
పండుగలా ప్రమాణ స్వీకారం
‘నారా చంద్రబాబునాయుడు అనే నేను..’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ర్ట విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన బాబు పట్టాభిషేక మహోత్సవానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట సభా ప్రాంగణం వేదికయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అతిరథ మహారథుల ఆగమనంతో పండుగను తలపించింది. అధికార యంత్రాంగం శ్రమ ఫలించింది. వారం రోజులు ఏర్పాట్లలో తలమునకలైన అధికారులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కార్యక్రమం విజయవంతం కావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
సాక్షి, గుంటూరు : సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆదివారం రాత్రి 7.27 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చంద్రబాబుతోపాటు ఆయన కేబినెట్‌లో మంత్రులుగా 19 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాకు చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు చంద్రబాబు, గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి అధికారులు, టీడీపీ నేతలు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఏఎన్‌యూ ఎదుట మైదానంలో భారీ వేదికను ఏర్పాటు చేసి వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ప్రమాణ స్వీకారోత్సవం చూసేందుకు సభా ప్రాంగణంలో ఎల్‌సీడీలను ఏర్పాటు చేశారు.
జాతీయ స్థాయి నేతలు అనేక మంది హాజరై చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాలు రాజధాని హైదరాబాద్‌లో జరిగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తొలిసారిగా గుంటూరుకు ఈ అరుదైన గౌరవం దక్కడంతో టీడీపీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి అధినేత చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక్కొక్కరిగా ఆహ్వానిస్తున్న సమయంలో పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావుల పేర్లు పిలిచినప్పుడు ప్రజల నుంచి ఈలలు, కేలు వేస్తూ కేరింతలు కొట్టారు. జిల్లాలో సీనియర్లను పక్కనబెట్టి జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఆయా సీనియర్ నేతల అనుచరులు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు.
ఫలించిన అధికారుల శ్రమ..
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను గత 15 రోజులుగా పర్యవేక్షిస్తూ అన్ని తామై చూసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్, జేసీ వివేక్‌యాదవ్, ఐజీ సునీల్‌కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు జెట్టి గోపినాథ్, జె.సత్యనారాయణల శ్రమ ఫలించింది. జాతీయస్థాయి నాయకులు అనేకమంది ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుగు ప్రయాణ సమయంలో చంద్రబాబుతోపాటు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ నరసింహన్‌తోపాటు అనేక మంది వీవీఐపీలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరించి వారిని సాగనంపారు.
ప్రమాణంలో ప్రత్యేకతలు...
సాక్షి ప్రతినిధి, గుంటూరు : పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన ఆనందం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తొలి మంత్రివర్గంలో స్థానం లభించిన ఉద్విగ్న పరిస్థితుల్లో 19 మంది ఎమ్మెల్యేలు మంత్రి, రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారాలు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆంగ్లంలో, మిగిలిన వారంతా తెలుగు బాషలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తే, ముగ్గురు చంద్రబాబు పాదాలకు నమస్కరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చయ్యనాయుడు అందరికంటే బిగ్గరగా, స్పష్టంగా ప్రమాణం చేసి దివంగత మాజీ ఎంపీ యర్రంనాయుడుని గుర్తుకు తెచ్చారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రమాణం చేసే సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, కృష్ణా జిల్లా కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆంగ్లంలో ప్రమాణం చేయగా మిగిలినవారంతా తెలుగులోనే ప్రమాణం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ శాసనసభ్యుడు కేఈ కృష్ణమూర్తి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ టి.నారాయణ, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, విశాఖ జిల్లా బీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే సిద్దా రాఘవరావు, విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు తెలుగులో ప్రమాణం చేశారు. వీరందరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సునీత, సుజాత, కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం అనంతరం బాబు పాదాలకు నమస్కారం చేశారు.