ఇక ఇంటింటి సర్వే | Grama Volunteers Doing Home Survey In AP | Sakshi
Sakshi News home page

ఇక ఇంటింటి సర్వే

Published Mon, Aug 19 2019 7:46 AM | Last Updated on Mon, Aug 19 2019 7:46 AM

Grama Volunteers Doing Home Survey In AP - Sakshi

సాక్షి, ఒంగోలు: వలంటీర్లు విధుల్లోకి వచ్చేశారు. గుర్తింపు కార్డుతో ఇంటి ముంగిటకు వస్తున్నారు. కుటుంబ పరిచయాల్లో ఉన్నారు. ఇదంతా 22వ తేదీలోగా పూర్తి కావాలి. ఇక 23వ తేదీ నుంచి కుటుంబ సర్వేకి ఉపక్రమించనున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమం వలంటీర్ల ద్వారానే కుటుంబాలకు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ఏ ఒక్కరు ప్రభుత్వ సాయం అందుకోకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే పద్ధతికి చెల్లు చీటీ ఇవ్వడానికే ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. వలంటీర్లు విధి విధానాలు ప్రారంభమయ్యాయి.

జిల్లాలో 1038 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 14,628 వలంటీర్లు విధుల్లో ఉన్నారు. స్వాతంత్య్రదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఒంగోలు నగరపాలక సంస్థ, చీరాల,కందుకూరు, మార్కాపురం మున్సిపాలిటీలు, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీల పరిధిలోని వార్డులకు వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతి యాభై కుటుంబాల సంక్షేమ బాధ్యత, ప్రభుత్వ పథకాల పంపిణీ వీరి సహకారంతోనే ఉంటుంది. వీరి పని తీరును ఎంపీడీవోలు, కమిషనర్లు పర్యవేక్షించేలా వ్యవస్థ ఏర్పాటైంది. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు వీరి పనితీరును పర్యవేక్షిస్తారు.

23 నుంచి సర్వే..
వలంటీర్ల ద్వారా కుటుంబ వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే ప్రజాసాధికార సర్వే జరిగింది. ప్రభుత్వం వద్ద ఈ సర్వే ద్వారా కుటుంబ వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం నవరత్నాల అమలు ప్రక్రియను వేగవంతం చేయడానికి వలంటీర్ల వ్యవస్థనే కీలకం చేయనుంది. ఇందులో భాగంగానే వారి ద్వారానే కుటుంబ వివరాలను సేకరించేందుకు సర్వే షెడ్యూలును ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు వలంటీర్లు వారి పరిధిలోని కుటుంబాలను పరిచయం చేసుకుంటారు. 23 నుంచి కుటుంబ సర్వేలో పాల్గొంటారు. ఈ సర్వే నివేదికను 30వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ నెల 26వ తేదీ నుంచి ఇళ్ల స్ధలాలు లేని వారి వివరాలను సేకరించే కార్యక్రమం జరగనుంది. ఇళ్ల స్థలాలు లేని వారి వివరాలను సేకరించి ప్రత్యేకంగా నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలి.

ఎలాంటి సమాచారం సేకరిస్తారంటే...
వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం సూచించిన విధంగా సర్వే చేస్తారు. ఈ సర్వేలో ఏం అడగాలో వివరాలకు సంబంధించి ఫార్మేట్లను అందజేశారు. సర్వే ఫార్మేట్లు వలంటీర్లకు అందజేశారు. ప్రతి యాభై కుటుంబాల వివరాలను సర్వే ఫాంలో నింపి షెడ్యూలు తేదీల ప్రకారం ఎంపీడీవోలకు అందజేయాలి. ఎంపీడీవోల ద్వారా జిల్లా కేంద్రానికి సమగ్రీకరించిన సర్వే నివేదికను నెలాఖరులోగా చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 
యజమాని వివరాలు, ఆ కుటుంబంలోని సభ్యుల వివరాలను సేకరిస్తారు. కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారాన్ని అందించాలి.
గృహనిర్మాణం కింద స్వంత ఇల్లు ఉందా. ఉంటే ఎవరి పేరున ఇల్లు ఉంది. ఇంటికి తాగునీటి వసతి. మరుగుదొడ్డి ఉంటే వివరాలు. విద్యుత్‌ కనెక్షన్‌ నెలవారీ బిల్లు వివరాలు. వంట విధానంలో కట్టెలపొయ్యితోనా..గ్యాస్‌తోనా వివరాలు సేకరిస్తారు. 
ఇంటి పరిసరాలు పరిశుభ్రత గురించి ఫార్మెట్‌లో వివరాలను పొందుపరచాలి. పరిశుభ్రత గురించి తగిన సమాచారాన్ని వలంటీర్లు సేకరించాలి.
వ్యవసాయ కుటుంబం అయితే వివరాలు. భూమి ఎంత. బ్యాంకు రుణం. కౌలు రైతు అయితే వివరాలు. వ్యవసాయ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు. రైతు తీసుకున్న అప్పుల వివరాలను ఇందులో పొందుపరచాలి. 
► పశుపోషణ వివరాలను సేకరిస్తారు. ఏ తరహా పశువులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నమోదు చేస్తారు. వీటి ద్వారా ఆదాయం పొందుతుంటే వాటి వివరాలు. పశుపోషణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వివరాలను నమోదు చేస్తారు.
ఆరోగ్యం అంశంలో పిల్లల ఆరోగ్యం వివరాలను నమోదు చేస్తారు. వారికి అందుతున్న పౌష్టికాహారాన్ని ఏ విధంగా పొందుతున్నారో సేకరిస్తారు. 
విద్యకు సంబంధించి 6–15 ఏళ్ల వయస్సు ఉన్న వారు అభ్యసిస్తున్న విద్య వివరాలు. ఆ పై వయస్సు ఉన్న వారు చదువుతుంటే ఎక్కడ.. ఎలా చదువుతున్నారో వివరాలను నమోదు చేస్తారు. ప్రభుత్వ లబ్ధి పొందుతుంటే వాటి వివరాలను నమోదు చేయాలి.
స్వయం సహాయ బృందాల మహిళలు కుటుంబంలో ఉంటే వారి వివరాలు, తీసుకున్న రుణం, ఇతర వివరాలను నమోదు చేస్తారు. పొదుపు సంఘాల సభ్యుల పని తీరును ఈ సర్వేలో నమోదు చేస్తారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కింద లబ్ధి పొందుతుంటే పింఛన్, రేషన్, ఇతర పథకాల ద్వారా లబ్ధి వివరాలను సర్వేలో నమోదు చేస్తారు. కుటుంబ సంక్షేమంలో ఇతరత్రా ఎలాంటి సమస్య గుర్తించినా వాటిని ప్రత్యేకంగా సర్వేలో నమోదు చేస్తారు.
ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాలను ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్ల పరిధిలో మండలాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ, దేవదాయ ధర్మాదాయ భూముల వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఎకరాకు గ్రామాల్లో అయితే 40 మంది, పట్టణాల్లో 80 నుంచి వంద మందిని ప్రతిపాదిస్తూ వివరాలను పంపారు. ఇంటి నివేశన స్థలాలకు అర్హుల వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు.

సర్వేకి అంతా సిద్ధం
గ్రామంలోని వలంటీరు స్థాయిలో సర్వే చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఫార్మేట్‌ పత్రాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని మండలాలకు ఫార్మెట్‌ పత్రాలు చేరాయి. అక్కడి నుంచి వలంటీర్లకు ఈ ఫార్మేట్లను చేరుస్తున్నారు. వలంటీర్లే ఇంటింటి తిరిగి ఫార్మెట్‌లోని వివరాల ప్రకారం సమాచారాన్ని సేకరించి నివేదిక తయారు చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement