శ్రీశైలం, న్యూస్‌లైన్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో శ్రీశైలాలయం సరికొత్త శోభను సంతరించుకుంది. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో గురువారం ఉదయం 9 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు.. మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా వేడుకకు శ్రీకారం చుట్టారు.
ఈవో చంద్రశేఖర్ ఆజాద్ యాగశాల ప్రవేశం చేసి విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రత్యేక పూజల్లో భాగంగా బ్రహ్మోత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని ఆవాహన చేసి దీక్షా వస్త్రాలను సమర్పించి కంకణాన్ని ధరింపజేశారు. ఆ తర్వాత ఈవో దీక్షా వస్త్రాలను స్వీకరించి కంకణధారణ చేసుకున్నారు. ఉత్సవంలో పాల్గొనే అర్చకులు, వేదపండితులు, భజంత్రీలు, సంబంధిత సిబ్బందికి వీటిని అందజేశారు. అనంతరం పుణ్యహవాచనం, శివసంకల్పం, చండీశ్వర పూజ, రుత్విగ్వరణం, అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, కలశ స్థాపన తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుని ఆధ్వర్యంలో ముక్కంటి బ్రహ్మోత్సవాలను చండీశ్వరుడే నిర్వహిస్తాడని వేదపండితులు తెలిపారు. అందుకే చండీశ్వరునికి ముందుగా కంకణధారణ చేస్తామన్నారు.
ఉత్సవ సమయంలో ప్రతి రోజూ ఉభయ దేవాలయ పూజా వేళల్లో ఈ చండీశ్వరుని పల్లకీని ఊరేగిస్తామన్నారు. పల్లకి ఉత్సవంలో బ్రహ్మోత్సవాల నిర్వాహణను చండీశ్వరుడే పర్యవేక్షిస్తాడన్నారు. ప్రత్యేక పూజల్లో ఈఈలు రమేష్, నాగేశ్వరరావు, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, ఆలయ ఏఈఓ రాజశేఖర్, కేశవరావు, మోహన్, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, డీఈ నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.