కొత్త గవర్నర్‌కు ఘన స్వాగతం | Grand Welcome to the new governor | Sakshi
Sakshi News home page

కొత్త గవర్నర్‌కు ఘన స్వాగతం

Published Wed, Jul 24 2019 3:18 AM | Last Updated on Wed, Jul 24 2019 3:21 AM

Grand Welcome to the new governor - Sakshi

గన్నవరం విమానాశ్రయంలో విశ్వభూషణ్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి/తిరుమల/గన్నవరం/భవానీపురంఔ(విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌కు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం మధ్యాహ్నం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన సతీమణి సుప్రభ హరిచందన్‌తో కలసి తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. రన్‌వే వద్ద హరిచందన్‌ను ముఖ్యమంత్రి జగన్‌ శాలువాతో సత్కరించి.. పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. తదుపరి ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ ఆవరణలో నూతన గవర్నర్‌ ఏబంపీ పోలీస్‌ ప్రత్యేకదళం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు తానేటి వనిత, కొడాలి వెంకటేశ్వరరావు, మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్‌ను, ఉన్నతాధికారులను కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఈ సందర్భంగా పరిచయం చేశారు. స్వాగత కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, జీఎడీ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, ఐఏఎస్‌ అధికారులు సతీష్‌చంద్ర, జేఎస్‌వీ ప్రసాద్, విజయవాడ సీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, ఇంకా పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి విశ్వభూషణ్‌ దంపతులు విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తదుపరి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 

శ్రీవారి దర్శనం..
కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌ మంగళవారం మధ్యాహ్నం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హరిచందన్‌ దంపతులు వయోవృద్ధుల క్యూలో ఆలయంలోనికి ప్రవేశించారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి వారిని సాదరంగా ఆహ్వానించి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించుకుని వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో హరిచందన్‌ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల ప్రత్యేకాధికారి కలిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం ఆలయం వెలుపల హరిచందన్‌ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం దివ్యానుభూతిని కలిగించిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ చాలా బాగుందని కితాబిచ్చారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆయన వరాహస్వామివారిని దర్శించుకున్నారు. 

నేడు ప్రమాణ స్వీకారం..
రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ పదవీ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుక కోసం రాజ్‌భవన్‌ ముస్తాబైంది. గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రవ్యాప్తంగా 461 మంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. వీరిలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సీఎంవో కార్యాలయ అధికారులు, గవర్నర్‌ కార్యాలయ అధికారులు ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వెయ్యిమంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి కేవలం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి వాహనాల్నే అనుమతిస్తామని, ఇతర వీవీఐపీల వాహనాలు రాజ్‌భవన్‌ ముందే ఆపాలని, అక్కడినుంచి వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ కార్లలో లోపలికి తీసుకెళతామని తెలిపారు. ఆహ్వానితులందరూ 10.45 గంటల్లోగా ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, గవర్నర్‌ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement