♦ నెల రోజులతో పోలిస్తే రూ. 200 తగ్గుదల
♦ బీపీటీ రూ.1150 లేదా రూ. 1175 మధ్య కొనుగోలు
♦ సాధారణ రకం రూ. 1050 లేదా రూ. 1100 మాత్రమే..
♦ వచ్చిందే దక్కుదలగా అమ్ముకుంటున్న రైతులు
పిట్టలవానిపాలెం : మిల్లర్లు, దళారులు, వ్యాపారుల మాయాజాలంతో ధాన్యం ధర పడిపోతోంది. నెల రోజుల కిందటి ధరతో పోలిస్తే బస్తాకు రూ.200 త గ్గింది. దిగుబడులు వచ్చే సమయంలో ధరలు తగ్గడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమ్మబోతే ధరలేక, నిల్వ చేస్తే అప్పుల భయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో 67 వేల ఎకరాలలో వరి సాగు చేశారు. బీపీటీ 5204, 1061, 2716 రకాలు సాగు చేశారు. నియోజకవర్గంలో ఇంకా 40 శాతం రైతులు ధాన్యాన్ని పురి, బస్తాల్లో నెట్లు వేసుకుని నిల్వ చేసుకుంటున్నారు.
నెల రోజుల క్రితం వరకు బస్తా రూ.1300-రూ.1350 మధ్య వ్యాపారులు, దళారులు కొన్నారు. ప్రస్తుతం రూ.1150 లేదా రూ.1175కు మాత్రమే బీపీటీ రకాన్ని కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకం ధాన్యం గత ఏడాది రూ.1150 -రూ.1200 మధ్య కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.1100 నుంచి రూ. 1050 మధ్య కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం ధర పడిపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయనే భయంతో రైతులు రూ.200 నష్టానికి అమ్ముకుంటున్నారు.
దళారులు, వ్యాపారుల ఎత్తుగడ వల్లే ధరలు పతనం..
ధాన్యం ధరలు పడిపోవడానికి దళారులు, వ్యాపారులే ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మినుము తీత పనులు పూర్తి కావడంతో వరినూర్పిడి పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే మిల్లర్లు, వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఒకేసారి ధాన్యం రావడంతో మిల్లర్లు, వ్యాపారులు కలిసి ధాన్యం ధర తగ్గించేశారు. సాగు కోసం అప్పులు చేసిన అధిక శాతం మంది రైతులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే పరిస్థితి లేక పోవడంతో తెగనమ్ముకుంటున్నారు.
కౌలు రైతుల పరిస్థితి దయనీయం...
కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ధాన్యం ధర పడిపోవడంతో నూర్పిళ్లు చేసిన కౌలు రైతులు తప్పని సరి పరిస్థితుల్లో ధాన్యాన్ని అమ్మాల్సిన దుస్థితి నెలకొంది. ధర లేదని నిల్వ చేద్దామనుకుంటే భూ యజమానికి తప్పని సరిగా కౌలు చెల్లించాలి. కౌలు రైతుల్లో 80 శాతం మంది అప్పులు తెచ్చి సాగు చేసినవారే. ఈపరిణామాలు కౌలు రైతులను కలచివేస్తున్నాయి.
ధాన్యం ధర పతనం
Published Wed, Apr 22 2015 3:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement