ఆదివారం విద్యుద్దీపాల వెలుగులో శోభాయమానంగా వెలుగొందుతున్న శ్రీశైల ఆలయం
శ్రీశైలం/శ్రీకాళహస్తి(రేణిగుంట)/నరసరావుపేట: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నల్లమల మీదుగా పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్నారు. భక్తులందరికీ 24 గంటలూ మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలకు అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నెల ఏడు వరకు ఇదే తరహాలో అనుమతిస్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తడంతో స్నానఘట్టాలు కిక్కిరిశాయి.
గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీశైలేశుడు
శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆదివారం రాత్రి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించి.. ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాలకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం ప్రధాన మాడ వీధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్‌సింగ్, ఈఓ శ్రీరామచంద్రమూర్తి, చైర్మన్ వంగాల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి 10గంటల నుంచి శ్రీమల్లికార్జునస్వామి వార్లకు 11 మంది రుత్వికులు వేదమంత్రోచ్ఛారణతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు అభిషేకం జరుగుతుండగానే.. మరోవైపు మల్లన్న వరుడయ్యే శుభముహూర్తం రాత్రి 10.30 నుంచి ఆరంభమవుతుంది. గర్భాలయ కలశవిమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉన్న నవనందులను కలుపుతూ అతిసుందరంగా పాగాను అలంకరిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట సమీపంలో అత్యంత శోభాయమానంగా అలంకరించిన కల్యాణవేదికపై శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవ కల్యాణం ఆగమ శాస్త్రానుసారం జరిపిస్తారు
హంసవాహనంపై విహరించిన ఆదిదేవుడు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంసవాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనంపై విహరించారు. రాత్రి హాలాహలాన్ని సేవించిన నీలకంఠుడు మగతనిద్రలోకి జారుకోగా ఆయనను మేల్కొలిపేందుకు నాగులు నిర్వహించే ఉత్సవమే నాగరాత్రి. ఉదయం హంస–చిలుక వాహనాల్లో పార్వతీపరమేశ్వర్లు పురవీధుల్లో విహరించారు. అలాగే రాత్రి కైలాసపతి శేష వాహనంపై చిద్విలాసంతో భక్తులకు ఆభయ ప్రధానం చేశారు. తల్లి జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఈవో పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా రాహుకేతు పూజలను సోమవారం రద్దు చేశారు.
నేడు కోటప్పకొండ తిరునాళ్లు
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో సోమవారం మహా తిరునాళ్ళు జరగనున్నాయి. ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. త్రికోటేశ్వరుడిని సోమవారం తెల్లవారు జాము నుంచే భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు త్రికోటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మొక్కుబడి కింద విద్యుత్ ప్రభలు, పెద్దా, చిన్న తడికె ప్రభలు నిర్మించి తీసుకురానున్నారు. అధికారులు తిరునాళ్లకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశారు. కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 255 ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేయగా, చిలకలూరిపేట, అద్దంకి, వినుకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పుతున్నారు. ఈ తిరునాళ్లను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
శ్రీకాళహస్తిలో నేడు నందిసేవ – లింగోద్భవ అభిషేకం
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి రోజున శివుడు నంది వాహనంపై ఊరేగడం ఆనవాయితీ. ధర్మానికి ప్రతీకగా ఉన్న నందిపై ఊరేగుతున్న పరమశివుని దర్శిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకోసం భక్తులు భారీ సంఖ్యలో శ్రీ కాళహస్తికి తరలి వస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవ దర్శనం ఇక్కడ మరో ప్రధానఘట్టం. విషప్రభావంతో ఉన్న శివుడు తిరిగి మేల్కొనడాన్ని లింగోద్భవంగా పిలుస్తారు. మహాశివరాత్రి రోజు రాత్రి నంది వాహనంపై స్వామి ఊరేగింపునకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి పూజారులు 10 రకాల అభిషేకాలను నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తి వెనుకభాగంలో ఉన్న లింగోద్భవ మూర్తికి 11వ అభిషేకం (లింగోద్భవ అభిషేకం) శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ అభిషేకం కేవలం మహాశివ రాత్రి రోజున మాత్రమే నిర్వహిస్తారు. వేకువజామున రెండుగంటల సమయంలో జరిగే ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment