సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నంపై ఆది నుంచీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి .. రాజధాని ప్రతిపాదన తర్వాత విశ్వ నగరాన్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి ఏకంగా రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. శనివారం విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ర్యాలీగా నేరుగా కైలాసగిరికి వెళ్లిన సీఎం అక్కడ వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. కైలాసగిరిపై రూ.37 కోట్లతో నిర్మించనున్న ప్లానెటోరియానికి శంకుస్థాపన చేశారు.
అక్కడ నుంచి బయలుదేరి నేరుగా వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌కు వెళ్లి జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మీ, గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి, అదీప్ రాజ్, విశాఖ ఎంపీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పీఎన్‌ఆర్‌డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో ఘన స్వాగతం లభించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన చేసిన అనంతరం తొలిసారిగా నగర పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకూ దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్వహించారు.
శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం జగన్‌కు దారిపొడవునా కృతజ్ఞత పూర్వక స్వాగతం లభించింది. సీఎం కాన్యాయ్‌పై పూల వర్షం కురిపించారు. బెలూన్లను గాల్లోకి విసిరి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి రోడ్డుపై నిల్చోని తమ అభిమాన నేత జగనన్న కోసం ఎదురు చూశారు. ప్లకార్డులు, జెండాలు పట్టుకొని సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. ‘జై జగన్.. జయహో జగనన్న’ అనే నినాదాలతో విశాఖపట్నం మార్మోగింది. కారులో ఉన్న సీఎం జగన్‌లో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. కైలాసగిరి నుంచి సెంట్రల్‌పార్క్‌కు, సెంట్రల్ పార్క్ నుంచి ఆర్‌కేబీచ్‌కు ఇలా సీఎం వచ్చే దారిలో స్వాగత మానవ తోరణంతో సీఎంకు థాంక్స్ చెప్పారు. కాన్వాయ్ వాహనంలో ముఖ్యమంత్రి ఎడమవైపున ఉంటారు. దీంతో రోడ్డుకు ఒకవైపున మాత్రమే నిలబడి ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధానిగా ప్రతిపాదించిన కొద్ది రోజుల్లోనే విశాఖ అభివృద్ధికి బీజం వేస్తూ ఏకంగా రూ.1285.32 కోట్ల పనులు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment