Home Survey
-
ఇంటింటి సర్వే చేపట్టండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరిస్తున్న 10 రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో ఉన్న 45 స్థానిక సంస్థల అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ పలు ఆదేశాలు జారీచేసింది. తమ పరిధిలోని పట్టణాలు, నగరాల్లో ఇంటింటి సర్వే నిర్వహించడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన అందరికీ పరీక్షలు నిర్వహించి, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని ఆదేశించింది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్తాన్, హరియాణా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్నాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని ఆ 45 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలవారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించడంపై, కంటెయిన్మెంట్ వ్యూహాలపై కూడా ఆ సమావేశంలో చర్చించారు. కరోనా మరణాల రేటును తగ్గించేందుకు వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేషెంట్లలో లక్షణాలు ఉధృతమై, పరిస్థితి చేయి దాటకముందే చికిత్స అందేలా చూడాలన్నారు. ఆసుపత్రులు, వైద్యుల నిర్వహణ కోసం సమర్థ విధానాలను అమలు చేయాలని, ఆసుపత్రులకు వచ్చే అనుమానిత పేషెంట్ల కోసం ప్రత్యేకంగా అధికారులను ఆసుపత్రుల్లో నియమించాలని సూచించారు. స్థానిక సంస్థలు అన్ని ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసుకుని వైరస్‌ను కట్టడి చేసేందుకు కృషి చేయాలనీ, అంబులెన్స్‌లను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఒక్కరోజులోనే 9,983 కేసులు 24 గంటల్లో 271 మంది మృతి ఇప్పటిదాకా 2,56,611 కేసులు.. 7,200 మరణాలు ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కేసులు రెండున్నర లక్షలు, మరణాలు ఏడు వేల మార్కును దాటేశాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లోనే 9,983 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి. తాజాగా 271 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 2,56,611కు, మరణాలు 7,200కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 1,24,981 కాగా, 1,24,429 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 48.49 శాతంగా నమోదైంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటివరకు 47,74,434 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. గత 24 గంటల్లో 1,08,048 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తర్వాత స్థానం ఇండియాదే. -
కరోనా వైరస్: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రాణాంతకమైన కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నామని విజయవాడ మున్సిపల్ శాఖ కమీషనర్ విజయ్ కుమార్ అన్నారు. ఆయన మీడియతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 96 శాతం ఇళ్లను సర్వే చేశామని వెల్లడించారు. 1.43 కోట్ల ఇళ్లు ఉంటే ఇప్పటికే 1.37 కోట్ల ఇళ్లల్లో సర్వే పూర్తైందన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంలు ఉన్నారని.. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి సర్వే చేశామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు. 2.80 లక్షల మంది వాలంటీర్లు, 1.18 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి 2 వేల మందికి ఎక్కడా లేని విధంగా ఏఎన్ఎన్‌లు ఉన్నారని ఆయన తెలిపారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 6,379 మంది వచ్చినట్టు కేంద్రం జాబితా విడుదల చేసిందని ఆయన అన్నారు. కానీ వాలంటీర్లు, ఆశ వర్కర్ల సర్వేలో మరో ఆరు వేల మంది విదేశాల నుంచి వచ్చినట్టు తేలిందని విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కి అన్ని పట్టణాల్లో, నగరాల్లో ప్రజలను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి ముందుగానే అన్ని చర్యలు చేపడుతున్నామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్)ను జయించాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. ఒక్క క్షణం ఆలోచించాలి అన్నారు. యువతీ యువకులైనా, వ్యాధి నిరోధక శక్తి ఉన్నా, ఎవరైనా సరే ఇంట్లోనే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ఉండకూడదని ఆయన తెలిపారు. ఎవరి నుంచైనా కోవిడ్-19 సంక్రమించవచ్చని జవహర్‌రెడ్డి సూచించారు. -
వైఎస్సార్ నవశకానికి ‘స్పందన’తో నాంది
సాక్షి, అమరావతి : ప్రజల సమస్యలు సత్వరమే తీర్చాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ప్రారంభించిన ‘స్పందన’ కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతుల నేపథ్యంలో ‘వైఎస్సార్ నవశకం’ ఆవిర్భవించింది. రాష్ట వ్యాప్తంగా స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అత్యధికంగా రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల కోసం ఎక్కువగా వినతులు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అర్హత కలిగి ఉండి కూడా పింఛన్, ఇల్లు, రేషన్ కార్డు లేని వారు ఎంత మంది ఉన్నారో సర్వే చేయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వైఎస్సార్ నవశకం పేరుతో రాష్ట్రమంతటా ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడాది జూన్ 24న కలెక్టర్లు, ఎస్పీలతో తొలి కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే వినతులకు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రతి సోమవారం కొనసాగుతోంది. సోమవారం వచ్చిన వినతుల్లో చాలా వరకు శనివారంలోగా తప్పనిసరిగా పరిష్కరించాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పని చేస్తోంది. ఈ కార్యక్రమంపై క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి కూడా ప్రతి మంగళవారం సమీక్షిస్తూ అధికార యంత్రాంగంలో సీరియస్‌నెస్ తీసుకొచ్చారు. యథాలాపంగా కాకుండా ప్రతి సమస్యకూ నిర్మాణాత్మక పరిష్కారం దిశగా స్పందన కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారు. తక్షణ స్పందన కోసం కలెక్టర్లకు నిధులనూ కేటాయించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయి అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచాలని ఆదేశించారు. ప్రజలు రోజుల తరబడి సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండరాదని, ఏ సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో వినతులు ఇచ్చే ప్రజలకు రశీదు ఇప్పించారు. ఆ సమస్య పరిష్కారం కాగానే తెలియజేసే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఏదైనా వినతి పరిష్కారానికి నోచుకోకపోతే అందుకు గల సహేతుక కారణాలతో వివరణ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉంటే.. దాని పరిష్కారానికి నిర్ణీత సమయం చెప్పాలనే జవాబు దారీ తనాన్ని అధికార యంత్రాంగానికి అలవాటుగా మారుస్తున్నారు. ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, కమ్యూనిటీ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, వ్యక్తిగత సమస్యలు తదితర అంశాలపై స్పందనలో ఇప్పటి దాకా లక్షల కొద్దీ వినతులు వచ్చాయి. వీటి పరిష్కారంలో నాణ్యత పెంచడానికి సీఎం ఆదేశాల మేరకు అధికారులకు పెద్ద ఎత్తున వర్క్‌షాపులు నిర్వహించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. చిరునవ్వుతో స్వాగతించాలి స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలని, ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మనసా, వాచా, కర్మణా పనిచేసినప్పుడే బాధితులకు న్యాయం చేయగలుగుతామని ప్రతి సమీక్షలో ఆయన అధికారులకు స్పష్టం చేస్తున్నారు. మనకేదైనా సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం కోరుకుంటామో అలాంటి పరిష్కారమే మన దగ్గరకొచ్చేవారికి లభించేలా చర్యలుండాలని సూచిస్తూ వస్తున్నారు. దీంతో అధికారులు కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. -
నల్లా లెక్కల్లో!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక నష్టాల్లో ఉన్న వాటర్‌బోర్డును గట్టెక్కించేందుకు జలమండలి ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. గృహ వినియోగ(డొమెస్టిక్), వాణిజ్య అవసరాల (కమర్షియల్) నల్లా కనెక్షన్ల లెక్క తేల్చనుంది. డొమెస్టిక్ కనెక్షన్లు కలిగి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ ప్రతినెల రూ.వేలల్లో బిల్లులు ఎగవేస్తున్న భవనాల గుర్తింపే లక్ష్యంగా శనివారం నుంచి ఈ సర్వే సాగనుంది. ఇందుకోసం 150 మంది సిబ్బందితో 50 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నట్లు జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. నగర పరిధిలో మొత్తం 10.6 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా... వీటిలో కమర్షియల్ కనెక్షన్లు 30వేలకు మించి లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డు చరిత్రలోనే తొలిసారి ఇంటింటి సర్వే చేయనున్నారు. సిబ్బందికి శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్–1 డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు. సర్వే ఇలా... జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్ సాయంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తాయి. నల్లా కనెక్షన్ నంబర్, నీటి మీటర్ సమాచారం, ఇంటి వైశాల్యం, ఎన్ని గదులు, ఎన్ని అంతస్తులు, కనెక్షన్ కేటగిరీ తదితర వివరాలను సిబ్బంది సేకరిస్తారు. సదరు భవనానికి బోర్డు నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత కేటగిరీలో కనెక్షన్ ఉందా? లేదా? అనేది పరిశీలిస్తారు. ఒకవేళ డొమెస్టిక్ కనెక్షన్ ఉండి, ఆ భవనంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే దాన్ని కమర్షియల్ కేటగిరీలోకి మారుస్తారు. ఈ సర్వేను తొలుత నారాయణగూడ, ఎస్ఆర్నగర్, మారేడుపల్లి, కూకట్పల్లి, అంబర్పేట్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ డివిజన్ల పరిధిలో చేపడతారు. ఆదాయానికి మించి ఖర్చు... జలమండలి రెవెన్యూ ఆదాయం నెలకు రూ.120 కోట్లు కాగా.. ఖర్చు రూ.150 కోట్లకు చేరిందని ఎండీ దానకిశోర్ తెలిపారు. ప్రతినెల రూ.30 కోట్ల లోటు బడ్జెట్‌తో బోర్డు నెట్టుకొస్తోందని చెప్పారు. రెవెన్యూ ఆదాయం పెంచుకొని ఈ లోటును పూడ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సర్వేలో అక్రమ నల్లా కనెక్షన్ల గుర్తింపు, వాటిని క్రమబద్ధీకరించడం, నాన్ డొమెస్టిక్ కనెక్షన్ అయితే మీటర్ బిగింపు, నీటి వృథాను అరికట్టే విషయంలో వినియోగదారులకు అవగాహన కల్పించడం తదితర అంశాలు ఉంటాయన్నారు. నీటి వృథాను గణనీయంగా తగ్గిస్తే బోర్డుకు మరింత రెవెన్యూ ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. సర్వే వివరాలను విజిలెన్స్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీ చేయిస్తామని,సర్వే సమయంలో అక్రమాలకు పాల్పడితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమర్షియల్ ఏరియాలుగా గుర్తించిన 150 ప్రాంతాల వివరాలు తీసుకొని ఆయా ప్రదేశాల్లో వాణిజ్య కనెక్షన్లపై సర్వే చేపట్టనున్నామని తెలిపారు. జలమండలి సిబ్బంది ఇంటింటి సర్వేకు వచ్చినప్పుడు వినియోగదారులు సహకరించాలని కోరారు. -
ఇక ఇంటింటి సర్వే
సాక్షి, ఒంగోలు: వలంటీర్లు విధుల్లోకి వచ్చేశారు. గుర్తింపు కార్డుతో ఇంటి ముంగిటకు వస్తున్నారు. కుటుంబ పరిచయాల్లో ఉన్నారు. ఇదంతా 22వ తేదీలోగా పూర్తి కావాలి. ఇక 23వ తేదీ నుంచి కుటుంబ సర్వేకి ఉపక్రమించనున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమం వలంటీర్ల ద్వారానే కుటుంబాలకు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ఏ ఒక్కరు ప్రభుత్వ సాయం అందుకోకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే పద్ధతికి చెల్లు చీటీ ఇవ్వడానికే ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. వలంటీర్లు విధి విధానాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1038 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 14,628 వలంటీర్లు విధుల్లో ఉన్నారు. స్వాతంత్య్రదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఒంగోలు నగరపాలక సంస్థ, చీరాల,కందుకూరు, మార్కాపురం మున్సిపాలిటీలు, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీల పరిధిలోని వార్డులకు వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతి యాభై కుటుంబాల సంక్షేమ బాధ్యత, ప్రభుత్వ పథకాల పంపిణీ వీరి సహకారంతోనే ఉంటుంది. వీరి పని తీరును ఎంపీడీవోలు, కమిషనర్లు పర్యవేక్షించేలా వ్యవస్థ ఏర్పాటైంది. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు వీరి పనితీరును పర్యవేక్షిస్తారు. 23 నుంచి సర్వే.. వలంటీర్ల ద్వారా కుటుంబ వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే ప్రజాసాధికార సర్వే జరిగింది. ప్రభుత్వం వద్ద ఈ సర్వే ద్వారా కుటుంబ వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం నవరత్నాల అమలు ప్రక్రియను వేగవంతం చేయడానికి వలంటీర్ల వ్యవస్థనే కీలకం చేయనుంది. ఇందులో భాగంగానే వారి ద్వారానే కుటుంబ వివరాలను సేకరించేందుకు సర్వే షెడ్యూలును ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు వలంటీర్లు వారి పరిధిలోని కుటుంబాలను పరిచయం చేసుకుంటారు. 23 నుంచి కుటుంబ సర్వేలో పాల్గొంటారు. ఈ సర్వే నివేదికను 30వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ నెల 26వ తేదీ నుంచి ఇళ్ల స్ధలాలు లేని వారి వివరాలను సేకరించే కార్యక్రమం జరగనుంది. ఇళ్ల స్థలాలు లేని వారి వివరాలను సేకరించి ప్రత్యేకంగా నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలి. ఎలాంటి సమాచారం సేకరిస్తారంటే... వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం సూచించిన విధంగా సర్వే చేస్తారు. ఈ సర్వేలో ఏం అడగాలో వివరాలకు సంబంధించి ఫార్మేట్లను అందజేశారు. సర్వే ఫార్మేట్లు వలంటీర్లకు అందజేశారు. ప్రతి యాభై కుటుంబాల వివరాలను సర్వే ఫాంలో నింపి షెడ్యూలు తేదీల ప్రకారం ఎంపీడీవోలకు అందజేయాలి. ఎంపీడీవోల ద్వారా జిల్లా కేంద్రానికి సమగ్రీకరించిన సర్వే నివేదికను నెలాఖరులోగా చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► యజమాని వివరాలు, ఆ కుటుంబంలోని సభ్యుల వివరాలను సేకరిస్తారు. కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారాన్ని అందించాలి. ► గృహనిర్మాణం కింద స్వంత ఇల్లు ఉందా. ఉంటే ఎవరి పేరున ఇల్లు ఉంది. ఇంటికి తాగునీటి వసతి. మరుగుదొడ్డి ఉంటే వివరాలు. విద్యుత్ కనెక్షన్ నెలవారీ బిల్లు వివరాలు. వంట విధానంలో కట్టెలపొయ్యితోనా..గ్యాస్‌తోనా వివరాలు సేకరిస్తారు. ► ఇంటి పరిసరాలు పరిశుభ్రత గురించి ఫార్మెట్లో వివరాలను పొందుపరచాలి. పరిశుభ్రత గురించి తగిన సమాచారాన్ని వలంటీర్లు సేకరించాలి. ► వ్యవసాయ కుటుంబం అయితే వివరాలు. భూమి ఎంత. బ్యాంకు రుణం. కౌలు రైతు అయితే వివరాలు. వ్యవసాయ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు. రైతు తీసుకున్న అప్పుల వివరాలను ఇందులో పొందుపరచాలి. ► పశుపోషణ వివరాలను సేకరిస్తారు. ఏ తరహా పశువులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నమోదు చేస్తారు. వీటి ద్వారా ఆదాయం పొందుతుంటే వాటి వివరాలు. పశుపోషణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వివరాలను నమోదు చేస్తారు. ► ఆరోగ్యం అంశంలో పిల్లల ఆరోగ్యం వివరాలను నమోదు చేస్తారు. వారికి అందుతున్న పౌష్టికాహారాన్ని ఏ విధంగా పొందుతున్నారో సేకరిస్తారు. ► విద్యకు సంబంధించి 6–15 ఏళ్ల వయస్సు ఉన్న వారు అభ్యసిస్తున్న విద్య వివరాలు. ఆ పై వయస్సు ఉన్న వారు చదువుతుంటే ఎక్కడ.. ఎలా చదువుతున్నారో వివరాలను నమోదు చేస్తారు. ప్రభుత్వ లబ్ధి పొందుతుంటే వాటి వివరాలను నమోదు చేయాలి. ► స్వయం సహాయ బృందాల మహిళలు కుటుంబంలో ఉంటే వారి వివరాలు, తీసుకున్న రుణం, ఇతర వివరాలను నమోదు చేస్తారు. పొదుపు సంఘాల సభ్యుల పని తీరును ఈ సర్వేలో నమోదు చేస్తారు. ► ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కింద లబ్ధి పొందుతుంటే పింఛన్, రేషన్, ఇతర పథకాల ద్వారా లబ్ధి వివరాలను సర్వేలో నమోదు చేస్తారు. కుటుంబ సంక్షేమంలో ఇతరత్రా ఎలాంటి సమస్య గుర్తించినా వాటిని ప్రత్యేకంగా సర్వేలో నమోదు చేస్తారు. ► ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాలను ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్ల పరిధిలో మండలాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ, దేవదాయ ధర్మాదాయ భూముల వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఎకరాకు గ్రామాల్లో అయితే 40 మంది, పట్టణాల్లో 80 నుంచి వంద మందిని ప్రతిపాదిస్తూ వివరాలను పంపారు. ఇంటి నివేశన స్థలాలకు అర్హుల వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. సర్వేకి అంతా సిద్ధం గ్రామంలోని వలంటీరు స్థాయిలో సర్వే చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఫార్మేట్ పత్రాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని మండలాలకు ఫార్మెట్ పత్రాలు చేరాయి. అక్కడి నుంచి వలంటీర్లకు ఈ ఫార్మేట్లను చేరుస్తున్నారు. వలంటీర్లే ఇంటింటి తిరిగి ఫార్మెట్‌లోని వివరాల ప్రకారం సమాచారాన్ని సేకరించి నివేదిక తయారు చేస్తారు. -
లాఠీకి పొలిటికల్ డ్యూటీ!
♦ ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఇంటింటి సర్వే ♦ కులాల వారీగా ఓటర్ల వివరాల సేకరణ ♦ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుట్టుగా సాగుతున్న సర్వే ♦ రాజకీయ లబ్ధి కోసం పోలీసు శాఖను వినియోగిస్తున్న సర్కారు ♦ అధికార దుర్వినియోగంపై సిబ్బంది ఆగ్రహం ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉంది. ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ క్రమంలో అడ్డగోలుగా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నడూ లేనివిధంగా పోలీసు శాఖ ద్వారా కులాల వారీగా ఓటర్ల సర్వే చేయిస్తోంది. తద్వారా తమకు బలం లేని ప్రాంతంపై పట్టు కోసం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ కార్యకర్తల తరహాలో ఇంటెలిజెన్స్ సిబ్బందిని వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, అమరావతిబ్యూరో : ‘మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు... మీది ఏ కులం.. అందులో ఏ ఉపకులం...’ ఇదీ వారం రోజులుగా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇంటెలిజెన్స్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చాపకింద నీరులా వివరాలు సేకరిస్తున్న తీరు. ఈ సర్వే ప్రభుత్వ గణాంకాల కోసం... పథకాలు వర్తింపజేసేందుకు కాదు... టీడీపీ ప్రభుత్వం తమ రాజకీయ ఎత్తుగడల కోసం చేయిస్తోంది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని, చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో తమను పార్టీ కార్యకర్తల కన్నా హీనంగా వాడుకుంటున్నారని పోలీసులు వాపోతున్నారు. మా రాజకీయమే.. మీ కర్తవ్యం.. అన్నట్లుగా... రాజకీయ అవసరాల కోసం కులాలవారీగా ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ భావించింది. సాధారణంగా ప్రభుత్వం వద్ద ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వివరాలు మినహా మిగిలిన ఓటర్ల వివరాలు కులాల వారీగా అధికారికంగా ఉండవు. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ సాధికారిక సర్వే కూడా పకడ్బందీగా చేయకపోవడంతో సమగ్ర వివరాలు లేవని టీడీపీ అధిష్టానం భావించింది. దీంతో కులాలవారీగా ఓటర్ల వివరాలు సేకరించాలని నిర్ణయించింది. అందుకు ఆ పార్టీ యంత్రాంగాన్ని నియోగిస్తే ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ, కీలకమైన పోలీసు శాఖకు ఆ బాధ్యతలు అప్పగించడం విస్మయపరుస్తోంది. పోలీసు శాఖ ఆ విధులను ఇంటెలిజెన్స్ విభాగానికి కేటాయించింది. శాంతిభద్రతలు, సున్నితమైన రాజకీయ అంశాలను ఇంటెలిజెన్స్ విభాగం తరచూ సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తుంటుంది. ఎన్నడూ ఇలా పోలీంగ్ బూత్‌లు, డివిజన్ల వారీగా వివిధ కులాల ఆధారంగా ఓటర్ల వివరాలను సేకరించేందుకు ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించలేదు. అయితే, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేసింది. తమకు అమరావతి జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు కులాలవారీగా కావాలని ఇంటెలిజెన్స్ విభాగానికి మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. వారం రోజులుగా సర్వే..! ప్రభుత్వ ఆదేశాల మేరకు వారంరోజుల కిందట ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఓ సమావేశం నిర్వహించి కానిస్టేబుళ్లకు కర్తవ్యబోధ చేశారు. వారికి నియోజకవర్గాలు, డివిజన్లు, మండలాలు పోలింగ్ బూత్‌లవారీగా జాబితా ఇచ్చారు. ఎవరు ఏ డోర్ నంబర్ నుంచి ఏ డోర్ నంబర్ వరకు ఎవరు సర్వే చేయాలో కూడా నిర్దేశించారు. మొదట డివిజన్ కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ అధ్యక్షుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలని చెప్పారు. అనంతరం ప్రతి ఇంటికి కూడా వెళ్లి ఓటర్ల వివరాలు కులాల వారీగా సేకరించాలని ఆదేశించారు. ఉప కులాల పేర్లతో సహా రాసుకుని రావాలని చెప్పారు. ఈ మేరకు కానిస్టేబుళ్లు వారం రోజులుగా రోడ్లపై పడ్డారు. అయితే, కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు వద్ద కూడా కులాలు, ఉప కులాల వారీగా ఓటర్ల వివరాలు సమగ్రంగా లేవు. ప్రస్తుతం ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తమను పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా వాడుకుంటున్నారని పలువురు ఇంటెలిజెన్స్ సిబ్బంది వాపోతున్నారు. అయినా వారి గోడును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. అనుకూల మార్పుల కోసమేనా...! జూలై ఒకటో తేదీ నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఎక్కడైనా తమకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనిపిస్తే... మిగిలిన మూడు వారాల్లో తమ సానుభూతిపరులు, కార్యకర్తలను ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లుగా చేర్పించాలని భావిస్తున్నట్లు సమచారం.