హరహరమహాదేవ.. | grand celebrations of maha shivaratri | Sakshi
Sakshi News home page

హరహరమహాదేవ..

Published Sat, Feb 22 2014 3:38 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

grand celebrations of maha shivaratri

శ్రీశైలం, న్యూస్‌లైన్ : హరహర మహాదేవ శంభోశంకర అంటూ శ్రీగిరి కొండలు మారుమోగుతున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో  శుక్రవారం దేవేరి భ్రామరీ సమేతంగా మల్లికార్జునస్వామి హంసవాహనంపై దర్శనమిచ్చారు. పంచాక్షరి ప్రణవనాదంతో ఇరుముడులను తలపై ఉంచుకుని శ్రీశైలం చేరుతున్న శివస్వాములు గ్రామోత్సవంలో దర్శనమిచ్చిన స్వామివార్లను చూసి తరించారు. అక్కమహదేవి అలంకార మండపంలో రాత్రి 7గంటలకు హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకారపూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వాహనపూజలకు దర్మకర్తలమండలి చైర్మన్ ఆల్తూరి ఆదినారాయణరెడ్డి,  ఈవో చంద్రశేఖర ఆజాద్, ఆలయ ఏఈఓ రాజశేఖర్  తదితరులు హాజరయ్యారు.

మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా, భక్తులు పంచాక్షరినామ స్మరణ చేస్తున్న సమయాన హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం గుండా రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత  నారికేళాన్ని సమర్పించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.
 
 పధాన పురవీధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఈ గ్రామోత్సవం జరిగింది. అక్కడి నుంచి నేరుగా స్వామిఅమ్మవార్ల ఆలయప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూరనీరాజనాలనర్పించారు.  కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మనప్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, ఈఈ రమేష్, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement