పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్ : సత్యసాయి బాబా 88వ జయంతి సందర్భంగా శనివారం అశేష భక్త జనుల సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఉదయం 8.30 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి.
కేరళ సంప్రదాయరీతిలో మంగళ వాద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు ఆత్మ స్వరూపుడైన సత్యసాయికి ఆత్మ నివేదనను అర్పించారు. సత్యసాయి ప్రేమతత్వాన్ని వివరిస్తూ సత్యసాయి భోదనల ఆంగ్లఅనువాదకుడు ప్రోఫెసర్ అనిల్ కుమార్ ప్రసంగించారు. సత్యసాయి మానవాళికందించిన వెలకట్టలేని సేవలకు చిహ్నంగా భారత ప్రభుత్వం తరుఫున కేంద్ర సమాచార ప్రసార సాధనాల శాఖ మంత్రి కిల్లి కృపారాణి సత్యాసాయి స్మారక స్టాంపును విడుదల చేశారు. ప్రథమ స్టాంపును సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు జస్టిస్ ఏపీ మిశ్రాకు అందజేశారు.
అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 2012-13 సంవత్సర వార్షిక నివేదికను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు టీకేకే భగవత్‌తో కలసి మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. వాటి ప్రతులను రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డికి అందజేశారు. ట్రస్ట్ సభ్యుడు నాగానంద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదిక ఆధారంగా సత్యసాయి ట్రస్ట్ సేవలు, చేపట్టబోవు పథకాలను వివరించారు. అనంతరం సత్యసాయి స్మారకార్థం పోస్టల్ కవర్‌ను విడుదల చేసి మంత్రి కిల్లి కృపారాణి, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్‌కు అందజేశారు.
సాయి సేవలు వెలకట్టలేనివి : కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి
వేడుకలకు ముఖ్య అథితిగా హాజరైన కిల్లి కృపారాణి ప్రసంగింస్తూ పేదలకు సత్యసాయి అందజేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. నేటి ప్రపంచానికి ఆయన ఆదర్శమన్నారు. సత్యసాయి ఆశయ సాధనకు ప్రతి సాయి భక్తుడు పాటుపడాలన్నారు. దేశవిదేశాల భక్తలకు ప్రశాంతత నందించిన ప్రశాంతి నిలయం పేరుమీద త్వరలోనే మైస్టాంప్ పేరుతో మరో స్టాంపును విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం విద్యార్థులు బ్రాస్ బ్యాండ్ వాయిద్యంతో సత్యసాయికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వరాలొలికించారు. సత్యసాయి విద్యార్థులు, వివిద దేశాలకు చెందిన భక్తులు ప్రత్యేకంగా తయారు చేసిన 88 కేజీల సత్యసాయి జయంతి కేక్‌ను మంత్రి కిల్లికృపారాణి క్యాండిల్స్ వెలిగించి కట్ చేశారు. వేడుకల్లో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు,సత్యసాయి భక్తులు పాల్గొన్నారు.
సత్యసాయి జయంతి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, కదిరి ఆర్‌డీఓ రాజశేఖర్, పోస్టల్ పీఎంజీలు సుధాకర్, సంధ్యారాణి, పోస్టల్ డెరైక్టర్ డీఎస్‌వీఆర్ మూర్తి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌రాజు, మద్రాస్ శ్రీనివాస్, చక్రవర్తి, సత్యసాయి యూనివర్సిటీ చాన్సలర్, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య, వైస్‌చాన్సలర్ శశిధర్‌ప్రసాద్, రిజిస్ట్రార్ నరేన్ రాంజి, సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నరేంద్రరెడ్డి, అంతర్జాతీయ అధ్యక్షుడు గ్యారీబెల్, మాజీ అధ్యక్షుడు గోల్డ్ స్టెయిన్, పారిశ్రామిక వేత్త టీవీఎస్ శ్రీనివాసన్, రిటైర్డ్ డీజీపీ హెచ్‌జె దొర, అప్పారావు తదితరులు హాజరయ్యారు.
ఘనంగా సత్యసాయి జయంతి
Published Sun, Nov 24 2013 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement