Mallikarjun swamy
-
పుష్ప సోయగం.. శ్రీగిరి శోభితం
అభిషేకప్రియుడైన మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి మంగళవారం పుష్పపల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏన్నో ఏళ్లుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా పుష్పపల్లకీసేవ ఏనాడు నిర్వహించలేదు. అయితే ప్రప్రథమంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పప్రియుడైన మల్లికార్జునస్వామికి పుష్పపల్లకీ మహోత్సవాన్ని నిర్వహించి పరిపూర్ణంగా స్వామివార్ల కైంకర్యాలను నిర్వహించాలనే సంకల్పంతో ఈఓ చంద్రశేఖర ఆజాద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి కల్యాణమండపంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష వాహనసేవలు నిర్వహించాక ఆలయప్రదక్షిణ చేయించారు. అనంతరం ఊరేగింపుగా రథశాల వద్దకు చేర్చి పుష్పాలంకృతశోభతో కళకళలాడుతున్న పల్లకీలో ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. ఈ పుష్పపల్లకీకోసం 18రకాల పూలను 500కేజీల వరకు వినియోగించారు. వీటితోపాటు ఆరువేల విడిపుష్పాలు (కట్‌ప్లవర్స్) వినియోగించి అత్యంత సుందరంగా పుష్పపల్లకీని తీర్చిదిద్దారు. గతంలో దసరా మహోత్సవాల్లో మాత్రమే పుష్పపల్లకీ సేవ ఉండేది. కార్యక్రమంలో చైర్మన్ ఆల్తూరి, మాజీ ట్రస్ట్‌బోర్డు చెర్మైన్ ఇమ్మడిశెట్టి, దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ, ఈఈ రమేష్, ఏఈఓ రాజశేఖర్, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, శ్రీశైలం మహానందిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం మహానంది,న్యూస్‌లైన్: మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభ మయ్యాయి. డీసీ, ఇన్చార్జ్ ఈఓ సాగర్‌బాబు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం నుంచి రాత్రి వరకు విశేష ద్ర వ్యాభిషేక పూజలు చేపట్టారు. ఉదయం గణపతిపూజ, పుణ్యాహవాచన ము, చండీశ్వరపూజ, రుత్విగ్వరణం, దీక్షాధారణ అఖండస్థాపనం.. తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ, అగ్రిప్రతిష్ఠాపన, కలశస్థాపన, వాస్తూపూజా హోమాలు, భేరిపూజ, ధ్వజారోహణం, బలిహరణం, వేదశాస్త్ర సమర్పణం చేశారు. వేదపండితులు రాధాకృష్ణశర్మ, రవిశంకరఅవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, జ్వాలాచక్రవర్తి తదితర పండిత బృందం ఆధ్వర్యంలో పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ సాగర్‌బాబు మాట్లాడుతూ.. మహానంది క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. భక్తులరద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. మయూరవాహనంపై మహానందీశ్వరుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి మహానందీశ్వరుడు మయూరవాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహానందీశ్వరుడికి చేపట్టిన అలంకారం భక్తులను మంత్రముగ్దులను చేసింది. విశేష అలంకారంలో ఉన్న స్వామివారిని మయూరవాహనంపై కొలువు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. డీసీ సాగర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి శివయ్య, సూపరింటెండెంట్లు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, మహానంది -
హరహరమహాదేవ..
శ్రీశైలం, న్యూస్‌లైన్ : హరహర మహాదేవ శంభోశంకర అంటూ శ్రీగిరి కొండలు మారుమోగుతున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శుక్రవారం దేవేరి భ్రామరీ సమేతంగా మల్లికార్జునస్వామి హంసవాహనంపై దర్శనమిచ్చారు. పంచాక్షరి ప్రణవనాదంతో ఇరుముడులను తలపై ఉంచుకుని శ్రీశైలం చేరుతున్న శివస్వాములు గ్రామోత్సవంలో దర్శనమిచ్చిన స్వామివార్లను చూసి తరించారు. అక్కమహదేవి అలంకార మండపంలో రాత్రి 7గంటలకు హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకారపూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వాహనపూజలకు దర్మకర్తలమండలి చైర్మన్ ఆల్తూరి ఆదినారాయణరెడ్డి, ఈవో చంద్రశేఖర ఆజాద్, ఆలయ ఏఈఓ రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా, భక్తులు పంచాక్షరినామ స్మరణ చేస్తున్న సమయాన హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం గుండా రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నారికేళాన్ని సమర్పించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. పధాన పురవీధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఈ గ్రామోత్సవం జరిగింది. అక్కడి నుంచి నేరుగా స్వామిఅమ్మవార్ల ఆలయప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూరనీరాజనాలనర్పించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మనప్ ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు, ఈఈ రమేష్, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవం
శ్రీశైలం, న్యూస్‌లైన్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో శ్రీశైలాలయం సరికొత్త శోభను సంతరించుకుంది. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో గురువారం ఉదయం 9 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు.. మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా వేడుకకు శ్రీకారం చుట్టారు. ఈవో చంద్రశేఖర్ ఆజాద్ యాగశాల ప్రవేశం చేసి విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రత్యేక పూజల్లో భాగంగా బ్రహ్మోత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని ఆవాహన చేసి దీక్షా వస్త్రాలను సమర్పించి కంకణాన్ని ధరింపజేశారు. ఆ తర్వాత ఈవో దీక్షా వస్త్రాలను స్వీకరించి కంకణధారణ చేసుకున్నారు. ఉత్సవంలో పాల్గొనే అర్చకులు, వేదపండితులు, భజంత్రీలు, సంబంధిత సిబ్బందికి వీటిని అందజేశారు. అనంతరం పుణ్యహవాచనం, శివసంకల్పం, చండీశ్వర పూజ, రుత్విగ్వరణం, అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, కలశ స్థాపన తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుని ఆధ్వర్యంలో ముక్కంటి బ్రహ్మోత్సవాలను చండీశ్వరుడే నిర్వహిస్తాడని వేదపండితులు తెలిపారు. అందుకే చండీశ్వరునికి ముందుగా కంకణధారణ చేస్తామన్నారు. ఉత్సవ సమయంలో ప్రతి రోజూ ఉభయ దేవాలయ పూజా వేళల్లో ఈ చండీశ్వరుని పల్లకీని ఊరేగిస్తామన్నారు. పల్లకి ఉత్సవంలో బ్రహ్మోత్సవాల నిర్వాహణను చండీశ్వరుడే పర్యవేక్షిస్తాడన్నారు. ప్రత్యేక పూజల్లో ఈఈలు రమేష్, నాగేశ్వరరావు, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, ఆలయ ఏఈఓ రాజశేఖర్, కేశవరావు, మోహన్, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, డీఈ నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.