మస్తాన్ బాబు ఖర్చులు మేమే భరిస్తాం: వెంకయ్య
అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో మరణించిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం తరలింపునకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన మల్లి బాబు మాతృమూర్తికి సానుభూతి తెలిపారు.
ఈ విషయమై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో చర్చించానని, అర్జెంటీనాలోని భారత దౌత్యాకార్యాలయంతో ఆమె సంప్రదింపులు జరిపారని వెంకయ్య చెప్పారు. ప్రస్తుతం ఆండీస్ పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. 'మృతదేహం తరలిపునకు రెండు మార్గాలున్నాయి. ప్రతేక హెలికాప్టర్ను పంపడమా లేక సుశిక్షితులైన పర్వతారోహకుల ద్వారా మల్లిబాబు మృతదేహాన్ని కిందికి దించడమా అనే దానిపై సమాలోచన సాగుతోంది' అని వెంకయ్య నాయుడు అన్నారు.
ఐదు ఖండాల్లో పర్వతాలను అధిరోహించి గిన్నిస్ రికార్డులో స్థానం పొందిన మల్లిబాబు.. ఆండీస్ పర్వతశ్రేణుల్ని అధిరోహించేందుకు వెళ్లి గత మార్చి 24న అదృష్యమయ్యారు. రెండు రోజుల క్రితమే ఆయన మృతదేహాన్ని గుర్తించారు.