విద్యార్థులకు ఉప‘కారమే’..!
⇒ గతేడాది బకాయిలే పూర్తి స్థాయిలో చెల్లించని ప్రభుత్వం
⇒ తాజాగా మొదలైన 2016–17 దరఖాస్తుల పరిశీలన
⇒ ఉపకార వేతనాలు, రీయింబర్స్‌మెంట్ లబ్ధి ఇప్పట్లో కష్టమే
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నిరాశే మిగలనుంది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మరి కొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 2016–17 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు విద్యార్థులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ఇప్పుడిప్పుడే మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగ కేటగిరీలకు సంబంధించి 13,67,592 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి అర్హతను నిర్ధారిస్తేనే నిధుల విడుదలపై స్పష్టత రానుంది. అయితే దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉండడం, ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కనిష్టంగా రెండున్నర నెలల సమయం పడుతుండడం.. ఈలోపు విద్యాసంవత్సరం ముగియనుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
కీలక సమయంలో కష్టకాలం
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడ్డ విద్యార్థుల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఫీజు నిధుల ఊసెత్తకపోవడంతో యాజమాన్యాలు ఒత్తిడి చేస్తాయనే గుబులు గందరగోళానికి గురిచేస్తోంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కళాశాలల యాజమాన్యాలు.. 2015–16 ఏడాదికి ఫీజు బకాయిలు రూ.వెయ్యి కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉండడంతో ఇప్పటికే పలుమార్లు ఆందోళన చేపట్టాయి. తాజాగా విద్యార్థుల హాల్‌టిక్కెట్లు అట్టిపెట్టుకుంటూ వ్యక్తిగతంగా ఫీజు చెల్లించాలని, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులిచ్చిన తర్వాత తీసుకోవాలని షరతులు విధిస్తున్నాయి. గతేడాది కూడా పలు కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి.. నిధులు విడుదలైన తర్వాత తిరిగి చెల్లించాయనే ఫిర్యాదులున్నాయి. తాజాగా ఇదే పరిస్థితి నెలకొంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.