గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ రద్దు
Published Mon, Mar 10 2014 2:21 AM | Last Updated on Wed, Sep 5 2018 8:33 PM
గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ రద్దు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటమే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం ఏడు కీలకాంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించతలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేసుకున్నారు. సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణ ఎన్నికల ఏర్పాట్లతో పాటు శాంతిభద్రతలు, గ్రామీణ తాగునీటి సరఫరా, వాతావరణ పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పాఠశాల విద్య, వైద్య, ఆరోగ్య రంగాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న విషయం, గవర్నర్‌కు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ స్పష్టం చేసిన విషయాలను ‘సాక్షి’ పాఠకులకు తెలిపిన విషయం తెలిసిందే.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కీలక అంశాలపై గవర్నర్ చేపట్టనున్న వీడియో కాన్ఫరెన్స్ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కోడ్ గవర్నర్‌కు కూడా వర్తిస్తుందని, ఈ విషయంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను సంప్రదించాలని భన్వర్‌లాల్ శనివారం స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా వంటి కీలక అంశాలపై గవర్నర్ అధికార యంత్రాంగంతో సమీక్షించడమంటే కచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.
ఎన్నికల ఏర్పాట్లను కేవలం సీఎస్, డీజీపీ, సీఈవో మాత్రమే అధికార యంత్రాంగంతో సమీక్షిస్తారని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మొత్తం అధికార యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లిపోతుందని, ఏదైనా ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా కమిషన్ అనుమతితో చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గవర్నర్ కార్యాలయానికి తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఒక్క అధికారిని కూడా పిలిచే అధికారం ముఖ్యమంత్రికి ఉండదని, ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతో సీఎం స్థానంలో గవర్నర్ పాలన వ్యవహారాలు చూస్తున్నారని, ఎన్నికల నియమావళి గవర్నర్‌కు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఏ అధికారిని పిలిచి సమీక్షలు నిర్వహించినా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ ఓ ఫైలును ఆదివారం గవర్నర్ కార్యాలయానికి పంపారు. గవర్నర్ కార్యాలయం ఆ ఫైలును పరిశీలించి, ఎన్నికల కోడ్‌ను గౌరవించాలని నిర్ణయించింది. దీంతో సోమవారం నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేసుకుంది.
Advertisement