సమావేశంలో ఎండీ దానకిశోర్, అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక నష్టాల్లో ఉన్న వాటర్‌బోర్డును గట్టెక్కించేందుకు జలమండలి ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. గృహ వినియోగ(డొమెస్టిక్), వాణిజ్య అవసరాల (కమర్షియల్) నల్లా కనెక్షన్ల లెక్క తేల్చనుంది. డొమెస్టిక్ కనెక్షన్లు కలిగి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ ప్రతినెల రూ.వేలల్లో బిల్లులు ఎగవేస్తున్న భవనాల గుర్తింపే లక్ష్యంగా శనివారం నుంచి ఈ సర్వే సాగనుంది. ఇందుకోసం 150 మంది సిబ్బందితో 50 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నట్లు జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. నగర పరిధిలో మొత్తం 10.6 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా... వీటిలో కమర్షియల్ కనెక్షన్లు 30వేలకు మించి లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డు చరిత్రలోనే తొలిసారి ఇంటింటి సర్వే చేయనున్నారు. సిబ్బందికి శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్–1 డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు.
సర్వే ఇలా...
జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్ సాయంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తాయి. నల్లా కనెక్షన్ నంబర్, నీటి మీటర్ సమాచారం, ఇంటి వైశాల్యం, ఎన్ని గదులు, ఎన్ని అంతస్తులు, కనెక్షన్ కేటగిరీ తదితర వివరాలను సిబ్బంది సేకరిస్తారు. సదరు భవనానికి బోర్డు నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత కేటగిరీలో కనెక్షన్ ఉందా? లేదా? అనేది పరిశీలిస్తారు. ఒకవేళ డొమెస్టిక్ కనెక్షన్ ఉండి, ఆ భవనంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే దాన్ని కమర్షియల్ కేటగిరీలోకి మారుస్తారు. ఈ సర్వేను తొలుత నారాయణగూడ, ఎస్‌ఆర్‌నగర్, మారేడుపల్లి, కూకట్‌పల్లి, అంబర్‌పేట్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ డివిజన్ల పరిధిలో చేపడతారు.
ఆదాయానికి మించి ఖర్చు...
జలమండలి రెవెన్యూ ఆదాయం నెలకు రూ.120 కోట్లు కాగా.. ఖర్చు రూ.150 కోట్లకు చేరిందని ఎండీ దానకిశోర్ తెలిపారు. ప్రతినెల రూ.30 కోట్ల లోటు బడ్జెట్‌తో బోర్డు నెట్టుకొస్తోందని చెప్పారు. రెవెన్యూ ఆదాయం పెంచుకొని ఈ లోటును పూడ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సర్వేలో అక్రమ నల్లా కనెక్షన్ల గుర్తింపు, వాటిని క్రమబద్ధీకరించడం, నాన్ డొమెస్టిక్ కనెక్షన్ అయితే మీటర్ బిగింపు, నీటి వృథాను అరికట్టే విషయంలో వినియోగదారులకు అవగాహన కల్పించడం తదితర అంశాలు ఉంటాయన్నారు. నీటి వృథాను గణనీయంగా తగ్గిస్తే బోర్డుకు మరింత రెవెన్యూ ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. సర్వే వివరాలను విజిలెన్స్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీ చేయిస్తామని,సర్వే సమయంలో అక్రమాలకు పాల్పడితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కమర్షియల్ ఏరియాలుగా గుర్తించిన 150 ప్రాంతాల వివరాలు తీసుకొని ఆయా ప్రదేశాల్లో వాణిజ్య కనెక్షన్లపై సర్వే చేపట్టనున్నామని తెలిపారు. జలమండలి సిబ్బంది ఇంటింటి సర్వేకు వచ్చినప్పుడు వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment