నాట్ గుడ్డు..
నాట్ గుడ్డు..
Published Mon, Aug 21 2017 10:49 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
సర్కారు చెలగాటం
విద్యార్థులకు కుళ్లిన గుడ్లు
నాసిరకం సరఫరా
తినలేక పారేస్తున్న విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
మధ్యాహ్న భోజన పథకంలో పాడైపోయిన, కుళ్లిన గుడ్లను విద్యార్థులకు పెట్టి వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటం అడుతోంది. ఏ రోజు ఏ గుడ్డువేయాలన్న స్టాంప్ వేసి మరీ గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఇవి నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఏలూరు గ్జేవియర్ నగర్‌లోని ఒక ఎయిడెడ్ స్కూల్‌లో వచ్చిన గుడ్లను చూసి విద్యార్థులు వాంతులు చేసుకునే పరిస్థితి తలెత్తింది. ఉడికిన గుడ్లు పూర్తిగా కుళ్లిపోవడమే కాకుండా కొన్నింటిలో కోడిపిల్లల అవశేషాలు కూడా ఉండటం గమనార్హం. దీనికి తోడు కొన్ని కోడిగుడ్లు కుళ్లిపోయి పురుగులు పట్టడంతో వాటిని పడేశారు. ఎప్పటికప్పుడు తాజా గుడ్లు సరఫరా చేయకుండా రెండు వారాలకు సరిపడా ఒకేసారి సరఫరా చేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో మొత్తం 3,236 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతోంది. రెండు లక్షల 52 వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపయోగించుకుంటున్నట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఒక్కొక్కరికి రోజుకు రూ. 6.47, హైస్కూల్ విద్యార్థికి రూ. 8.53 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ సొమ్ములోనే విద్యార్థులకు వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలని షరతు విధించింది. కోడిగుడ్డు ధర పెరిగిన నేపథ్యంలో మూడురోజులు కోడిగుడ్లు వేయడం సాధ్యం కాదనే ఆందోళన మధ్యాహ్న భోజన కార్మికుల నుంచి రావడంతో రూ. 2.35కే తాము కాంట్రాక్టు ఏజెన్సీ ద్వారా సరఫరా చేసేందుకు ప్రభ్వుత్వం ముందుకు వచ్చింది. ఈ నెల ఒకటి నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. మార్కెట్లో కోడిగుడ్డు ధర పెరగడంతో కాంట్రాక్టు ధారులు చిన్న చిన్న గుడ్లను సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు విద్యార్థులకు మూడు గుడ్లు వేసి ఆరు గుడ్లకు డబ్బులు వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. కోడిగుడ్లు ఒకేసారి సరఫరా అవుతుండటంతో నిల్వ ఉండి చెడిపోతున్నాయని, ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Advertisement
Advertisement