కూరాడ(కరప) :ఖరీఫ్‌కు సాగునీటి పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కూరాడ గ్రామంలో ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్త చేగొండి సత్యనారాయణ కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కూరాడకు చెందిన రైతులు ఆయనను కలుసుకున్నారు. కాలువలకు పది రోజుల్లో నీరు వదులుతారని, సంపర కాలువపై వంతెన, కల్వర్టు నిర్మాణాలు ఇప్పుడు చేస్తున్నారని వివరించారు.
పనుల వంకతో కాలువలకు నీరు ఆలస్యంగా వదులుతారని పేర్కొన్నారు. తొలకరి నాట్లు ఆలస్యమైతే తుపాన్లు, అధిక వర్షాలకు పంట నష్టపోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు విత్తనాలు కూడా అందుబాటులో ఉంచలేదని వివరించారు. దీనిపై కన్నబాబు స్పందిస్తూ.. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబుపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేయనున్నట్టు కన్నబాబు తెలిపారు. ఈ నెల 8న నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఆయన వెంట ఎంపీటీసీ సభ్యుడు చిన్నం చంద్రం, పార్టీ నాయకులు చిన్నం వెంకటేశ్వరరావు, రావుల సత్యారావు, రావుల చిన్ని, చేగొండి రామస్వామి, మాజీ సర్పంచ్‌లు బొమ్మిడి శ్రీనివాస్, కొమలి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ దృష్టికి రైతు సమస్యలు
Published Tue, Jun 7 2016 1:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement