పోలీసులే హత్యలు చేయిస్తే.. | Govt Will Left Rowdy Sheeter Cases on TDP Cadre | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రౌడీ రాజ్యం

Published Sat, Nov 18 2017 9:51 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

Govt Will Left Rowdy Sheeter Cases on TDP Cadre - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటాయి. పట్టపగలే మహిళలపై అత్యాచారయత్నాలు జరుగుతున్నాయి. నడిబజార్లో బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై అధికారపక్షం నేతలే దాడులకు తెగబడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు కేవలం వీఐపీలకు బందోబస్తు కల్పించడానికి, ప్రజాందోళనలను అణచివేయడానికే పరిమితమయ్యారు.  బిహార్‌ను తలపించేలా రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు ప్రజలను బేజారెత్తిస్తున్నాయి. ప్రధానంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు, విజయవాడలతోపాటు ఉత్తరాంధ్రలోని విశాఖ, రాయలసీమ ప్రాంత జిల్లాల్లో పెచ్చుమీరిన హత్యలు రౌడీరాజ్యంగా మారుస్తున్నాయి. టీడీపీ పెద్దల అండదండలే దన్నుగా రౌడీమూకలు విశృంఖలత్వానికి దిగుతున్నాయి. దశాబ్దం కిందట సద్దుమణిగిన రౌడీయిజానికి పాలకులే పాలుపోసి పెంచుతున్నారన్న విమర్శలున్నాయి. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లే పంథాగా.. భూ సెటిల్‌మెంట్లే దందాగా.. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా రౌడీలు రెచ్చిపోతున్నారు.    

గ్యాంగ్‌వార్‌
రాష్ట్రంలో గ్యాంగ్‌వార్‌ వెర్రితలలేస్తోంది. గుంటూరు నగరంలో మాజీ రౌడీషీటర్‌ బసవల వాసు (38) ఇటీవల దారుణ హత్యకు గురైన తీరు సంచలనం సృష్టించింది. పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే అన్వర్‌ రెస్టారెంట్‌లో భోజనం చేసి బయటకు వచ్చిన వాసును స్కార్పియోలో వచ్చిన ప్రత్యర్థి రౌడీషీటర్లు రెప్పపాటులోనే విచక్షణారహితంగా నరికేశారు. వాసు సోదరుడు వీరయ్య 2004లో హత్యకు గురయ్యాడు. సోదరుడిని చంపిన వారిని 2005లో హత్యచేసిన కేసులో వాసు నిందితుడిగా ఉన్నాడు. ఒక సెటిల్‌మెంట్‌లో వ్యక్తి మృతికి కారణమైన కేసులో ఇటీవల బెయిల్‌పై వాసు బయటకు వచ్చాడు. ఇతనిపై నగర బహిష్కరణ కూడా ఉందని చెబుతున్నారు. గుంటూరులో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్యపోరు ఏడాది కాలంలో 8 మంది  హత్యకు కారణమైంది.  

• విజయవాడ సింగ్‌నగర్‌లో ఒక బార్‌ వద్ద ఈ ఏడాది జూలై 27న సింగ్‌నగర్‌లో రౌడీషీటర్‌ కట్లా వేణుగోపాలరావు అలియాస్‌ ఖల్నాయక్‌... గంధసిరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని కత్తులతో పొడిచి హతమార్చాడు. రౌడీషీటర్‌ ఖల్నాయక్‌పై 20 ఏళ్లలో 16 కేసులు ఉండటంతో పోలీసులు నగర బహిష్కరణ విధించినప్పటికీ అతను నిర్భయంగా వచ్చి దారుణ హత్య చేయడం గమనార్హం.  

• గతేడాది డిసెంబర్‌ 31న నంద్యాల మెయిన్‌ సెంటర్‌ నడిరోడ్డుపై పట్టపగలే రౌడీషీటర్‌ రాఘవేంద్ర(రఘు)ను మరో రౌడీషీటర్‌ గుమ్మపాలెం బద్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.  

బిహార్‌ నుంచి తుపాకీ కొనుగోళ్లలో విజయవాడ రౌడీషీటర్‌.. 
తాజాగా హైదరాబాద్‌ పోలీసులు ఛేదించిన అక్రమ ఆయుధాల కొనుగోలు కేసులో విజయవాడ రౌడీషీటర్‌ సుబ్బు ప్రమేయం బయటపడింది. ఈ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన పొట్లూరి ఈశ్వర్, తెల్లగోర్ల సునీల్‌కుమార్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఈ నెల 25న అరెస్టు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న వీరిద్దరూ సుబ్బుకు విక్రయించేందుకు బిహార్‌ నుంచి అక్రమంగా తుపాకులు తెప్పించారు. సుబ్బు పేరుమోసిన రౌడీషీటర్‌ కావడంతో గతంలో తెనాలిలో దాడులు, ప్రతిదాడుల్లో అతని పాత్ర ఉండేది. తెనాలి పోలీసులు సుబ్బుపై జిల్లా బహిష్కరణ విధించగా, అతను విజయవాడకు మకాం మార్చాడు. అప్పట్లో వంగవీటి శంతన్‌కుమార్‌పై కాల్పుల జరిపింది సుబ్బు అని పోలీసులు చెబుతున్నారు. అప్పటినుంచి టీడీపీ నేతలకు సన్నిహితుడిగా ఉంటున్నాడు. 

పోలీసులే హత్యలు చేయిస్తే.. 
శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే ఏకంగా హత్యలకు పక్కాప్లాన్‌ వేసి ఆధారాలతో దొరికిపోవడంతో ప్రజలు విస్తుపోతున్నారు. విశాఖ డీఎస్పీ రవిబాబు ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో హత్య చేయించి దొరికిపోవడంతో పోలీస్‌ శాఖను జనంలో పలుచన చేసింది. అక్టోబర్‌ 6న రౌడీషీటర్‌ గేదెల రాజును మరికొందరు రౌడీషీటర్లు దారుణంగా హత్య చేసి గోనె సంచిలో కట్టి తీసుకుపోయి పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ఘటనతో విశాఖ నగరంలో జూలు విదిల్చిన రౌడీయిజం మరోసారి చర్చకు దారితీసింది.   

♦  ఏప్రిల్‌7న మద్దిలపాలెం సింగర్‌ బార్‌ వద్ద రౌడీ షీటర్‌ వెంకట రమణను మరో రౌడీషీటర్‌ హతమార్చాడు. 

♦  జూలై 1న రాత్రి గాజువాక మార్కెట్‌ రోడ్డులో 7మెట్ల మర్రిపాలెంకు చెందిన గండేపల్లి ముత్యాలు అలియాస్‌ శ్రీనును మాంసం కొట్టు నిర్వాహకుడు హత్య చేశాడు. 

♦  ఆగస్టు 19వ తేదీ రాత్రి ఆరిలోవ పాండురంగాపురం వద్ద రౌడీషీటర్‌ సాది వినయ్‌ సంపత్‌ను అతని ప్రత్యర్థులు పాత కక్షలతో దారుణంగా హతమార్చారు. 

♦ అక్టోబర్‌ 1న రాత్రి కేఆర్‌ఎం కాలనీలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో కైలాసపురానికి చెందిన సంతోష్‌ ఆధిపత్యాన్ని తట్టుకోలేని నట్టి శేఖర్, బిల్డర్‌ శ్రీను, బందా రెడ్డి అలియాస్‌ బండోడు, అశోక్‌రెడ్డి, కనకలు అతడిని దారుణంగా  హతమార్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement