సాక్షి, అమరావతి: జీతాల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు పడిగాపులు పడాల్సిన దుస్థితి వరుసగా రెండో నెల కూడా నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపుకోసం చేపట్టిన కొత్త పద్ధతి ‘సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్)’ కారణంగా వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో పోలీసులు గగ్గోలు పెడుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి జీతాలు చెల్లింపును సీఎఫ్‌ఎంఎస్ పద్ధతిలో చేపట్టడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా అమల్లోకి తీసుకొచ్చిన ఈ సీఎఫ్‌ఎంఎస్ దారుణంగా విఫలమైంది. దీంతో సకాలంలో వేతనాలందక రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులతోపాటు పోలీసులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏప్రిల్‌లోనూ ఇదే పరిస్థితి..
గత ఏప్రిల్ నెలలోనూ ఇదేరకమైన ఇబ్బంది నెలకొంది. గత నెల ఫస్ట్ తారీఖున పోలీసుల బ్యాంకు ఖాతాలకు జమ కావాల్సిన జీతాలు పదో తేదీ వరకు రాలేదు. దీంతో నెలవారీ ఖర్చులు, అద్దెలు, అప్పుల చెల్లింపులకు పోలీసులు పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు మే నెల ఒకటో తేదీన మరలా అదే పరిస్థితి. ఫస్ట్ తారీఖున పోలీసులందరికీ జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. గత నెలలో సాంకేతిక సమస్యలతో జీతాలు ఆలస్యమవగా.. వాటిని అధిగమించి ఈ నెలలోనైనా ఒకటో తేదీనే జీతాలు వస్తాయని పోలీసులు ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది.
మే నెల నాలుగో తేదీ వస్తున్నా జీతాలు జమ కాని పరిస్థితి. మూడో తేదీ నాటికి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే పోలీసులకు జీతాలు జమవగా, చాలా జిల్లాల్లో వేతనాలు పడలేదు. వైఎస్సార్, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో జీతాలు ఇంకా బ్యాంకు ఖాతాల్లో పడలేదు. ఈ మేరకు ఆయా జిల్లాల ఎస్పీలకు, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి సమాచారమందింది. దీనిపై పోలీసుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో.. వేతనాలను జమ చేయడంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడంపై అధికారులు దృష్టి పెట్టారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో శుక్రవారంలోపు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 6వ తేదీ రాత్రికి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 7వ తేదీ రాత్రి 12 గంటల్లోపు, రాయలసీమ జిల్లాల్లోని వారికి 8వ తేదీ నాటికి కచ్చితంగా జీతాలు జమ చేసేలా చర్యలు చేపట్టారు. అయితే వారి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనేది వేచిచూడాల్సిందే.
సమన్వయలోపమేనా?
రాష్ట్రంలో దాదాపు 80 వేల మంది అధికారులు, సిబ్బందిని కలిగివున్న పోలీసు శాఖలో వేతనాలు సకాలంలో అందకపోవడానికి సమన్వయలోపమే కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసు శాఖలో ప్రత్యేకంగా ఏడీజీ(స్వయం ప్రతిపత్తి) ఉన్న గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో అధికారులు, సిబ్బంది మే ఒకటవ తేదీనే జీతాలు తీసుకున్నారని అంటున్నారు. అదే పోలీసు శాఖలో మూడవ తేదీ దాటుతున్నా పలు జిల్లాల్లోని వారికి జీతాలు అందకపోవడానికి కారణమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి ప్రతి జిల్లా నుంచి సిబ్బంది వివరాలను సేకరించి పోలీసు శాఖలోని ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్(పీఅండ్‌ఎల్) విభాగం ఐజీ సీఎఫ్‌ఎంఎస్ ద్వారా డీజీపీకి పంపాల్సి ఉంటుంది. దీనిపై డీజీపీ ఆన్‌లైన్‌లో డిజిటల్ సంతకం చేసి సీఎఫ్‌ఎంఎస్ ద్వారా పంపాలి. ఆపై జిల్లాలవారీగా యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను ఇస్తారు. అయితే ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా నేరుగా ట్రెజరీకి జీతాల బిల్లులు పంపి అక్కడ సీఎఫ్‌ఎంఎస్ విధానంలోకి మార్చి.. ఆర్బీఐ అనుమతికి పంపి, అటు తరువాత బ్యాంకుల ద్వారా వ్యక్తిగత ఖాతాలకు జమ చేయాల్సి రావడంతో జాప్యం జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు.
ఖాకీలకు రెండో నెలా తప్పని నిరీక్షణ
Published Fri, May 4 2018 4:06 AM | Last Updated on Fri, May 4 2018 4:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment