అనంతపురం కల్చరల్, న్యూస్‌లై న్ : కోటి ఆశల పల్లకిలో వచ్చిన నూతన సంవత్సరానికి జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం వాడవాడలా సంబరాలు అంబరాన్నంటాయి. సామాన్యులు మొదలుకునిప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంవత్సరం సకల శుభాలతో ప్రశాంతంగా గడిచిపోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అనంతపురం లోక్‌సభ సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవిత, మాజీ మేయర్ రాగే పరశురామ్, వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు జిల్లా అధికారులు న్యూ ఇయర్ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలపడానికి వందలాది మంది తరలిరావడంతో కలెక్టరేట్ జనసంద్రంగా మారింది. కొత్త సంవత్సరంలో జిల్లా వాసులు సుఖశాంతులతో జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతపురం నగరంలోని పాఠశాలలు, కళాశాలలలోనూ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వన్నూరు డాన్స్ అకాడమీ చిన్నారులు స్థానిక అంబేద్కర్ నగర్‌లో మెగా డాన్స్ హంగామా సృష్టించారు. సంబరాల వల్ల నగరంలోని రోడ్లన్నీ రద్దీగా కన్పించాయి.
వ్యాపారాలకు జోష్
నూతన సంవత్సర సంబరాలతో ముడిపడిన వ్యాపారాలు అంచనాలకు మించి సాగాయి. నగరంలో స్వీట్లు, పూలు, పండ్ల వ్యాపారాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో జరిగినట్లు దుకాణదారులు చెబుతున్నారు. స్వీటు స్టాళ్లు ఇరవై నాలుగు గంటలూ కిటకిటలాడాయి. స్వీట్లు, బేకరీ వ్యాపారమే రూ.కోటి దాటింది. విద్యార్థులు చాక్లెట్లు, ప్యాకెట్ క్యాలెండర్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుకోవడంతో చాలాచోట్ల వాటి స్టాకు అయిపోయింది. పండ్లు, పూల వ్యాపారాలు వేటికవే పోటీపడ్డాయి. వీటి అమ్మకాలు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సాగివుంటుందని అంచనా. సాధారణ రోజుల్లో రూ.పది ఉండే మూర పూలు రూ.30 పలకడం గమనార్హం. నూతన సంవత్సరం ప్రారంభ రోజున కొత్త దుస్తులు ధరించాలన్న సెంటిమెంట్ వస్త్ర దుకాణదారులకు కలిసొచ్చింది. దుకాణాలతో పాటు ఫుట్‌పాత్‌లపైనా వస్త్ర వ్యాపారం జోరుగా సాగింది. ఇక ఆఫర్ల హంగామా వల్ల వివిధ వ్యాపారాలకు జోష్ వచ్చింది. మద్యం ఏరులై పారింది.
అంబరం అంటిన సంబరం
Published Thu, Jan 2 2014 3:00 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement