
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘన స్వాగతం
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం చేరుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. ఈ గ్రామంలో రెండు చోట్ల జగన్ కాన్వాయ్‌ను క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలకు చెందిన తమిళ మహిళలు ఆపి అభిమాన నేతను కలుసుకున్నారు. తమను జగన్ ఆశీర్వాదించారనేది తమిళంలో చెప్పుకుంటూ సంతోషపడ్డారు.
కిక్కిరిసిన రోడ్లు
తంగేళ్లపాళెంలో జగన్ రాక సందర్భంగా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. జననేతను చూసేందుకు యువకులు చెట్లపైకి ఎక్కడం కనిపించింది. తారాజువ్వలు పేల్చుతూ తమ నాయకుడికి వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికాయి. అక్కడ నుంచి బసవయ్యపాళెం, కొత్తబైపాస్‌రోడ్డు క్రాస్‌ల్లో తన కోసం వేచి ఉన్న మహిళలను, గ్రామస్తులను పలకరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాళహస్తిలోని వీఎంపల్లెకు చేరుకున్నారు.