సాక్షి, హైదరాబాద్ : పెన్షన్ అనేది ప్రతి ఉద్యోగి హక్కు అని, జీతం పెంచమని కోరడం లేదని, కొత్త పెన్షన్ విధానాన్ని మార్చాలనే కోరుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘పెన్షన్ విధానాన్ని మార్చాలని కోరితే పట్టించుకోరా?. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన?. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వేలమంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏంటి?. ప్రస్తుతం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదా?.
చంద్రబాబు విధానం మొదటి నుంచి కార్పొరేట్‌కు అనుకూలమే. మనసులో మాట పుస్తకంలోనూ అదే విషయం చెప్పారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభించారు. ఉద్యోగుల పోరాటానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడు ఉంటుంది. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరి పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ స్పందించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి.’ అని డిమాండ్ చేశారు.
కాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం బుధవారం ఉద్రిక్తతలకు దారితీసింది. అప్రమత్తమైన పోలీసులు ఉద్యోగులును ఎక్కడికక్కడ అరెస్టు చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులును అరెస్టు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైన అసెంబ్లీని ముట్టడించి తీరుతామని సీపీఎస్ ఉద్యోగులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment