎకరాల బీడుభూములు సాగులోకి రావడంతోపాటు 220 మంది రైతులు లబ్ధిపొందుతారన్నారు. మండలంలోని శూన్యపహాడ్‌లో నాబార్డ్ పథకం కింద రూ. 8 కోట్లతో నూతనంగా ఎత్తిపోతల పథకం మంజూరైనట్లు వెల్లడించారు.
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామంలో 1000 ఎకరాలు సాగులోకి రావడంతో పాటు పూర్తిగా గిరిజన రైతులు లబ్ధిపొందుతారన్నారు. నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలుగా రూ. 300 కోట్ల రూపాయలతో కృష్ణానదిపై ఎత్తిపోతల పథకాలను నిర్మించి 35వేల ఎకరాలకు సాగులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టామన్నారు. హుజుర్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. నేరేడుచర్ల మండలంలో రూ. 25 కోట్లతో కృష్ణానది మంచినీటి పథకం ద్వారా అన్ని గ్రామాలకు, ఆవాసప్రాంతాలకు తాగునీరు అందించనున్నట్లు తెలిపారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చివారే నిజమైన నాయకులు : భట్టి విక్రమార్క
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినవారే నిజమైన నాయకులని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గతంలో పాలకులు పట్టించుకోకపోవడం వల్ల వెనుకబడిన ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. కోట్ల రూపాయల నిధులను తీసుకవచ్చి హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. మారుమూల ప్రాంతాలలో సాగుకు నోచుకోని భూములను ఎత్తిపోతల పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత ఉత్తమ్ దేనన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మహంకాళిగూడెం ఎత్తిపోతల చైర్మన్ పిడమర్తి రాజు, ఐడీసీ సభ్యుడు సాముల శివారెడ్డి, చైర్మన్ గంట మురళి,ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ ఎల్. అలివేలు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
Published Sat, Aug 31 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement