ప్రేమ, కరుణ, మానవీయ స్పర్శలతో శత్రువుల హృదయాలను సైతం జయించిన కరుణామయుడు ఏసు ప్రభువని రెవరెండ్ పాస్కల్ ప్రకాష్ తెలిపారు.
ప్రేమ, కరుణ, మానవీయ స్పర్శలతో శత్రువుల హృదయాలను సైతం జయించిన కరుణామయుడు ఏసు ప్రభువని రెవరెండ్ పాస్కల్ ప్రకాష్ తెలిపారు. క్రిస్మస్ పండగ సందర్భంగా బుధవారం స్థానిక సీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ సందేశాన్ని అందించారు. సమాజంలో పొరుగు వానిని ప్రేమిస్తూ..ఆపదలో ఉన్న వారి పట్ల కరుణ, జాలి, దయ చూపడం ద్వారా ప్రభువు ఆశించిన శాంతి సామరస్య పూర్వక సమాజాన్ని స్థాపించవచ్చునన్నారు. అనంతరం సంపత్ కుమార్, దేవదాసు.. బైబిల్ పఠనం గావించారు. ఆర్‌పి సజీవన్ ఆశీర్వాదం నిర్వహించగా సెలవు కీర్తనలతో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు సీసీ చర్చి ప్రాంగణంలో ప్రదర్శించిన క్రీస్తు అద్భుతములు అనే నాటిక అందరినీ ఆకట్టుకుంది.
సీఎస్‌ఐ చర్చిలో ప్రదక్షిణలు..
సీఎస్‌ఐ చర్చిలో ఉదయం 7 గంటల నుండే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. రెవరెండ్ జడ్.యేసురత్నం ఆధ్వర్యంలో భక్తులు చర్చి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సులోచనమ్మ, రమేష్, సాల్మన్ ఆధ్వర్యంలో క్రీస్తు కీర్తనలు పాడారు. డీనరీ చైర్మన్లు యేసురత్నం, ప్రేంచంద్‌ల నాయకత్వంలో పాస్టర్లు రెవ ఎంఐడీ ప్రసాద్, రెవ రవి క్రిస్మస్ ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. రెవరెండ్ పుష్పలలితమ్మ క్రిస్మస్‌ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు.
బంధుమిత్రుల సందడి..
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలోని క్రైస్తవ కుటుంబాల్లో బంధు మిత్రుల సందడి కనిపించింది. నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. పండగ సందర్భంగా జిల్లాఅంతటా మతసామరస్యం వెల్లివిరిసింది. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి స్థానిక సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనను రెవ జెడ్.యేసురత్నం, రెవ.పుష్పలలితమ్మ ఆహ్వానం పలికారు. అలాగే భగత్‌సింగ్ కాలనీ (42వ వార్డు)లోని బెత్లహాం చర్చిలో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ హఫీజ్‌ఖాన్ పాల్గొని క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పేద వితంతువులకు చీరలు పంపిణీ చేశారు.