అభిషేకప్రియుడైన మల్లికార్జునస్వామి దేవేరి భ్రామరితో కలిసి మంగళవారం పుష్పపల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏన్నో ఏళ్లుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా పుష్పపల్లకీసేవ ఏనాడు నిర్వహించలేదు. అయితే ప్రప్రథమంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పప్రియుడైన మల్లికార్జునస్వామికి పుష్పపల్లకీ మహోత్సవాన్ని నిర్వహించి పరిపూర్ణంగా స్వామివార్ల కైంకర్యాలను నిర్వహించాలనే సంకల్పంతో ఈఓ చంద్రశేఖర ఆజాద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి కల్యాణమండపంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష వాహనసేవలు నిర్వహించాక ఆలయప్రదక్షిణ చేయించారు.
అనంతరం ఊరేగింపుగా రథశాల వద్దకు చేర్చి పుష్పాలంకృతశోభతో కళకళలాడుతున్న పల్లకీలో ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. ఈ పుష్పపల్లకీకోసం 18రకాల పూలను 500కేజీల వరకు వినియోగించారు. వీటితోపాటు ఆరువేల విడిపుష్పాలు (కట్‌ప్లవర్స్) వినియోగించి అత్యంత సుందరంగా పుష్పపల్లకీని తీర్చిదిద్దారు. గతంలో దసరా మహోత్సవాల్లో మాత్రమే పుష్పపల్లకీ సేవ ఉండేది. కార్యక్రమంలో చైర్మన్ ఆల్తూరి, మాజీ ట్రస్ట్‌బోర్డు చెర్మైన్ ఇమ్మడిశెట్టి, దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ, ఈఈ రమేష్, ఏఈఓ రాజశేఖర్, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు.
- న్యూస్‌లైన్, శ్రీశైలం
మహానందిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహానంది,న్యూస్‌లైన్: మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభ మయ్యాయి. డీసీ, ఇన్‌చార్జ్ ఈఓ సాగర్‌బాబు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం నుంచి రాత్రి వరకు విశేష ద్ర వ్యాభిషేక పూజలు చేపట్టారు. ఉదయం గణపతిపూజ, పుణ్యాహవాచన ము, చండీశ్వరపూజ, రుత్విగ్వరణం, దీక్షాధారణ అఖండస్థాపనం.. తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ, అగ్రిప్రతిష్ఠాపన, కలశస్థాపన, వాస్తూపూజా హోమాలు, భేరిపూజ, ధ్వజారోహణం, బలిహరణం, వేదశాస్త్ర సమర్పణం చేశారు. వేదపండితులు రాధాకృష్ణశర్మ, రవిశంకరఅవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, జ్వాలాచక్రవర్తి తదితర పండిత బృందం ఆధ్వర్యంలో పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ సాగర్‌బాబు మాట్లాడుతూ.. మహానంది క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. భక్తులరద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని అన్నారు.
మయూరవాహనంపై మహానందీశ్వరుడు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి మహానందీశ్వరుడు మయూరవాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహానందీశ్వరుడికి చేపట్టిన అలంకారం భక్తులను మంత్రముగ్దులను చేసింది. విశేష అలంకారంలో ఉన్న స్వామివారిని మయూరవాహనంపై కొలువు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. డీసీ సాగర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి శివయ్య, సూపరింటెండెంట్లు, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
- న్యూస్‌లైన్, మహానంది
పుష్ప సోయగం.. శ్రీగిరి శోభితం
Published Wed, Feb 26 2014 3:59 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM
Advertisement
Advertisement