63వ నంబరు జాతీయ రహదారి దిగ్బంధం | Farmers Protest In Armoor | Sakshi
Sakshi News home page

63వ నంబరు జాతీయ రహదారి దిగ్బంధం

Published Tue, Feb 26 2019 10:46 AM | Last Updated on Tue, Feb 26 2019 10:46 AM

Farmers Protest In Armoor - Sakshi

ధర్నా నిర్వహిస్తున్న రైతులు

ఆర్మూర్‌ రైతులు మరోమారు ఆందోళనబాట పట్టారు. ఎర్రజొన్న, పసుపు పంటలను గిట్టుబాటు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 63వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కార్లు, ట్రాక్టర్లు, మోటార్‌ సైకిళ్లపై తరలి వచ్చారు. ఎనిమిది గంటల పాటు రహదారి పైనే  బైఠాయించారు. పలు మార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నేడు మామిడిపల్లి నుంచి అసెంబ్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. 

ఆర్మూర్‌ / పెర్కిట్‌: ఎర్రజొన్నలు, పసుపు పంటను గిట్టుబాటు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్మూర్‌ ప్రాంత రైతులు మరోమారు 63వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. సోమవారం ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరస్తాలో జాతీయ రహదారిపై బైఠాయించారు. వంటవార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేసారు. మరో వైపు రైతుల ఆందోళన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న రైతు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఇతర మండలాల పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ రైతులంతా ఏకమై రహదారి దిగ్బంధాన్ని శాంతియుతంగా కొనసాగించారు.

సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు  ఉదయం నుంచే ఆర్మూర్‌ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్, జాతీయ రహదారి కూడళ్లలో మోహరించాయి. ఉదయం 11 గంటల నుంచి రైతులు పెద్ద ఎత్తున మామిడిపల్లి చౌరస్తాలోని జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా డివిజన్‌ పరిధిలోని 13 మండలాల్లోని గ్రామాల రైతులు కార్లు, ట్రాక్టర్లు, మోటార్‌ సైకిళ్లపై తరలి వచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి పైగా జాతీయ రహదారి చౌరస్తాలో బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్నను క్వింటాలుకు రూ. 3,500లకు, పసుపునకు క్వింటాలుకు రూ. 15 వేలు చెల్లించి   ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేసారు.

తమ డిమాండ్లు సాధించుకునే వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. రాత్రి 7 గంటల వరకు రైతులు జాతీయ రహదారి పైనే  బైఠాయించారు. మధ్యాహ్నం సమయంలో గ్రామాల వారీగా రైతులు వంట పాత్రలను తెచ్చుకొని పొయ్యి వెలిగించి రహదారిపైనే వంటవార్పు నిర్వహించారు. అనంతరం అక్కడే సహపంక్తి భోజనాలు చేసారు. పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చేశారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ ధర్నా, రాస్తారోకోలో రైతుల డిమాండ్లను తెలియజేస్తూ రైతు నాయకులు ఉపన్యసించారు.

ఈ నెల 7, 12, 16 తేదీల్లో జాతీయ రహదారిపై  బైఠాయించి ధర్నా నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 18న జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుకు ప్రజావాణిలో విన్నవించినా, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు అందజేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు రహదారుల దిగ్భందాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.

నేడు అసెంబ్లీకి పాదయాత్ర.

పలు మార్లు జాతీయ రహదారులను దిగ్బంధించినా, ధర్నాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో రైతు నాయకులు చౌరస్తాలోనే సమావేశమై చర్చించారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మంగళవారం మామిడిపల్లి నుంచి హైదరాబాద్‌లోని అసెంబ్లీకి పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. రైతు నాయకులు, రైతులు సైతం అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అసెంబ్లీకి పాదయాత్ర చేయాలని నిర్ణయించిన అనంతరం రా>త్రి ఏడు గంటల సమయంలో మామిడిపల్లి చౌరస్తాలో దీక్షను విరమించారు.

పోలీసుల భారీ బందోబస్తు.. 

2008లో పోలీ స్‌ శాఖ వైఫల్యం కారణంగా ఎర్ర జొన్న రైతుల ఉద్యమం హింసాత్మకంగా మారి న పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందు కు సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో బం దోబస్తు నిర్వహించారు. అడిషనల్‌ డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ట్రెయినీ ఐపీఎస్‌ అధికారి గౌస్‌ ఆలం, ఆ ర్మూర్‌ ఏసీపీ రాములు, బో ధన్, నిజామాబాద్, ఐఎన్‌బీ, ట్రాఫిక్‌ ఏసీపీలు, 14 మంది సీఐలు తమ పోలీసు బలగాలతో  బందోబస్తు నిర్వహించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఎదుర్కోవడానికి పోలీసులు రహదారికి ఇరువైపులా మోహరించారు.

ఆర్మూర్‌ ఏసీపీ రాములు రైతులతో మాట్లాడుతూ ప్రజలను ఇబ్బం ది పెట్టే ఇలాంటి కార్యక్రమాలను చేయవద్దని విజ్ఞప్తి చేసారు. అయినప్పటికీ రైతులు అంగీకరిం చకుండా రాత్రి వరకు రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఉన్నతాధికారుల సూచన మేరకు సంయమనం పాటించారు. దీక్ష చేస్తున్న రైతులు సహనం కోల్పోయిన ప్రతిసారి పోలీసులు వారిని బుజ్జగిస్తూ శాంతియుతంగా దీక్ష చేయడానికి సహకరించారు. పోలీసులు లాఠీలను, ఆయుధాలను గాని తీసుకుని రాకుండా ఫ్రెండ్లీ పోలీస్‌లా వ్యవహరించడంపై  ప్రశంసలను అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement