sivaratri uthsavas
-
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం!
దేశంలో శివరాత్రి ఉత్సాహం నెలకొంది. శుక్రవారం జరిగే శివరాత్రి పూజలకు భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చి అదృశ్యమవుతాడు. దీనివెనుకగల ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్నా ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం. ఈ ఆలయం ఇలా మునిగిపోవడానికి గల కారణం గుజరాత్లోని కడనా డ్యామ్లోకి చేరిన నీరు ఈ ఆలయ ప్రాంతంలో నిలిచిపోవడం. ఇటుక, రాయి, సున్నంతో నిర్మితమైన ఈ ఆలయం సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పేరొందింది. ఈ ఆలయం బన్స్వారాకు 70 కి.మీ. దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చిలలో ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది. శివరాత్రి సమయంలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, శివుణ్ణి దర్శించుకుంటారు. నదుల సంగమ తీరం కావడంతో ఈ ఆలయానికి సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది. -
శ్రీగిరి.. భక్త జన ఝరి
శ్రీశైలం/శ్రీకాళహస్తి(రేణిగుంట)/నరసరావుపేట: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నల్లమల మీదుగా పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్నారు. భక్తులందరికీ 24 గంటలూ మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలకు అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నెల ఏడు వరకు ఇదే తరహాలో అనుమతిస్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తడంతో స్నానఘట్టాలు కిక్కిరిశాయి. గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీశైలేశుడు శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆదివారం రాత్రి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించి.. ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాలకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం ప్రధాన మాడ వీధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్సింగ్, ఈఓ శ్రీరామచంద్రమూర్తి, చైర్మన్ వంగాల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి 10గంటల నుంచి శ్రీమల్లికార్జునస్వామి వార్లకు 11 మంది రుత్వికులు వేదమంత్రోచ్ఛారణతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు అభిషేకం జరుగుతుండగానే.. మరోవైపు మల్లన్న వరుడయ్యే శుభముహూర్తం రాత్రి 10.30 నుంచి ఆరంభమవుతుంది. గర్భాలయ కలశవిమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉన్న నవనందులను కలుపుతూ అతిసుందరంగా పాగాను అలంకరిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట సమీపంలో అత్యంత శోభాయమానంగా అలంకరించిన కల్యాణవేదికపై శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవ కల్యాణం ఆగమ శాస్త్రానుసారం జరిపిస్తారు హంసవాహనంపై విహరించిన ఆదిదేవుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంసవాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనంపై విహరించారు. రాత్రి హాలాహలాన్ని సేవించిన నీలకంఠుడు మగతనిద్రలోకి జారుకోగా ఆయనను మేల్కొలిపేందుకు నాగులు నిర్వహించే ఉత్సవమే నాగరాత్రి. ఉదయం హంస–చిలుక వాహనాల్లో పార్వతీపరమేశ్వర్లు పురవీధుల్లో విహరించారు. అలాగే రాత్రి కైలాసపతి శేష వాహనంపై చిద్విలాసంతో భక్తులకు ఆభయ ప్రధానం చేశారు. తల్లి జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఈవో పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా రాహుకేతు పూజలను సోమవారం రద్దు చేశారు. నేడు కోటప్పకొండ తిరునాళ్లు మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో సోమవారం మహా తిరునాళ్ళు జరగనున్నాయి. ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. త్రికోటేశ్వరుడిని సోమవారం తెల్లవారు జాము నుంచే భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు త్రికోటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మొక్కుబడి కింద విద్యుత్ ప్రభలు, పెద్దా, చిన్న తడికె ప్రభలు నిర్మించి తీసుకురానున్నారు. అధికారులు తిరునాళ్లకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశారు. కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 255 ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేయగా, చిలకలూరిపేట, అద్దంకి, వినుకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పుతున్నారు. ఈ తిరునాళ్లను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర పండుగగా ప్రకటించారు. శ్రీకాళహస్తిలో నేడు నందిసేవ – లింగోద్భవ అభిషేకం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి రోజున శివుడు నంది వాహనంపై ఊరేగడం ఆనవాయితీ. ధర్మానికి ప్రతీకగా ఉన్న నందిపై ఊరేగుతున్న పరమశివుని దర్శిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకోసం భక్తులు భారీ సంఖ్యలో శ్రీ కాళహస్తికి తరలి వస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవ దర్శనం ఇక్కడ మరో ప్రధానఘట్టం. విషప్రభావంతో ఉన్న శివుడు తిరిగి మేల్కొనడాన్ని లింగోద్భవంగా పిలుస్తారు. మహాశివరాత్రి రోజు రాత్రి నంది వాహనంపై స్వామి ఊరేగింపునకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి పూజారులు 10 రకాల అభిషేకాలను నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తి వెనుకభాగంలో ఉన్న లింగోద్భవ మూర్తికి 11వ అభిషేకం (లింగోద్భవ అభిషేకం) శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ అభిషేకం కేవలం మహాశివ రాత్రి రోజున మాత్రమే నిర్వహిస్తారు. వేకువజామున రెండుగంటల సమయంలో జరిగే ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తారు. -
అద్భుత శిల్పాలకు ఆలవాలం
లేపాక్షి : సుందర పర్యాటక క్షేత్రమైన లేపాక్షి.. హిందూపురం పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన దేశంలో మహిమాన్వితమైన దివ్యశైవ క్ష్రేతాలు 108 ఉన్నాయి. వాటిలో ఒకటి లేపాక్షి. పాపనాశేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం, స్తంభం మలిచిన తీరు మహాద్భుతం. త్రేతాయుగంలో రావణునికి, జటాయువుకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. సీతమ్మను వెతుక్కుంటూ వచ్చిన శ్రీరాముడు ఆ పక్షి నిచూసి ‘లే పక్షీ’ అని పిలిచి దానికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రాంతమే లేపాక్షిగా మారిందట. దేశంలోనే అతి పెద్ద నంది విగ్రహం ఇక్కడే ఉంది. ఇటువంటి పుణ్య క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మాఘ బహుళ ద్వాదశి నుంచి పాల్గుణ శుద్ధ పాఢ్యమి వరకు జరుగుతాయి. ఈ నెల 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 27వ తేదీన ముగుస్తాయి. ఒకే రాతిపై ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం: ఒక పెద్ద బండపై ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం చెక్కడం చూస్తే చూసిన ప్రతి పర్యాటకులు, భక్తులు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఈ సర్పము మూడు చుట్టలతో ఏడు పడగలతో, చుట్టలపై మధ్యన శివలింగంతో యాత్రికులను ఆకర్షిస్తోంది. శిల్పి ఇంటికి భోజనానికి వచ్చారని, అయితే తన తల్లి వంట చేయలేదని, కాసేపు ఉంటే భోజనం చేస్తామని ఆమె చెప్పి వంట చేయడం ప్రారంభించింది. అంతవరకు ఏమి చేయాలని వంటశాలకు ఎదురుగా ఉన్న పెద్దబండపై ఏడుశిరస్సుల నాగేంద్రుని విగ్రహం చెక్కినట్టు, భోజనానికి రమ్మని పిలవడానికి బయటకు తల్లిరాగా పెద్ద నాగేంద్రుని విగ్రహం చూసి ఆశ్చర్యం చెందిందని స్థానికులు చెబుతున్నారు. తల్లి దిష్టి శిల్పంపై పడడం వల్ల ఈ విగ్రహానికి చీలిక వచ్చిందని పేర్కొంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నంది విగ్రహం ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహానికి ఎదురుగా పర్లాంగు దూరంలో ఒకే రాతిపై మలచిన నంది విగ్రహం వుంది. ఇంతటి అందమైన విగ్రహం భారత దేశంలో ఎక్కడా లేదని చెబుతుంటారు. 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడువుతో పైకి లేచి వస్తున్నట్టు కనబడతుంది. ఈ నంది శరీర భాగమంతా అలంకరించిన గుడ్డలతో, గజ్జెలు, గంటలు, మువ్వలతో, వచ్చే యాత్రికులను చాలా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని చూసిన అడవిబాపిరాజు ‘ లేపాక్షి బసవయ్యా లేచి రావయ్యా’ అన్నాడు. విరుపణ్ణ కులదైవం వీరభద్రస్వామి లేపాక్షి ఆలయాన్ని నిర్మించినది విరుపణ్ణ, వీరుణ్ణలు. వీరభద్రస్వామి వీరికి కులదైవం. గర్భగుడి పైకప్పులో సుమారు 24 అడగుల పొడువు, 14 అడగుల వెడల్పుతో వీరభద్రస్వామి వర్ణచిత్రం చిత్రీకరించారు. ఈ వర్ణ చిత్రం భారతదేశంలోనే పెద్ద చిత్రముగా పేరుగాంచినది. ఒక పక్క విరుపణ్ణ మరో పక్క విరుపణ్ణ భార్య పుత్రులతో స్వామిని పూజించినట్టుగా చూపించినారు. స్తంభంలో వెలసిన దుర్గాదేవి దుర్గాదేవి విగ్రహం ఒక స్తంభంలో చెక్కబడినది. శిల్పులు ఈ శిల్పాన్ని మలిచే సమయంలో దుర్గాదేవి భక్తులపై ఆవాహమై నేను ఈ స్తంభంలో ఉందునని, నాకే నిత్య పూజలు, ఆరాధనలు జరిపించవలెనని కోరిందని భక్తుల నమ్మకం. స్తంభంలో ఉన్న దుర్గాదేవి విగ్రహానికి అలంకరణలు, పూజలు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని దుర్గాదేవి ఆలయంగా కూడా స్థానికులు పిలుస్తున్నారు. అసంపూర్తిగా కల్యాణ మంటపం పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మంటపం అంసపూర్తిగానే ఉంది. ఆలయ నిర్మాణ కర్త విరుపణ్ణ ఖజానా పైకం అనవసరంగా ఖర్చు పెట్టాడని, ఆలయ నిర్మాణానికి ప్రభువుల అనుమతి తీసుకోలేదని, విరుపణ్ణ మీద గిట్టని వారు కొందరు రాజుతో లేనిపోని నిందలు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ మాటలను రాయలువారు నిజమని నమ్మి ఆగ్రహించి విరుపణ్ణ కళ్లు తొలగించాలని ఉత్తర్వులు చేసినారని, ఆ ఉత్తర్వులు విన్న విరుపణ్ణ నా కన్నులను నేనే తీసి నా స్వామికి అర్పించెదనని రెండు కళ్లు ఊడబెరికి గోడకు విసిరినట్టు, దీనివల్ల కల్యాణ మంటపం అంసపూర్తిగా మిగిలిపోయిందని చెబుతున్నారు.