
షబ్బీర్ అలీ
సాక్షి, కామారెడ్డి: సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలేనని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. జిల్లాలోని మాచారెడ్డి చౌరస్తాలో ప్రభుత్వ తీరుపై గురువారం రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సన్నరకం వేయకపోతే కొనుగోలు చేయమని, రైతు బంధు ఇవ్వమని సీఎం చెప్పారన్నారు. సీఎం మాటకు భయపడి రైతులు దొడ్డురకం కాదని సన్నరకం వేసి 90 శాతం పంటను రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. నష్టపోయిన వారికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని, సన్నరకం వరిని రూ. 2500 మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో ఉన్న చోటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. అదే విధంగా పత్తి పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 80 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తను వేసిన పంటపై సీఎం అబద్దం చేప్తే సవాలు విసిరి వారం అవుతున్నా ఇంతవరకు స్పందించలేదని చెప్పారు. ఒకవేళ తను తప్పు చేస్తే ఉరి తీయాలని లేకపోతే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని షబ్బీర్ అలీ సవాలు విసిరిరారు. కాగా, సీఎం కేసీఆర్ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.