రూ. కోటి సంగతి పట్టదేమీ..?
► రెండేళ్లుగా డీఎంహెచ్‌వో ఖాతాలో మూలుగుతున్న నిధులు
► పీహెచ్‌సీల్లో మందుల కొరతతో రోగుల ఇక్కట్లు
► అత్యవసర మందుల కొనుగోలుకు టెండర్లు కూడా పిలవని వైనం
► సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా దృష్టి సారించని వైనం
గుంటూరు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 83 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఏటా వీటిలో మందుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసినా, అవి చాలక అత్యవసర మందుల కొనుగోలుకు డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే పీహెచ్‌సీల్లో అత్యవసర మందుల కొనుగోలుకు గాను జిల్లా వైద్యారోగ్యశాఖకు 2015లో ప్రత్యేకంగా సుమారు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర మందులు కొనుగోలు చేసి పీహెచ్‌సీలకు పంపాల్సిన జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో నిధులు ఖాతాలోనే మురుగుతూ వచ్చాయి.
గత డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో టెండర్లు..
2015లో అప్పటి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి పద్మజారాణి టెండర్లు పిలిచినప్పటికీ వాటిని అప్పగించకుండానే వదిలేశారు. అప్పటి నుంచి నిధులు ఖాతాలో మూలుగుతున్నాయి. 2017 జనవరి 2న ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేయగా ఫుల్ అడిషనల్ చార్జి తీసుకొని రెడ్డి శ్యామల ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి పాలనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నడుస్తుండటంతో పాలన గాడితప్పింది. ఇన్‌చార్జి కావడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలూ లేకపోలేదు.
కొచ్చర్ల పీహెచ్‌సీ నిర్లక్ష్యం వెలుగు చూసినా..
ఈపూరు మండలం కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం ద్వారా వినుకొండకు మందులు పంపారు. తొమ్మిది నెలలుగా వాటిని వైద్యారోగ్యశాఖ అధికారులు తీసుకోకపోవడంపై ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ అప్పట్లో కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారిగా పనిచేసిన డాక్టర్ ప్రశాంతిని సస్పెండ్ చేశారు. డీఎంహెచ్‌వోకు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయమూ తెలిసిందే. ఇంత జరిగినా వైద్యారోగ్య శాఖ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. రాజధాని జిల్లాలో పదిరోజులుగా వర్షాలు కురుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలినా మార్పు మాత్రం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.